అర్థరాత్రి నుంచే నాగోబా జాతర! ఆదివాసీల అతిపెద్ద పండుగ
మెస్రం వంశస్తులు కోనేరు నుంచి కొత్త కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఇవాళ అర్ధరాత్రి నాగోబాకి అభిషేకం చేయనున్నారు
నాగోబా జాతర తొలి ఘట్టానికి సర్వం సన్నద్ధమైంది. మెస్రం వంశస్తులు కోనేరు నుంచి కొత్త కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఇవాళ అర్ధరాత్రి నాగోబాకి అభిషేకం చేయనున్నారు. ఈ అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరిగే గోండు గిరిజనుల పండుగ. ఇది రెండవ అతిపెద్ద గిరిజన కార్నివాల్. గోండ్ & పర్ధాన్ తెగలకు చెందిన మేసారం వంశం 10 రోజుల పాటు జరుపుకుంటారు.పుష్య అమావాస్య రోజు అర్ధరాత్రి పవిత్ర జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరచడంతో.. వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆలయాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను సైతం తీసుకొస్తారు. ఒక రాగి చెంబులో పాలు, నవధాన్యాలు, మొలకలు అన్నిటికీకొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు 'పైకెత్తినట్లు' కనిపిస్తే పూజా కార్యక్రమం ఆరంభిస్తారు.
మెస్రం వంశస్తుల తొలిపూజ
జాతర సమయంలో.. చేసే పూజల్లో మెస్రం వంశ ఆడపడుచులు, అల్లుళ్లకు ప్రత్యేకస్థానం కల్పిస్తారు కుల పెద్దలు. జాతర సమయంలో 22 తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేస్తారు. వీరంతా తెల్లని ముసుగు ముఖంపై ధరించాల్సి ఉంటుంది. ఆలయం పక్కనే ఉన్న గోవాడ్‌లో వారం రోజుల పాటు బస చెసే మెస్రం కోడళ్లు స్నానం కూడా చేయకుండా పవిత్రంగా ఉంటారు. నాగోబాకి అర్ధరాత్రి పూజలు అయ్యాక.. కుల పెద్దలు నాగోబాకి వీరందరిని పరిచయం చేయ్యడం ఇక్కడి ఆనవాయితీ. గిరిజనుల ఆచారం ప్రకారం బేటింగ్‌లో పాల్గొనని కొత్త దంపతులకు ఆలయ ప్రవేశం ఉండదు. తర్వాతి సంవత్సరం మల్లి జాతర సమయంలో బేటింగ్‌లో పాల్గొంటేనే వారికి దర్శనానికి అనుమతి ఉంటుంది.
పూజలు ముగిశాక జాతర షురూ..
అర్ధరాత్రి పూజలు ముగిశాక జాతర ప్రారంభమౌతుంది. ఐదు రోజులపాటు ఈ జాతర కొనసాగుతుంది. జాతరలో భాగంగా మరో ప్రధాన ఘట్టం దర్భార్. ప్రతీ ఏటా ప్రభుత్వం నిర్వహించే దర్బార్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్భార్ కొనసాగుతుంది. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. అధికారులు-గిరిజనులు-ప్రజాప్రతినిధులు ఫేస్ టు ఫేస్ గా దర్భార్‌లో చర్చించుకోవచ్చు.
తరలివస్తున్న గిరిజనులు..
ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నాగోబా జాతరకి ఐదారు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున గిరిజన, గిరిజనేతర భక్తులు హాజరౌతారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నాగోబా విరాజిల్లుతుండటంతో ఏటా భక్తుల సంఖ్య మంరింత పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి మెస్రం వంశస్తుల విధానాలు, ఆచారాలు సంప్రదాయాలు చూసేందుకు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతర సందర్భంగా వస్తుంటారు.