
నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు
మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ మెయిల్
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు గురువారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ అంశం స్థానికంగా కలకలం రేపింది. ఈ బెదిరింపు మెయిల్ గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది హుటాహుటిన కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాంబ్ స్క్వాడ్‌ను కూడా అక్కడికి పంపించారు. కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
భద్రతా చర్యలలో భాగంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అక్కడ ఉన్న ప్రజలను బయటకు తరలించారు. కోర్టు ప్రాంగణం మొత్తాన్ని ఖాళీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాంబ్ స్క్వాడ్ అనుమానాస్పద వస్తువుల కోసం ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ తనిఖీలు కొనసాగిస్తోంది. మరోవైపు, బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి వివరాలను గుర్తించేందుకు పోలీసులు సైబర్ నిపుణుల సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని భద్రతా చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఇటీవల శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకే తరహాలో వరుసగా జరుగుతున్న ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారు? ఎక్కడి నుంచి ఈ కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి? అనే అంశాలపై సైబర్ నిపుణులతో కలిసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

