
పోక్సో కేసు దోషికి 21ఏళ్ల జైలు..
బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు.
నల్లగొండ జిల్లాలో 2018లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఏడు సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత తమకు న్యాయం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు. చిట్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018 ఫిబ్రవరిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. 2022 నుంచి నల్లగొండ పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో తాజాగా న్యాయస్థానం తీర్పులు వెలువరించింది. నిందితుడు దోమల రామును దోషిగా నిర్దారిస్తూ అతడికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాంతో పాటుగానే అతడికి రూ.30వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం. అయితే మైనర్లపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు, ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా రోజురోజుకు ఇటువంటి ఘటనలు పెరుగుతుండటంతో మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.