MUNNERU RIVER | మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు మోక్షం
x
మున్నేరు నదీ వరద దృశ్యం (ఫైల్ ఫొటో)

MUNNERU RIVER | మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు మోక్షం

కొన్నేళ్లుగా ఖమ్మం ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వరద కష్టాలకు సర్కార్ చరమగీతం పాడనుంది.ప్రతిపాదనల్లోనే ఉన్న మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు పచ్చజెండా...


ఖమ్మం నగర ప్రజల చిరకాల కష్టాలు త్వరలో తీరనున్నాయి. వర్షం వస్తే చాలు ఖమ్మం నగరం చెంతన ఉన్న మున్నేరు పొంగి పొర్లుతూ వరదనీటితో నదీ తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. మున్నేరు నదిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల వాహనాల రాకపోకలు కూడా నిలిచి పోతుంటాయి. మున్నేరు వరదనీరు నదీ తీర ప్రాంత ఇళ్లలోకి వస్తుంది. ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు పడుతున్న కష్టాలు మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడితే తీరనున్నాయి.

-1969 వ సంవత్సరం నుంచి పలుసార్లు మున్నేరు నదికి వరదలు వచ్చాయి. ఈ వరదలతో ఖమ్మం నగరంతోపాటు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాభై ఏళ్లుగా మున్నేరు నది వరద కష్టాలు తీర్చాలనే ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గాయి.
- ఈ ఏడాది ఖమ్మం నగరం వద్ద మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరదలతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదనీరు నాలుగురోజుల పాటు మున్నేరు తీర ప్రాంత ప్రజలను అల్లాడించింది. యాభై ఏళ్లుగా పెండింగులో ఉన్న మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుండటంతో ఖమ్మం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పనులు
మున్నేరు వ‌ర‌ద ముంపు నుంచి ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌తంగా విముక్తి క‌ల్పించేందుకు గాను చేప‌ట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం నాడు స‌చివాల‌యంలో రిటైనింగ్ వాల్ ప‌నుల పురోగ‌తిపై ఇరిగేష‌న్ అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో ఇరిగేష‌న్ ప్రిన్సిపల్ సెక్ర‌ట‌రీ రాహుల్ బొజ్జా, స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌, ఇఎన్‌సీ అనిల్ కుమార్ త‌ద‌త‌రులు పాల్గోన్నారు.

మున్నేరుకు ఇరువైపులా కాంక్రీట్ గోడలు
మున్నేరు ముంపు నుంచి ఖ‌మ్మం ప‌ట్ట‌ణాన్ని కాపాడేందుకు న‌దికి ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ గోడ‌లు నిర్మిస్తున్నామ‌ని, ఖ‌మ్మం న‌గరంలో ముంపున‌కు అవ‌కాశం లేకుండా స‌రైన మార్గంలో వ‌ర‌ద ప్ర‌వాహాన్ని న‌డిపించేందుకు స‌రైన డిజైన్ తో వాల్ నిర్మించాల‌ని అధికారుల‌కు మంత్రి పొంగులేటి సూచించారు. వాల్ నిర్మాణ‌ప‌నులు మ‌రింత వేగం పెర‌గాల‌ని , నెల‌లో రెండు సార్లు స్వ‌యంగా తానే ప‌ర్య‌వేక్షిస్తాన‌ని మంత్రి పేర్కొన్నారు.

భూసేకరణ చేపట్టండి
మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే భూ సేక‌ర‌ణ‌ను చేప‌ట్టాల‌ని ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఖ‌మ్మం జిల్లాలోని అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.వాల్ నిర్మాణానికి ఎలాంటి స‌మస్య‌లు ఎదురైనా త‌న దృష్టికి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు. 1969వ సంవత్సరం నుంచి 2024 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌ను దృష్టిలో పెట్టుకొని వాల్ నిర్మించాల‌ని మంత్రి సూచించారు.ఇటు ఖ‌మ్మం అటు పాలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్యం క‌ల్పించేలా 23 కిలోమీట‌ర్ల మేర వాల్ నిర్మిస్తున్నామ‌ని మంత్రి వివరించారు.


Read More
Next Story