హైదరాబాద్ మెట్రో: కూర్చునేకి సీటుండదు, నిలబడేకి చోటుండదు
x
Metro journey

హైదరాబాద్ మెట్రో: కూర్చునేకి సీటుండదు, నిలబడేకి చోటుండదు

పదిమంది నిలబడేంత ప్లేసులో తక్కువలో తక్కువ 30 మంది నిలబడతారు. అందరి చేతుల్లోను బ్యాగులుంటాయి కాబట్టి ప్రతి ప్యాసెంజర్ మరో ప్యాసెంజర్ కు తగులుతునే ఉంటారు.


చాలా నగరాల్లోలాగే హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్ అడ్డదిడ్డంగా ఉంటుంది. రోడ్డుమీద రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మెట్రోకు రూపకల్పన చేశారు. డీపీఆర్ పూర్తయిన కొద్దిరోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ చనిపోయిన కొద్దిరోజులకే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలవ్వటంతో చాలాకాలం మెట్రో ఊసే ఎవరూ ఎత్తలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి కేసీఆర్ మెట్రోను భుజానికి ఎత్తుకున్నారు. మెట్రో మొదటి దశ 2017, నవంబర్ 28వ తేదీన మియాపూర్ నుండి మొదలైంది.

ఆఫీసుకు వెళ్ళేటపుడు




ఇపుడు మెట్రో గురించి రాయటంలో ఉద్దేశ్యం దాని పుట్టుపుర్వోత్తరాలు కాదు. కేవలం నా అనుభవం మాత్రమే. ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర మెట్రో ఎక్కితే చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ దాటుకుని ఎంజీబీఎస్ స్టేషన్లో అప్పర్ ప్లాట్ ఫారమ్ లో దిగి కిందున్న మిడిల్ ప్లాట్ ఫారమ్ కు చేరుకుని మళ్ళీ మరో మెట్రో ఎక్కాలి. ఆర్టీసీ క్రాస్ దగ్గర మెట్రో ఎక్కినపుడు కూర్చోవటానికి హ్యాపీగా సీటు దొరుకుతుంది. ఇక్కడ ఎక్కి చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ దాటుకుని ఎంజీబీఎస్ స్టేషన్లో మెట్రో దిగాలి. సమస్యంతా ఇక్కడే మొదలవుతుంది. ఆర్టీసీ స్టేషన్ దగ్గర సీటు దొరికిందనే సంతోషం ఎంజీబీఎస్ లో మెట్రో ఎక్కినప్పటికి ఆవిరైపోతుంది. అప్పర్ ప్లాట్ ఫారమ్ లో మెట్రో దిగి కింద మిడిల్ ప్లాట్ ఫారమ్ కు బయలుదేరగానే మిడల్ ప్లాట్ ఫారమ్ మీదకు మెట్రో రావటం, బయలుదేరటం అంతా అయిపోతుంది.



మళ్ళీ మరో మెట్రో కోసం 5-10 నిముషాలు వెయిట్ చేయాల్సిందే. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన మెట్రోలోకి ఎక్కటం నిజంగా పెద్ద యుద్ధమే చేయాలి. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఎక్కినపుడు హ్యాపీగా సీటు దొరికితే ఎంజీబీఎస్ లో మెట్రోలో ప్రయాణం చేసేందుకు సీటు కాదు కదా కనీసం నిలబడేందుకు కూడా అవకాశం దొరకదు. ఆగిన మెట్రోలోకి ఎక్కాలంటే లోపలున్న వాళ్ళన్నా మరింత లోపలకు వెళ్ళాలి లేదా ఎక్కేవాళ్ళన్నా లోపలున్న వాళ్ళని మరింత లోపలకు తోసుకుని ఎక్కాలి. అంత కష్టపడి లోపలికి ఎక్కితే రెండుకాళ్ళమీద స్ధిమితంగా నిలబడేందుకు కూడా చోటుండదు. ఉదయం పూట అందరికీ ఆఫీసులకు వెళ్ళే సమయం కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది.

ఎక్కాలంటే పెద్ద యుద్ధమే



ఆ రద్దీకూడా ఎలాగుంటుందంటే ప్రతికోచ్ లోను కూర్చోవటానికి ఎదురెదురుగా ఏడుసీట్ల చొప్పున అంటే 14 సీట్లుంటాయి. ఈ 14 సీట్ల మధ్య ఓ పదిమంది నిలబడేందుకు అవకాశం ఉంటుంది. అయితే పదిమంది నిలబడేంత ప్లేసులో తక్కువలో తక్కువ 30 మంది నిలబడతారు. అందరి చేతుల్లోను బ్యాగులుంటాయి కాబట్టి ప్రతి ప్యాసెంజర్ మరో ప్యాసెంజర్ కు తగులుతునే ఉంటారు. అటు ఇటు తిరగటానికి లేదా కాలు జరపటానికి కూడా అవకాశం ఉండదు. అంత రద్దీతో ప్రయాణం చేసేటపుడు ఇక కూర్చోవటానికి సీటు ఎక్కడ దొరుకుతుంది. కూర్చోవటానికి సీటు కాదు నిలబడి ప్రయాణం చేసే అవకాశం దొరికితే చాలని అనుకునే వాళ్ళే ఎక్కువమంది ఉంటారు. మెట్రో వస్తే రోడ్లమీద ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ఏమీ తగ్గకపోగా మరింతగా పెరిగింది. మెట్రో వస్తే గమ్యస్థానం సాఫీగా చేరుకోవవచ్చన్నారు. ఇపుడేమయిందటే, మెట్రోలో సీటు దొరకడం ఇండియన్ రైల్వేల్లో లోయర్ బెర్త్ దొరకడంలా తాయరయ్యింది. నాకు తెలసిన ఒకాయన ఎల్ బి నగర్-మియాపూర్ మార్గంలో మలక్ పేట ఎక్కి అమీర్ పేట దిగుతాడు, ఒక ఏడాది గా ఆయన మెట్రోలో ప్రయాణిస్తున్నా సీటు దొరకలేదు. ఒకసారెపుడో సీటు దొరికి కూర్చోగానే రెండో స్టేషన్ రాగానే ‘ఇది సీనియర్ సిటిజన్స్ కు రిజర్వుడు’ అని ఓ పెద్దాయన అనటంతో లేచేశారు. సీటు కాదుకదా కనీసం కాలుమోపేందుకు జాగా కూడా దొరకదన్నట్లుగా తయారైంది మెట్రో ప్రయాణం.

సీటు దొరికితే అదృష్టమే




మెట్రో మొత్తంమీద సీనియర్ సిటిజన్లకు రిజర్వుడు కోచ్ ఒకటే ఉంటుంది. కోచ్ అంటే ఎన్నిసీట్లో అనుకునేరు పైన చెప్పినట్లుగా కేవలం ఎదురెదురుగా ఏడుచొప్పున 14 సీట్లు మాత్రమే. ఈ 14 సీట్ల మధ్యన నిలబడటమే కాకుండా రెండు తలుపుల మధ్య కూడా నిలబడే ప్రయాణం చేయకతప్పదు. అందుకే అంత రద్దీ ఉంటుంది. ఎంజీబీఎస్ లో ఎక్కగానే సీటు దొరికితే ఆరోజుకు అంతటి అదృష్టవంతుడు ఇంకోరుండరని అనుకోవాల్సిందే. నాకైతే ఎంజీబీఎస్ లో ఎక్కగానే సీటు దొరకటం అరుదనే చెప్పాలి. ఎంజీబీఎస్ లో ఎక్కిన తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజి, గాంధీభవన్, నాంపల్లి, లక్డీకాపూల్ స్టేషన్ల వరకు ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటే దిగేవాళ్ళు దిగుతునే ఉంటారు. కాబట్టి రద్దీలో ఎలాంటి మార్పుండదు.

ప్రతి స్టేషన్ మధ్య ప్రయాణం 3-4 నిముషాలే




లక్డీకాపూల్ దాటిన తర్వాత ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజగుట్ట, అమీర్ పేట స్టేషన్ వరకు అదే రద్దీ ఉంటుంది. అమీర్ పేట పెద్ద జంక్షన్ కాబట్టి ఇక్కడ చాలామంది దిగేస్తారు. ఎక్కేవాళ్ళు ఉన్నా సీటు దొరికే అవకాశం ఉంటుంది. అమీర్ పేటలో బయలుదేరగానే ఎస్ ఆర్ నగర్ తర్వాత స్టేషన్ ఇఎస్ఐ స్టేషనే. ఇక్కడ నేను దిగేస్తాను. అమీర్ పేట్ నుండి ఇఎస్ఐ స్టేషన్ కు నాలుగు నిముషాలే ప్రయాణం కాబట్టి అమీర్ పేటలో సీటు దొరికినా ఒకటే దొరక్కపోయినా ఒకటే. ప్రతిరోజు ఉదయం ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టేషన్లో బయలుదేరి ఇఎస్ఐ స్టేషన్ కు చేరుకుని అక్కడి నుండి ఏదో బండిలో ఆఫీసుకు చేరుకుంటాను.

తిరుగు ప్రయాణం



సాయంత్రం ఆఫీసునుండి ఇఎస్ఐ స్టేషన్ కు చేరుకుని మళ్ళీ రివర్సులో ఎంజీబీఎస్-ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ప్రయాణం. మెట్రో ప్రయాణంలో కష్టాలంటే నా ఒక్కడికే కాదు చాలామందిది ఇదే కష్టం. అయితే మెట్రో ప్రయాణంలో అన్నీ కష్టాలే అనే అనుమానం రావచ్చు. కష్టలే కాదు సుఖం కూడా ఉంటుంది. కష్ట, సుఖాలు కవలపిల్లల్లాంటివి కదా. ఇప్పటివరకు కష్టాలగురించి మాత్రమే చెప్పిన నేను ఇపుడు సుఖం గురించి వివరిస్తాను.

ప్రయాణ సమయం తగ్గిపోయింది




మెట్రో ప్రయాణంలో సుఖం ఏమిటంటే మొత్తం ఏసీలోనే ప్రయాణం చేయచ్చు. రోడ్డుమీద వెళ్ళినపుడు గంటన్నరసేపు పట్టే ప్రయాణం మెట్రోలో అర్ధగంటలోపు అయిపోతుంది. పైగా ఏసీ కదా పెద్దగా అలుపు తెలీదు. ఉదయం, సాయంత్రం బస్సుల్లో అయినా నిలువుజీవితం తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నది. దాంతో ఎక్కడున్న బస్సులూ ఆడోళ్ళకే సరిపోవటంలేదు. ఇక మగోళ్ళు ఎక్కేది ఎప్పుడు సుఖంగా కూర్చుని ప్రయాణం చేసేదెప్పుడు. కాబట్టి ఉన్న కొద్ది బస్సుల్లో మగోళ్ళు ప్రయాణం చేయాలంటే నిలబడి ప్రయాణం చేయాల్సిందే.

ఎక్కడైనా నిలబడే ప్రయాణం




ఎక్కడైనా నిలబడే ప్రయాణం చేయాలన్నపుడు అదేదో సుఖంగా ఏసీలో ప్రయాణం చేయచ్చుకదాని నేను మెట్రోలోనే ప్రయాణం చేస్తాను. ఇంటినుండి బయలుదేరి ఆఫీసుకు వెళ్ళేటపుడు నిలువు జీవితం తప్పకపోయినా తిరిగి వచ్చేటపుడు మాత్రం సీటు కచ్చితంగా దొరుకుతుంది నాకు. ఇఎస్ఐ స్టేషన్లో మెట్రో ఎక్కగానే సీనియర్ సిటిజన్ అనే కోటాలో నాకు వెంటనే సీటు దొరికేస్తుంది. ఈ విషయాన్ని నాకు మా బాస్ జింకా నాగరాజే చెప్పారు. ‘పలానా కోచ్ లో ఎక్కితే సీనియర్ సిటిజన్లకు సీటు దొరుకుతుంద’ని ఆయనే నాకు చూపించారు. నిజానికి నాకు మెట్రో ప్రయాణం పరిచయం అయ్యిందే కూడా మా బాస్ వల్లే. దాంతో అప్పటినుండి నేను అదే కోచ్ లో ఎక్కి ప్రయాణం చేస్తున్నాను. కొన్నిసార్లు ఇద్దరమూ కలిసే ప్రయాణంచేస్తాము. ఆఫీసు నుండి బయలుదేరి ఎంజీబీఎస్ లో దిగేంతవరకు సీటులో కూర్చునే ప్రయాణం చేయచ్చు.




సీనియర సిటిజన్ కాకపోయినా..

నిజానికి నేను ఇంకా సీనియర్ సిటిజన్ను కాలేదు. అయినా సరే కోచ్ లోకి ఎక్కగానే ఎవరో ఒకళ్ళు లేచి కూర్చోమని సీటు ఆఫర్ చేస్తారు. లేదంటే ఎవరో పెద్దాయన పక్కనున్న కుర్రాడిని లేపి నాకు సీటు ఇవ్వమని చెబుతారు. దాంతో కుర్రాడు లేచి నాకు సీటిచ్చేస్తాడు. అ విధంగా ఆఫీసు నుండి ఎంజీబీఎస్ కు అక్కడి మెట్రో మారి మరో మెట్రో ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్డు స్టేషన్ వరకు కూర్చునే ప్రయాణం చేస్తాను. ఆఫీసుకు వెళ్ళేటపుడు నిలబడి ప్రయాణంచేయటం కష్టంగా అనిపించినా తిరిగొచ్చేటపుడు మాత్రం సుఖంగానే ఉంటుంది ప్రయాణం.

మూడు చేపలమార్కెట్లు




ఓ పదిమంది చేరి గట్టిగా మాట్లాడుకుంటుంటే ఇంట్లో పెద్దోళ్ళు ‘ఏంది చేపలమార్కెట్టు లాగుంది’ అని అనటం అందరికీ అనుభవమే. పదిమంది మాట్లాడుకునేటప్పుడే చేపల మార్కెట్టులాగుంటే మరి ఒక కోచ్ లో తక్కువలో తక్కువ 30-40 మంది ప్రయాణం చేసేటపుడు ఇంకెలాగుంటుంది ? ప్రయాణం చేస్తే సమస్యలేదు. కాని కొంతమంది మొబైల్స్ లో మాట్లాడుకుంటుంటారు. మరికొంతమంది మొబైల్స్ లో వీడియోలు చూస్తుంటారు. చూసే వీడియోలు కూడా తమకు మాత్రమే వినబడేట్లుగా ఇయర్ ఫోన్లు పెట్టుకునే వాళ్ళు తక్కువే. కొందరు మొబైల్స్ లో వీడియోలు పెద్ద శబ్దంతో అందరికీ వినబడుతుంటాయి.




ఇక ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు కలిసి ఎక్కితే ఆపీసు విషయాలు అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒకవైపు మొబైల్లో మాటలు, మరోవైపు వీడియోల శబ్దం, ఇంకో వైపు ఫ్రెండ్స్ మాటలు ఇలాంటి నేపధ్యంలో ప్రయాణం చేయటం అంటే ఒకటేసారి మూడు చేపల మార్కెట్లలో ప్రయాణం చేసినట్లే ఉంటుంది. ఎవరిగోల ఎలాగున్నా నాకు మాత్రం ప్రయాణ సమయం బాగా తగ్గిపోవటం, పైగా ఏసీ, అందులోను సీటులో కూర్చుని ప్రయాణించటం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతిరోజు ఇదే నా మెట్రో అనుభవం. మెట్రోలో ప్రయాణంచేసే ప్రతి ఒక్కరికీ దాదాపు ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని అనుకుంటున్నాను.

Read More
Next Story