ప్రభుత్వానికి మూసీ నిర్వాసితుల ఝలక్..
తెలంగాణ ప్రభుత్వానికి మూసీ నిర్వాసితులు భారీ ఝలక్ ఇచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా అధికారులు చేపడుతున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు మూసీ నిర్వాసితులు.
తెలంగాణ ప్రభుత్వానికి మూసీ నిర్వాసితులు భారీ ఝలక్ ఇచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా అధికారులు చేపడుతున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు మూసీ నిర్వాసితులు. ఎట్టకేలకు ఈరోజు హైకోర్టు నుంచి వాళ్లు స్టే ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు మూసీ నిర్వాసితులు. ఈ క్రమంలో చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఇంటిని చూసిన ప్రస్తుతం కోర్టు నోటీసులే దర్శనమిస్తున్నాయి. తమ ఇళ్లను కాపాడుకోవడం కోసం చేపట్టని న్యాయపోరాటంలో ఎంత దూరమైనా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు తేల్చి చెప్పారు. దాదాపు 100 ఇళ్ల యజమానులు ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో శరవేగంగా పూర్తి చేయాలనుకున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు కాస్త బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. కాగా ముసీ నిర్వాసితులందరికీ ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించిన తర్వాతనే కూల్చివేతలు చేపడతామని సీఎం ఇచ్చిన మాటను కూడా ప్రజలు నమ్మలేదనడానికి ఈ కోర్టు స్టేలే నిదర్శనమని పలువరు పేర్కొంటున్నారు.
సీఎం ఇచ్చిన భరోసా
చెరువులు, కుంటలు, నాలాలు కనుమరుగైతే నీరు దొరకదని, అదే విధంగా వరదలు వస్తే నగరమే అతలాకుతలం అవుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. అలాంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటి కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. మూసీ నిర్వాసితులు ఎవరూ భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరం అయితే మూసీ నిర్వాసితుల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అతి త్వరలోనే మూసీ నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.
‘‘మూసీ నిర్వాసితులకు నాదొక్కటే విజ్ఞప్తి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మీకు సేవ చేయడానికి, మంచి జీవనం అందించడానికి కట్టుబడి ఉంటుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లో అనాథల్ని చేయదు. మీకు ప్రత్యామ్నాయం చూపించే బాధ్యత ప్రభుత్వానిది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. కొందరు కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పుతున్నారు. తమ వాక్చాతుర్యంతో రెచ్చగొట్టే మాటలు చెప్పి అమాయక ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు ఎవరి మాటలు నమ్మొద్దు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలా గుడ్డిగా ముందుకు వెళ్లడం లేదు. పక్కా ప్రణాళిక, స్పష్టమైన విధానంతోనే ముందడుగు వేస్తోంది. రాష్ట్రాన్ని నిజమైన అభివృద్ధి పథంలోకి నడిపిస్తోంది. పేదల మంచి కోసమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆలోచన చేస్తుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని భరోసా ఇచ్చారు సీఎం. కానీ ఇప్పుడు మూసీ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో సీఎం మాటలపై వారికి నమ్మకం లేదన్న విషయం తేటతెల్లం అయిందని ప్రతిపక్ష వర్గాలు విమర్శిస్తున్నాయి. తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఈ ప్రభుత్వం అతి త్వరలో కూలుతుందని చెప్పామని, అందుకు అతి తక్కువ సమయమే మిగిలి ఉందని విమర్శలు గుప్పించారు.