కొండా సురేఖపై కేసును వాపసు తీసుకున్న నాగార్జున
x
Minister Konda Surekha and Akkineni Nagarjuna

కొండా సురేఖపై కేసును వాపసు తీసుకున్న నాగార్జున

గురువారం కోర్టు విచారణకు డైరెక్టుగా నాగార్జున హాజరుకాకుండా ఆన్ లైన్ విచారణలో కేసును ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.


అనుమానించినట్లుగానే మంత్రి కొండాసురేఖకు వ్యతిరేకంగా దాఖలుచేసిన కేసును ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. మంత్రి(Konda Surekha)పై నాగార్జున దాదాపు ఏడాదిక్రితం నాంపల్లి స్పెషల్ కోర్టులో పరువునష్టం కేసును దాఖలు చేశారు. ఆ కేసులో ఇప్పటికే అనేక విచారణలు జరిగాయి. అయితే తెరవెనుక ఏమి జరిగిందో ఏమో హఠాత్తుగా గురువారం నాగార్జున(Akkineni Nagarjuna) కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. రాతమూలకంగా కేసును ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పటంతో కోర్టు కేసును డిస్మిస్ చేసింది.

ఈ కేసుకు సంబంధించి కొంత చరిత్రను చెప్పుకోవాలి. ఏడాదిక్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణలు చేయటంలో భాగంగా మంత్రి నాగార్జున ఫ్యామిలీపై అసభ్యకర వ్యాఖ్యలుచేశారు. మంత్రి మీడియాతో మాట్లాడుతు నాగార్జున కొడుకు నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవటానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తనదగ్గరకు పంపాలని నాగార్జునపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. కేటీఆర్ దగ్గరకు వెళ్ళటానికి సమంత అంగీకరించకపోవటంతోనే నాగార్జున ఫ్యామిలీలో గొడవలైనట్లు తెలిపారు. ఈగొడవలవల్లే సమంత ముందు ఇంట్లోనుండి బయటకు వచ్చేసి తర్వాత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నట్లు ఆరోపించారు.

తానుచేసిన ఆరోపణలకు తనదగ్గర అన్నీ సాక్ష్యాలున్నట్లు కూడా చెప్పారు. నాగార్జున ఫ్యామిలీపై మంత్రిచేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు అప్పట్లో తెలుగురాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. మంత్రికి వ్యతిరేకంగా అక్కినేని నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా కోర్టులో పరువునష్టం కేసులు దాఖలుచేశారు. ఈరెండు కేసుల్లోను మంత్రి విచారణకు హాజరవుతున్నారు. గురువారం కోర్టులో కేసు విచారణకు రావాల్సుండగా బుధవారం అర్ధరాత్రి మంత్రి ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే నాగార్జున ఫ్యామిలీకి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు ఉంది. తనవ్యాఖ్యలతో నాగార్జున కుటుంబానికి బాధకలిగించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.


కేసువిచారణకు ముందురోజు మంత్రి ట్విట్టర్ ద్వారా బహిరంగంగా నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పటంతోనే అనుమానం వచ్చేసింది. తెరవెనుక ఏదో జరిగింది అనే అనుమానాలు పెరిగిపోయాయి. కేసును కోర్టులోనే ఎదుర్కోవటానికి సిద్ధపడి ఇన్ని వాయిదాలకు హాజరైన మంత్రి సడెన్ గా బుధవారం ట్విట్టర్ ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనే సందేహాలు పెరిగిపోయాయి. తెరవెనుక ఏదో జరిగి మంత్రి-నాగార్జునకు మధ్య సయోధ్య కుదిరింది అనే అనుమానాలు బలపడ్డాయి. అనుమానాలు నిజమన్నట్లే గురువారం విచారణకు నాగార్జున కోర్టుకు హాజరుకాకుండా ఆన్ లైన్ విచారణలో కేసును ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. దాంతో మంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం కేసును కోర్టు కొట్టేసింది.

ఇంతవరకు బాగానే ఉందికాని కొండా సురేఖకు వ్యతిరేకంగా కేటీఆర్ దాఖలుచేసిన కేసు సంగతి ఏమిటి ? అన్నదే ఇపుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నాగార్జునకు మంత్రికి ఎవరో సయోధ్య కుదిర్చారు కాబట్టి కేసు విత్ డ్రా అయ్యింది. మంత్రికి వ్యతిరేకంగా కోర్టులో కేటీఆర్ దాఖలుచేసిన కేసు ఉపసంహరణకు ఎవరు రంగంలోకి దిగరా ? అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది. తాను దాఖలుచేసిన కేసు విషయంలో కేటీఆర్ ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story