కొండా సురేఖకు నాన్ బెయిలబుల్
x

కొండా సురేఖకు నాన్ బెయిలబుల్

కేటీఆర్ దాఖలు చేసిన చేసిన పరువునష్టం కేసులో న్యాయస్థానం కీలక నిర్ణయం.


మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు భారీ షాక్ ఇచ్చింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. కేటీఆర్‌ను ఉద్దేశించిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ఆయన పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతోనే న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ కేసు విచారణు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.

కేటీఆర్‌పై మంత్రి సురేఖ 2024 అక్టోబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ అలవాటు, రేవ్ పార్టీల నిర్వహణ వంటి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ నటులు నాగ చైతన్య–సమంత విడాకులకు కేటీఆర్ కారణమని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్లో అక్కినేని కుటుంబాన్ని కూడా లాగడం పెద్ద దుమారమే రేపింది. ఈ ఆరోపణలు టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.

కేటీఆర్ కేసు

తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొనలేదని కేటీఆర్ పేర్కొంటూ, ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠ, కుటుంబానికి గాయపరిచాయని పిటిషన్‌లో తెలిపారు. సురేఖకు ముందుగా లీగల్ నోటీసు ఇచ్చినా స్పందన రాకపోవడంతో నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో ప్రైవేట్ క్రిమినల్ డిఫమేషన్ కంప్లైంట్ దాఖలు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 356 (క్రిమినల్ డిఫమేషన్), బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్లు 222, 223 కింద కేసు నమోదు చేశారు.

కోర్టుకు వీడియో రికార్డింగ్స్, వార్తా కథనాలు, హైపర్‌లింక్స్, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలు సమర్పించారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ సాక్ష్యాలు నమోదు అయ్యాయి. కోర్టు ఇప్పటికే సురేఖపై డిఫమేటరీ వ్యాఖ్యలు చేయరాదని, చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి ప్లాట్‌ఫార్ముల నుంచి తొలగించాలని ఆదేశించింది. అలాగే హైదరాబాద్ పోలీసులకు క్రిమినల్ కేసు నమోదు చేయాలని సూచించింది.

సురేఖ వ్యాఖ్యల్లో అక్కినేని కుటుంబాన్ని లాగడంతో 2024 అక్టోబర్‌లో అక్కినేని నాగార్జున్ కూడా పరువు నష్టం కేసు వేశారు. 2025 నవంబర్‌లో సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున్ ఆ కేసు వెనక్కు తీసుకున్నారు. అయితే కేటీఆర్‌కు మాత్రం సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంతో కేసు కొనసాగుతోంది. సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ కావడంతో ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Read More
Next Story