మహేష్ కుమార్‌కు బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ రిప్లై..
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల్లో మర్యటిస్తున్న మహేష్ తన నిజామాబాద్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై మండిపడ్డారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల్లో మర్యటిస్తున్న మహేష్ తన నిజామాబాద్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. అనంతరం బీజేపీ ఎంపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా వీటిపై ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఇప్పుడేదో అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతోందని, కానీ రానున్న కాలంలో ఇప్పుడు బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని అర్వింత్ విమర్శించారు.
మహేష్ కుమార్ అవగాహనలేమితో మాట్లాడుతున్నారని, కౌన్సిలర్‌గా కూడా గెలవలేకపోయిన ఆయన తన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రక్షణ అనేదే కరువైందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా కమలం గుర్తుకే ఓటేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు అర్వింద్.
నిజామాబాద్‌కు స్పెషల్
‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్‌లో రూ.7కోట్ల వ్యయంతో బ్రిడ్జిల ఏర్పాటు జరుగుతోంది. నా వల్లే జిల్లాలో కాంగ్రెస్ వీక్ అయింది. రూ.93కోట్లతో చేపట్టిన మాధవనగర్ ఆర్వోబీ, రోడ్ల విస్తరణ ఇలా నియోజకవర్గానికి ఎంతో చేశాం. రాష్ట్రం ప్రభుత్వం నిధులు, బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదు. రైల్వేస్‌ను సర్కార్ అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పలు అంశాల గురించి అడుగుదామని ఫోన్ చేస్తే మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు’’ అని మండిపడ్డారు ఎంపీ.
కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ వార్నింగ్
ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, కానీ కాంగ్రెస్ శ్రేణుల్లో అది సన్నగిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించమంటూ హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉండేలా శ్రేణులు చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు, చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. రాబోయే ఎన్నికల కోసం మరింత గట్టిగా పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.