కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ వాయిదా..
x

కేటీఆర్ పరువు నష్టం దావాపై విచారణ వాయిదా..

కేటీఆర్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కీలక ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది కోర్టు.


‘నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణం. ఎన్ కన్వెషన్‌ను పడగొట్టకూడదంటే సమంతనను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ కోరారు’’ అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల ఆమె వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్బంగా ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ కేటీఆర్ సహా నలుగురు సాక్షులు బాల్క సుమన్, తుల ఉమ, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్‌ల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించింది కోర్డు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అదే రోజున వీరి స్టేట్‌మెంట్లను కూడా న్యాయస్థానం రికార్డ్ చేయనుంది. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆమె వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీ అంతా తప్పబట్టింది. సోషల్ మీడియా వేదికగా సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు సైతం ఆమె మాటలను ఖండిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఇది వరకే ఆమె వ్యాఖ్యలపై నటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది.

కేటీఆర్ ఏమన్నారంటే..

‘‘నా పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించి నా, నా కుటుంబ పరువను రోడ్డుకీడ్చారు. రాజకీయ లబ్ధి కోసమే ఆమె ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేశారు. బీఎస్ఎస్ సెక్షన్ 356 కింద ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పిటిషన్ దాఖలు చేయడానికి ముందే వారం రోజుల్లోగా మంత్రి తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో లీగల్ నోటీసులు పంపుతానని కేటీఆర్ హెచ్చరించారు. అయితే తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కొండా సురేఖ కొట్టిపారేయడంతో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరిగింది.

నాగార్జున ఏమని కేసు వేశారంటే..

కొండా సురేఖపై నాగార్జున ఫైల్ చేసిన పిటిషన్ విచారణ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్బంగా పిటిషన్ వేయడానికి కారణం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అందుకు నాగార్జున బదులిస్తూ.. ‘‘మంత్రి కొండా సురేఖ.. నా కుటుంబం గురించి అమర్యాదగా వ్యాఖ్యలు చేశారు. ఆమె తన వ్యాఖ్యల ద్వారా మా కుటుంబం పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి ఇండస్ట్రీలో కానీ, సమాజంలో కానీ మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబానికి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. మా కుటుంబీకులు అనేక జాతీయ స్థాయి అవార్డులు కూడా అందుకున్నాం. అటువంటి మా కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు విడాకులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమని చెప్తూ మంత్రి అసభ్యకరంగా మాట్లాడారు. ఆమె మాటల వల్ల మా పరువుకు భంగం కలిగింది. అందుకు న్యాయం పొందాలనే పిటిషన్ దాఖలు చేశాం. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నాను’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.

Read More
Next Story