రేవంత్ పై నాంపల్లి కోర్టు సీరియస్
వచ్చేనెలలలో జరగబోయే కేసు విచారణకు కచ్చితంగా రావాల్సిందే అని రేవంత్ ను కోర్టు హెచ్చరించింది.
రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. వచ్చేనెలలలో జరగబోయే కేసు విచారణకు కచ్చితంగా రావాల్సిందే అని రేవంత్ ను కోర్టు హెచ్చరించింది. ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం నాంపల్లి కోర్టులో ఓటుకునోటు కేసు విచారణ జరిగింది. విచారణకు హాజరవ్వాలని నిందితులందరికీ కోర్టు ముందే నోటీసులు జారీచేసింది. నిందితుల తరపు లాయర్లు కూడా విచారణకు హాజరయ్యే విషయాన్ని చెప్పే ఉంటారు. అయితే ఈరోజు జరిగిన విచారణకు రేవంత్ రెడ్డితో పాటు మత్తయ్య, ఉదయసింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ హాజరుకాలేదు.
పిటీషనర్ల తరపు లాయర్ నిందితుల గైర్హాజరు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో కోర్టు మండిపోయింది. ఈరోజు జరిగిన విచారణనుండి మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించిన కోర్టు వచ్చేనెల 16వ తేదీన జరగబోయే విచారణకు మాత్రం కచ్చితంగా హాజరవ్వాల్సిందే అని స్పష్టంగా ఆదేశించింది. ఓటుకునోటు కేసు విచారణను తెలంగాణా నుండి మరో రాష్ట్రం హైకోర్టుకు ముఖ్యంగా భోపాల్ హైకోర్టుకు బదిలీ చేయమని దాఖలైన పిటీషన్ను సుప్రింకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ఓటుకునోటు కేసులో నాటి నిందితుడే ఇపుడు సీఎంగా ఉన్నారు కాబట్టి విచారణ ప్రక్రియ సాఫీగా, నిష్పక్షపాతం జరగదని జగదీష్ చెప్పారు. కేసును విచారిస్తున్న ఏసీబీ కూడా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశంలేదని పిటీషనర్ చెప్పారు.
ఎందుకంటే రేవంత్ దగ్గరే ప్రస్తుతం హోంశాఖ కూడా ఉన్నది. హోంశాఖను పర్యవేక్షిస్తున్న రేవంత్ కు వ్యతిరేకంగా ఏసీబీ ఏ విధంగా స్వతంత్రంగా వ్యవహరించగలదు అనే అనుమానాన్ని జగదీశ్ వ్యక్తంచేశారు. అయితే మాజీమంత్రి అనుమానాలను సుప్రింకోర్టు బేస్ లెస్ అని కొట్టేసింది. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని రేవంత్ కు, కేసు వివరాలను రేవంత్ కు రిపోర్టు చేయద్దని ఏసీబీని సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవటం కాదు అసలు కోర్టు విచారణకే రేవంత్ తో పాటు చాలామంది హాజరుకావటంలేదు. దాంతో కేసు విచారణల మీద విచారణలు పడుతోంది. అందుకనే ఈ కేసు సంవత్సరాలైనా ఇంకా కోర్టుల్లోనే నానుతోంది. మరి వచ్చేనెల 16వ తేదీ విచారణకు అయినా రేవంత్ హాజరవుతారో లేదో చూడాల్సిందే.