నామ పార్లమెంట్‌లో బెస్ట్ ఎంపీ...ఎలా అయ్యారంటే...
x
పార్లమెంటులో మాట్లాడుతున్న నామ నాగేశ్వరరావు (ఫొటో : లోక్‌సభ టీవీ సౌజన్యంతో)

నామ పార్లమెంట్‌లో బెస్ట్ ఎంపీ...ఎలా అయ్యారంటే...

రెండుసార్లు ఖమ్మం ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసిన నామ నాగేశ్వరరావు ఆదర్శ ఎంపీగా నిలిచారు. బెస్ట్ ఎంపీ ఎలా అయ్యారంటే...


సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ బడా పారిశ్రామికవేత్త అయిన నామ నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చాక, తన పూర్తి కాలాన్ని ప్రజాప్రతినిధిగా వెచ్చిస్తున్నారు. మొదట ఖమ్మం జిల్లాలో గ్రానైట్, చక్కెర, ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనల నిర్మాణ పనులు చేసిన మధుకాన్ గ్రూపు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు. తన తండ్రి నామ ముత్తయ్య పేరిట ట్రస్టును ఏర్పాటు చేసిన నామ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు.

అప్పటివరకు మధుకాన్ గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసిన నామ నాగేశ్వరరావు ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ‘‘నా కుటుంబానికి చెందిన మధుకాన్ గ్రూపు సంస్థల వ్యాపార బాధ్యతలను నా సోదరులు, డైరెక్టర్లు, కుమారులకు అప్పగించాను,అందుకే నా పూర్తి సమయాన్ని ప్రజల కోసం వెచ్చించగలుగుతున్నాను’’అని నామ నాగేశ్వరరావు చెప్పారు.

ఖమ్మం పార్లమెంట్ నుంచి రెండు సార్లు ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసిన నామ పార్లమెంటులో మాత్రం తన గళాన్ని సమర్ధంగా వినిపించి ఆదర్శ ఎంపీగా నిలిచారు.


పార్లమెంటుకు 88.3శాతం హాజరు
17వ లోక్‌సభలో ఖమ్మం ఎంపీగా, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నామ నాగేశ్వరరావు రికార్డు నెలకొల్పారు. గత అయిదేళ్లలో పార్లమెంట్ సమావేశాలు 273 రోజులు జరగ్గా, తెలంగాణ ఎంపీ నామ 241 రోజుల పాటు అంటే 88.3శాతం సభకు హాజరై రికార్డు నెలకొల్పారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడమే కాదు వివిధ ప్రజా సమస్యలపై 202 ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో ఎక్కువ రోజులు సభకు హాజరైన ఎంపీగా నామ నిలిచారు. పార్లమెంట్ సమావేశాలకు సభ్యులు సరిగా హాజరుకాకపోవడం సర్వసాధారణం. కాని దీనికి భిన్నంగా నామ ఖమ్మంతోపాటు తెలంగాణ సమస్యలపై తన గళాన్ని పార్లమెంటులో వినిపించారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం నామ తన వాణిని వినిపించారు. పలు బిల్లులపై నామ మాట్లాడారు. పలు అంశాలపై పార్లమెంటులో జరిగిన చర్చల్లో నామ పాల్గొని తెలంగాణ పక్షాన తన వాదనను గట్టిగా వినిపించారు.

15వ లోక్‌సభలోనూ గళమెత్తిన నామ
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా 15వ లోక్‌సభకు ఎన్నికైన నామ 2009 వ సంవత్సరం నుంచి 2014వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలకు 86 శాతం హాజరు అయి అప్పట్లోనూ రికార్డు నెలకొల్పారు. అప్పట్లో తెలుగు రాష్ట్రం నుంచి ఎంపీల సగటు హాజరు శాతం 68 శాతం కాగా, నామ 86 శాతం సమావేశాలకు హాజరయ్యారు. సభకు హాజరు కావడమే కాకుండా 114 డిబేట్లలో పాల్గొని 488 మంది ప్రశ్నలను పార్లమెంటులో సంధించారని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. ప్రశ్నలు సంధించడంలోనూ నామ రికార్డు నెలకొల్పారు. పామాయిల్, వరి పండించే రైతుల సమస్యలపై నామ లోక్ సభలో గళమెత్తారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 123 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. రూ.93 కోట్లతో బ్రిడ్జీల నిర్మాణం చేపట్టారు.కొవ్యూరు-భద్రాచలం రైల్వేలైను, జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు, ఎంపీల్యాడ్స్ నిధులతో అభివృద్ధి పనులు చేశానంటారు ఎంపీ నామ.

ఎంపీగా పూర్తి సమయం కేటాయిస్తున్నాను : నామ నాగేశ్వరరావు
ఖమ్మం ఎంపీగా తనను ప్రజలు ఎన్నుకున్నందున వారి సమస్యలను తీర్చేందుకు నా వంతు కర్తవ్యంగా కృషి చేస్తున్నానని నామ నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘పేదరికం నుంచి వచ్చిన నాకు ప్రజల కష్టసుఖాలు తెలుసు...అందుకే ప్రజలు నాకు ఎంపీగా అప్పగించిన బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించాను. పార్లమెంట్ సమావేశాలకు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా పూర్తిగా హాజరయ్యే వాడిని, కానీ మన తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు, ఇతర అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, ఇతర సమావేశాల వల్ల 86 శాతం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొన్నాను. ఇదే రికార్డు. నా ఖమ్మం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చేందుకు ఎంపీగా,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాను’’ అని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఎన్నెన్నో పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలు
17వ లోక్‌సభ పదవీ కాలంలో పార్లమెంట్ లైబ్రరీ కమిటీ ఛైర్మన్‌గా నామ నాగేశ్వరరావు సేవలందిస్తున్నారు. జనరల్ పర్పస్ కమిటీ, లెజిస్లేషన్ సబార్డినేట్, పబ్లిక్ అండర్ టేకింగ్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఖమ్మం ఎంపీగా, బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడిగా పార్లమెంటులో నామ తన వాణిని వినిపించారు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ సమస్యలపై పోరాడారు. హైదరాబాద్ నగరంలోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా, తన తండ్రి నామ ముత్తయ్య ట్రస్ట్ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు,18నీళ్ల ట్యాంకులు, పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు, ఆటోడ్రైవర్లు, హమాలీలు 2లక్షలమందికి ఖాకీ చొక్కాలను తన ట్రస్టు నిధులతో అందించానని నామ వివరించారు.























Read More
Next Story