కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు..
సమంత, అక్కినేని ఫ్యామిలీ, కేటీఆర్‌లపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
సమంత, అక్కినేని ఫ్యామిలీ, కేటీఆర్‌లపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయాల కోసం ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేయడం సబబు కాదని, అందులోనూ అసలు రాజకీయాలతో సంబంధం లేని వారిని ప్రస్తావించడం ఏమాత్రం సరైన పద్దతికాదని ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ సీనియర్లు సైతం కొండా సురేఖకు సూచించారు. ఇంతలోనే నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అదే అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోర్టుకెక్కారు.
సదరు మంత్రి తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించారని, నిరాధారమైన ఆరోపణలు చేసిన తనను, తన కుటుంబ పరువును బజారుకీడ్చారంటూ కేటీఆర్ తన పరువునష్టం దావా పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా కేటీఆర్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మంత్రికొండా సురేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. కొండా సురేఖకు ఆమె వ్యాఖ్యలపై మొట్టికాయలు వేసింది. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సర్వసాధారణమైనప్పటికీ.. నిరాధారణ ఆరోపణలు చేయడం చేయడం సబబు కాదని న్యాయస్థానం పేర్కొంది.
వెంటనే తొలగించండి..
ఈ కేసు విచారణలో భాగంగా కొండా సురేఖ వ్యాఖ్యలపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని మొట్టికాయలు వేసింది. అంతేకాకుండా కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన యూట్యూబ్, వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ అన్నింటిలో కొండా సురేఖ వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా మీడియా ఔట్‌లెట్స్ కూడా ఆమె వ్యాఖ్యలకు సంబంధించి పోస్ట్ చేసిన ఆర్టికల్స్‌ను తొలగించాలని పేర్కొంది న్యాయస్థానం. సోషల్ మీడియా నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని ఫేస్‌బుక్, గూగుల్, యూట్యూబ్ సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. ఇకపై ఎప్పుడూ కూడా కేటీఆర్‌పై ఇటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని కొండా సురేఖను ఆదేశించింది నాంపల్లి న్యాయస్థానం. అనంతరం కేసు విచారణను నవంబర్ 21 వరకు వాయిదా వేసింది కోర్టు. ప్రస్తుతం నాంపల్లి న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నా పరువు తీయాలనే ఈ వ్యాఖ్యలు: కేటీఆర్
అయితే కొండా సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేసిన నేపథ్యంలో అధికారులను కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. అందులో తన, తన కుటంబ పరువును తీయాలన్న ఉద్దేశంలోనే సదరు మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని నేను కూడా చెప్పలేను. వ్యక్తిగతంగా నాకు, బీఆర్ఎస్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే మంత్రి ఈ తరహా వ్యఖ్యలు చేశారు. బహిరంగంగా అసభ్య పదజాలం వినియోగించడం సబబు కాదు. ఆమె చేసిన వ్యాఖ్యలను పిటిషన్‌లో పేర్కొన్నాను. నన్ను, సాటి మహిళ సమంతను ఉద్దేశించి సదరు మంత్రి ఎంతటగి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారో.. వాటిని కోర్టులో చెప్పలేను’’ అని కేటీఆర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే మరోవైపు నటుడు నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసి ఉన్నారు. ఆయన కేసుపై కూడా అతి త్వరలో విచారణ జరగనుంది.