
వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల నిరసన
కేంద్రప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తు శుక్రవారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు చేశారు
కేంద్రప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తు శుక్రవారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, దేశాన్ని పరిరక్షించాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని(Waqf amendment act) వెంటనే రద్దుచేయాలనే డిమాండుతో జిల్లాలోని కొన్ని మండలాల్లో ముస్లింలు మానవహారంగా ఏర్పడి ఆందోళనలు చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు(Muslim Personnel Law Board) పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన ఖమ్మంతో పాటు కూసుమంచి, కొత్తగూడెం, ఇల్లందులో ముస్లింలు పెద్దఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దుచేయాలని వీళ్ళు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ వ్యతిరేకంగా చేసిన సవరణ చట్టాన్ని సుప్రింకోర్టు(Supreme court) కూడా తప్పుపట్టిన విషయాన్ని ఆందోళనకారులు గుర్తుచేశారు. సవరణ చట్టంపై సుప్రింకోర్టులో జరిగిన రెండురోజుల వాద ప్రతివాదనల్లో జడ్జీలు కేంద్రప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టినట్లు చెప్పారు. కోర్టు తప్పుపట్టిన నేపధ్యంలో అయినా కేంద్రం తానుచేసిన తప్పును తెలుసుకుని తక్షణమే సవరణచట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పర్సనల్ లా బోర్డులో కీలకమైన మౌలానా మహమ్మద్ సయీద్, అహ్మద్ ఖాష్మి, ముఫ్తీ జలాలుద్దీన్, మహ్మమద్ ఇలియాస్, మహమ్మద్ అసద్, మహ్మద్ సాదిక్, ముఫ్తీ రవూఫ్ ఆందోళనకు నాయకత్వం వహించారు. కేంద్రప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి, ప్రాజాస్వమ్యపద్దతిలోనే పరిపాలన చేయాలని వీళ్ళు కేంద్రానికి హితవుపలికారు.
వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రప్రభుత్వం పూర్తిగా రద్దుచేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని కూడా వీళ్ళు ప్రకటించారు. ముస్లింల ఆందోళనలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంఆర్పీఎస్, మాల మహానాడు, ప్రజాస్వామ్యవాదులు, లంబాడి హక్కుల పోరాట సమితి, మేథావులు కూడా మద్దతుగా నిలిచారు.