
‘భోజనం కూడా పెట్టకుండా పని చేస్తున్నారు’
పోలీసుల దాడితో వెట్టిచాకిరి నుంచి 14 మందికి విముక్తి.
నాగర్‌కర్నూల్ జిల్లా అమరగిరిలో అమానుష ఘటన వెలుగు చూసింది. చెరువులో చేపలు పట్టడానికి మనుషులు కావాలని నమ్మించి తీసుకెళ్లి.. వెట్టి చాకిరీ చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. వారి నుంచి 14 మంది కార్మికులను పోలీసులు రక్షించారు. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్, మానవ అక్రమ రవాణా సంస్థ, కొల్లాపూర్ పోలీసులు కలిసి చేసిన దాడుల్లో ఈ అంశం బయటపడింది. ఏపీ, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారిని చెరువులో చేపలు పట్టడానికి అని చెప్పి, నమ్మించి తీసుకొచ్చి.. బాండ్ రాయించుకుంటున్నారని, ఆ తర్వాత వారి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా తమకు చెరువులో చేపలు పట్టాలని చెప్పి తీరా తీసుకుని వచ్చాక నదిలో చేపలు పట్టిస్తున్నారని వారు పోలీసులకు తెలిపారు.
‘‘సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు. నకనకలాడుతూ పడుకోవాల్సి వచ్చేంది. ఆకలి కడుపుతోనే ఎన్నో రోజులు పనిచేశాం. ఎంత పనిచేసినా వారికి తృప్తి ఉండేది కాదు. ఇంకా చేయాలని కొట్టేవారు కూడా. పనిచేయలేదంటే ఆ రోజు నరకయాతన చూడాల్సి వచ్చేది’’ అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలీసుల దాడులతో తమకు ఆ వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమకు రక్షించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అసలు విషయం ఏంటంటే..
అమరగిరిలోని కృష్ణానదిలో ఆంధ్ర, ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకొచ్చి నిర్భంధించారని ఫిర్యాదు వచ్చింది. ఎవరో ఓ వ్యక్తి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చెందిన మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ ఈ అంశంపై ఫోకస్ పెట్టి ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేశారు. అందులో మొత్తం 14 మంది కార్మికులకు ఆ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. వారిలో ఒడిశాకు చెందిన వారు 11 మంది, ఏపీ విశాఖకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం ఆ కార్మికులను తమతమ స్వగ్రామాలకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని తీసుకొచ్చి, నిర్బంధించి పని చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.