మొదలైన సీఎంల బిగ్ మీటింగ్
ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశమయ్యారు.
తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై చర్చలు మొదలయ్యాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశమయ్యారు. వీళ్ళతో పాటు రెండు రాష్ట్రాల మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. విభజన సమస్యల్లో ప్రధానంగా నీటి వాటాలు, విద్యుత్ సంస్ధల బకాయిలు, స్ధిరాస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్ధలు సుమారు 240 దాకా ఉన్నాయి.
నిజానికి ఈరోజు సమావేశంలో జరిగేదేమీ ఉండదు. సమస్యలపై చర్చించేందుకే సమయం సరిపోతుంది. పదేళ్ళపాటు పేరుకుపోయిన సమస్యలు ఒక్క మీటింగ్ లో పరిష్కారమైపోతాయని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే సమస్యల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ చూపించి సమావేశం అవ్వటమే కీలకం. ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే ఇలాంటి సమావేశాలు ఇంకా చాలా జరగాల్సుంటుంది. నిజానికి ఇపుడున్న సమస్యల్లో చాలావరకు ప్రధాన కార్యదర్శుల స్ధాయిలో పరిష్కారమైపోతాయి. అయితే ఇన్ని సంవత్సరాలైనా కాలేదంటే అందుకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళే కారణం. సరే, చరిత్రను వదిలేస్తే ఇప్పటికైనా ముఖ్యమంత్రులు సమావేశమవ్వటం సంతోషించాల్సిన విషయమే.
సమస్యల పరిష్కారానికి ఒక రోడ్డుమ్యాప్ ఏర్పాటుచేసే విషయంలో ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ రోడ్డుమ్యాపు తయారీలోనేరెండు రాష్ట్రాల నుండి మంత్రులను నియమించి వారితో పాటు చీఫ్ సెక్రటరీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులుంటారని సమాచారం. రోడ్డుమ్యాప్ ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రతి సమావేశానికి సీఎంలు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. సమస్యల పరిష్కారానికి చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది. అందుకనే ఆ కసరత్తంతా రోడ్డుమ్యాప్ బాధ్యుతలపైన వేసేసి రెండు వైపుల నుండి ఒక నిర్ణయం వచ్చిందని అనిపించినపుడు అప్పుడు ముఖ్యమంత్రులు పాల్గొని మమ అనిపిస్తారు. తర్వాతే ముఖ్యమంత్రుల జాయింట్ ప్రకటన ఉంటుంది. ఈ పద్దతిలోనే ఐదేళ్ళల్లో చాలావరకు సమస్యల పరిష్కారం అవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ మీటింగులో సమస్యలపైన మాత్రమే చర్చలు జరుగుతాయి. తర్వాత మెల్లిగా పరిష్కారం వైపు చర్చలు జరుగుతాయి.