
క్లూస్ టీంకు లభించిన రక్తపు చుక్క
Meerpet Murder | ఒక్క రక్తపు చుక్క హంతకుడిని పట్టించింది...
మీర్‌పేట హత్య కేసులో పోలీసులకు ఎట్టకేలకు క్లూ దొరికింది. కూపీలాగుతున్న పోలీసులు...
వేరే మహిళతో తనకున్న వివాహేతర సంబంధం బయటపడిందని,ప్రియురాలి కోసం సాక్షాత్తూ అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య వెంకట మాధవిని అత్యంత దారుణంగా చంపి, ముక్కలు చేసి, ఎముకలను పొడిగా చేసి చెరువులో, డ్రైనేజీలో పడేసి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన మానవ మృగం గురుమూర్తి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
నా భార్యను నేనే చంపాను, ఆధారాలేవి?
‘‘నాకు సమీప బంధువైన ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం గురించి నా భార్య వెంకటమాధవికి తెలియడంతోనే, ఆమె అడ్డు తొలగించుకొని ఆ మహిళతో కలిసి ఉండేందుకే హత్య చేశాను, నేను చంపినట్లు మీకు ఆధారాలున్నాయా?, నన్ను మీరేం చేయలేరు అని నిందితుడైన మాజీ జవాన్ గురుమూర్తి పోలీసులకే సవాలు విసిరారు.
వెబ్ సిరీస్ చూసి...శవం ఆనవాళ్లు లేకుండా చేసి...
వెబ్ సిరీస్ చూసి అత్యంత దారుణంగా భార్యను హతమార్చి,మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసిన మానవ మృగమైన మాజీ సైనికుడు గురుమూర్తి కేసులో పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు, క్లాస్ టీంలను రంగంలోకి దించి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. వెంకటమాధవిని తానే హత్య చేశానని భర్త గురుమూర్తి చెబుతున్నా, దీనికి సాక్ష్యాధారాల కోసం పోలీసులు యత్నిస్తున్నారు. వెంకటమాధవి మృతదేహాన్ని ముక్కలు చేసి, కుక్కరులో ఉడికించి, ఎముకలను పొడి చేసి, చెరువులో పడేసిన గురుమూర్తి తెలివిగా భార్య హత్య కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించనందును ఈ కేసు నుంచి తప్పించుకున్నానని భావించాడు.
ఒక్క టిష్యూ, రక్తపు చుక్క
వెంకటమాధవిని భర్త గురుమూర్తి చంపి, మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి మటన్ కత్తితో ముక్కలుగా చేశాడు. హంతకుడు గురుమూర్తి మృతదేహం ముక్కలను గ్యాస్ స్టౌవ్ పై బాగా ఉడికించి, ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసి వాటిని బక్కెట్ లో వేసి చెరువులో పడేశాడు. తన భార్య శవం నామరూపాలు లేకుండా పడేసిన భర్త గురుమూర్తి తనను ఎవరూ పట్టుకోలేరని ధీమాగా ఉన్నాడు. కానీ పోలీసు క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల బృందం గురుమూర్తి ఇంట్లో ప్రతీ అంగుళాన్ని పరిశీలించి, ఎట్టకేలకు గ్యాస్ స్టౌవ్ పై ఉన్న చిన్న టిష్యూ, ఒక్క రక్తపు చుక్క నమూనాలను సేకరించింది.
డీఎన్ఏ సరిపోలితే...
ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీ సాయంతో క్లూస్ టీం సేకరించిన రక్తపు నమూనా, టిష్యూను పరీక్ష కోసం ఢిల్లీలోని జాతీయ ట్రూత్ ల్యాబ్ కు పంపించింది. వెంకటమాధవికి చెందిన టిష్యూ, రక్తపు మరకను పరీక్షించి, దాన్ని వెంకటమాధవి కుటుంబసభ్యులు, పిల్లల డీఎన్ఏతో సరిపోల్చనున్నారు. ఈ పరీక్ష నివేదిక రెండు రోజుల్లో వస్తుందని, డీఎన్ఏ సరిపోలితే వెంటనే ఈ హత్య కేసులో నిందితుడైన గురుమూర్తిని అరెస్టు చేస్తామని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన మీర్ పేట హత్య కేసులో ట్రూత్ ల్యాబ్ నుంచి పరీక్షల నివేదిక రావాల్సి ఉన్నందున, ఇంకా దీన్ని అదృశ్యం కేసుగానే పెట్టామని రాచకొండ పోలీసు కమిషనర్ జి సుధీర్ బాబు చెప్పారు.
సాక్ష్యాధారాల కోసం పోలీసుల దర్యాప్తు
జనవరి 15-16వతేదీ మధ్య రాత్రి జరిగిన దారుణ హత్య సంఘటనలో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. తమ పిల్లలను బంధువుల ఇంట్లో వదిలిపెట్టి మాధవి, గురుమూర్తి మీర్‌పేటలోని తమ ఇంటికి తిరిగి వస్తూ నాలుగు సీసీటీవీ కెమెరాలలో కనిపించారు.ఆ మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో గురుమూర్తి మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.దీంతో సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సాక్ష్యాధారాలుగా సేకరించారు. మాధవికి ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేసినా , ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో గురుమూర్తికి ఫోన్ చేశారు. గురుమూర్తి వెంకటమాధవి గురించి తప్పించుకునే సమాధానాలు ఇచ్చారు.బంధువులు ఫోన్ చేసినా వెంకటమాధవి ఇంట్లో లేదని గురుమూర్తి చెప్పాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢిల్లీ నుంచి రక్తపు పరీక్ష, డీఎన్ఏ పరీక్ష నివేదిక వచ్చాకే పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేధించనున్నారు.
Next Story