నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇకలేరు
x

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇకలేరు

నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచారు. టీడీపీ తరపున రాజకీయాల్లోకి అరంగేంట్రం చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్ తరపున ఎంపీగా పోటీ చేశారు.


నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇకలేరు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను కుటుంబీకులు ధ్రువీకరించారు. ఆయన నాలుగు సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

ఆయన నేపథ్యం

మందా పుల్లయ్య, మందా సవరమ్మ దంపతుల కుమారుడు మందా జగన్నాథం. ఆయన తండ్రి నాగార్జున సాగర్‌లోని పైలాన్‌ కాలనీలో మెకానికల్‌ విభాగంలో వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. తల్లి నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలో ఆఫీస్‌ అటెండెంట్‌గా పనిచేసింది. మందా జగన్నాథం చిన్నవయసు నుంచే జీవన పోరాటంలో పట్టాడు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి నుండి రాత్రి 10 గంటల వరకు వరకు క్లబ్ హిల్ కాలనీలో టెన్నిస్ బాల్ పికప్ బాయ్‌గా పనిచేశాడు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పాఠశాల ఖర్చులకు వేసవి సెలవుల్లో నాగార్జున సాగర్ డ్యామ్‌లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో వాటర్ బాయ్‌గా పనిచేసేవారు. కొన్నిసార్లు వేసవి సెలవుల్లో రోజుకు 0.50 పైసల స్వల్ప రోజువారీ కూలీకి నాగార్జున సాగర్ నిర్మాణ స్థలంలో కూలీగా కూడా పని చేశారు. ఇన్ని పనులు చేస్తూ కూడా ఆయన ఒక మంచి విద్యార్థిగానే కొనసాగారు. తాను చేస్తున్న ఏ పని కూడా తన విద్యకు ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకున్నారు.

ఆయన నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి నుంచి 4వ తరగతి వరకు చదివారు. 6 నుంచి 8వ తరగతి వరకు నాగార్జున సాగర్‌లోని హిల్‌కాలనీలోని హైస్కూల్‌లో చదివారు. 9, 10వ తరగతులను వరంగల్ జిల్లా సంగంలోని జెడ్‌పీహెచ్ఎస్‌లో కొనసాగించారు. వికారాబాద్‌లోని జెడ్‌పి హైస్కూల్‌లో హెచ్ఎస్‌సీ పూర్తి చేశారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ఎంబీబీఎస్ కోర్సులో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్‌డి‌ఎల్‌ఓ, ఇ‌ఎన్‌టి స్పెషలిస్ట్ సర్జన్ కోర్సు చేశారు. సూర్యాపేటలోని సివిల్ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌గా పనిచేశారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో, హైదరాబాద్‌లోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఈఎన్‌టీ సర్జన్‌గా పనిచేశారు..

రాజకీయ రంగ ప్రవేశం:

1996లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ పార్టీలో చేరారు. ప్రథమం నుంచి కూడా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడి పార్లమెంట్ (లోక్‌సభ) సభ్యునిగా పోటీ చేసి తొలిసారిగా ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా (లోక్‌సభ) ఎన్నికయ్యారు. 1996, 1999, 2004 సంవత్సరాల్లో టీడీపీ తరుపున, 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిల్చుని విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉన్న గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. 2018 – న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినేట్ హోదాలో నామినేట్ అయ్యారు. ఆ తరువాత మరోసారి ఆయన పదవిని రెన్యూవల్ చేశారు.

Read More
Next Story