హైదరాబాద్  మూసీ ఆగ్రహించింది...
x
బస్తీలను ముంచెత్తిన మూసీ వరద

హైదరాబాద్ మూసీ ఆగ్రహించింది...

హైదరాబాద్ నగరం మూసీ నదీ వరదలతో చిగురుటాకులా వణికిపోయింది.


మూసీనదీ ఎగువ ప్రాంతంతో పాటు నగరంలో కురుస్తున్న అతి భారీవర్షాల వల్ల హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. గత 24 గంటల్లో మూసీ నదీ క్యాచ్ మెంట్ ఏరియాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోవవడంతో వరదనీటి ప్రవాహం పెరిగిందని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో నేల తడిసి ఉండటంతో వరదనీరు భూమిలో ఇంకక పోవడం వల్ల వరద విపత్తు హైదరాబాద్ నగరానికి పెరిగిందని ధర్మరాజు చెప్పారు. సాధారణ వర్షపాతం కంటే 57 శాతం అధికంగా వర్షాలు కురవడంతో వరదలు వెల్లువెత్తాయని ఆయన వివరించారు.




మహోగ్రరూపం దాల్చిన మూసీ నది

మూసీ నదీ శనివారం మహోగ్రరూపం దాల్చింది. 1908వ సంవత్సరంలో 15వేల మందిని పొట్టనబెట్టుకున్న మూసీ వరదలు అప్పుడప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాయి. మూసీకి భారీ వరద విపత్తు వచ్చి శనివారం నాటికి 118 ఏళ్లు గడచింది. మూసీ తీర ప్రాంతంలో ఆక్రమణలతో వరద ముప్పు పెరిగింది. మూసీకి ప్రతీ ఏటా సెప్టెంబరు నెలలోనే వరదలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబరు నెల మూసీ తీర ప్రాంత ప్రజలకు తీరని వరదముప్పు మిగిలిస్తోంది. శనివారం వెల్లువెత్తిన వరదలు 50 ఏళ్ల తర్వాత మూసీకి ఉధృతంగా మరోసారి వరదలు వచ్చాయని అధికారులు చెప్పారు.

పూరానాపూల్ వద్ద పోటెత్తిన వరద
హైదరాబాద్ నగరంలోని పురానా పూల్ వద్ద మూసీ నదిలో వదర పోటెత్తింది. లంగర్ హౌస్ ప్రాంతంలోని బాపూఘాట్ నుంచి వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర నీరు పారుతోంది. ఛాదర్ ఘాట్ వద్ద వంతెన నీటమునగటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూసారం బాగ్ వద్ద మూసీలో వరదనీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. మూసారం బాగ్ వంతెన పై నుంచి 10 అడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. కొత్త వంతెనను వరదనీరు తాకుతోంది. మూసీ తీర లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.



నార్సింగి నుంచి నాగోలు దాకా మూసీ తీర ప్రాంతాలు జలమయం

నగరంలోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలోకి వరదనీరు ఎక్కువగా చేరుతుండటంతో రెండు రిజర్వాయర్ల గేట్లు తెరచి మూసీ నది దిగువకు వరదనీటిని వదిలారు. దీంతో వరదనీరు మూసీ తీర ప్రాంతాలను ముంచేసింది. మూసీ నదీ హైదరాబాద్ నగర పరిధిలోని నార్సింగి నుంచి నాగోలు వరకు ప్రవహిస్తోంది. వరదనీరు పోటెత్తడంతో నార్సింగి నుంచి నాగోలు దాకా పలు కాలనీలు నీట మునిగాయి. ఆక్రమణల వల్లనే మూసీకి వరద విపత్తు సంభవించిందని చెరువుల పరిరక్షణ కమిటీ ప్రతినిధి, పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆక్రమణలను తొలగించక పోవడం, నీటి వనరులను ఆక్రమించడంతోనే ఈ వరదలు హైదరాబాద్ తరచూ ముంచెత్తుతున్నాయని ఆమె ఆరోపించారు.



మహాత్మాగాంధీ బస్టాండును ముంచెత్తిన మూసీ వరద

హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్టాండు అయిన మహాత్మాగాంధీ (ఎంజీబీఎస్) ను వరదనీరు ముచెత్తింది. బస్టాండు అంతా చెరువును తలపింపజేస్తుంది. బస్టాండులో చిక్కుకు పోయిన ప్రయాణికులను అతి కష్టంమీద తాళ్ల సాయంతో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సురక్షితంగా తరలించారు. మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బ‌స్ స్టేష‌న్ నుంచి బ‌స్సుల రాక‌పోక‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. మూసీ వరదలు విలయతాండవం చేస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

నలుగురిని కాపాడిన హైడ్రా బృందాలు
నార్సింగి - మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా బృందాలు కాపాడాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట) గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద పారుతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా ఆటో ట్రాలీ లో డ్రైవరు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఆటో ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రాసిబ్బంది గమనించి వాళ్ళని సురక్షితంగా కాపాడారు. వాళ్లను ఒడ్డుకు చేర్చారు. ఆటో ట్రాలీ కి తాడు కట్టి బయటకు లాగారు.

గోల్నాక లంకలో పునరావాస కేంద్రం

హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట సర్కిల్ గోల్నాక లంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముంపు బాధితులకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ సందర్శించి వరద బాధితులతో మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోనీ వరద బాధితులకు భోజన సదుపాయం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.



నీటమునిగిన బస్తీలు...సీఎం ఆరా

మూసీకి వచ్చిన భారీ వరద నీటితో జియాగూడ, పురానాపూల్ ప్రాంతాలు నీట మునిగాయి.పలు బస్తీలు, కాలనీల్లోకి నీరు చేరడంతో పునరావాస కేంద్రాలకు స్థానికులను తరలించారు.వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీ కి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరివాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.అర్ధరాత్రి ఇమ్లిబన్​​ సమీపంలో ఎంజీబీఎస్​ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించారు.



బస్సుల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్​కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావటంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తెలంగాన ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో శనివారం భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్, ట్రాఫిక్​ హైడ్రా, జీ ఎచ్ ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

బస్సులు శివారు ప్రాంతాల్లో నిలిపివేత
హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి న‌డుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్ప‌ల్ క్రాస్ రోడ్డు నుంచి వెళుతున్నాయి. సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూల్, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.మూసీ వ‌ర‌ద‌నీరు చేరిన నేప‌థ్యంలో ఎంజీబీఎస్ కు ప్ర‌యాణికులు ఎవ‌రూ రావొద్ద‌ని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి న‌డిచే బ‌స్సుల‌ను ఇత‌ర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామ‌ని, ఆయా మార్గాల ద్వారా త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.


Read More
Next Story