Konda Surekha | కొండా సురేఖ మాటలతో నాగార్జున కుటుంబం కుంగిపోయిందా..?
x

Konda Surekha | కొండా సురేఖ మాటలతో నాగార్జున కుటుంబం కుంగిపోయిందా..?

నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యలకు గానూ మంత్రి కొండా సురేఖ.. క్రిమినల్ చర్యలు ఎదుర్కోవడానికి అర్హులేనంటూ నాగార్జున తరపు న్యాయవాది అశోక్.. కోర్టులో వాదించారు.


సమంత(Samantha), అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే(KTR) కారణమంటూ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు అక్కినేని నాగార్జున(Nagarjuna) కుటుంబాన్ని ఎంతో ఆవేదనకు గురి చేశాయని నాగార్జున తరపు న్యాయవాది ఈరోజు కోర్టు విచారణలో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు(Nampally Court)లో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో కొండా సురేఖ తరుపు న్యాయవాది గురుమిత్ సింగ్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఆయన ఈరోజు కోర్టులో కొండా సురేఖ తరపున వాదనలు వినిపించారు. మంత్రి ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యాఖ్యలు చేయలేదని గురుమిత్ వివరించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తోసిపుచ్చే క్రమంలో భావోద్వేగానికి లోనైన క్రమంలో ఆమె అటువంటి వ్యాఖ్యలు చేశారని మంత్రి తరపు న్యాయవాది వివరించారు. అయితే మంత్రి మాటలతో నాగార్జున కుటుంబం తీవ్ర మానసిక వ్యధకు గురైందని అక్కినేని కుటుంబం తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు.

కుంగిపోయిన నాగార్జున కుటుంబం

‘‘నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఎక్స్(ట్విట్టర‌్)లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారు. ‘నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు’ అని కొండా సురేఖ ట్విట్ చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు. ఈ కామెంట్ల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయారు" అని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు.

వ్యక్తిగతాలను గౌరవించండి: నాగార్జున

‘‘రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, వారి వ్యక్తిగత విషయాలను గౌరవించింది. మీ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కోసం ఎటువంటి సంబంధం లేని వారి పర్సనల్ అంశాలను వాడుకోవద్దు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. ఈ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’’ అని నాగార్జున గతంలోనే కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.

అసలేం జరిగిందంటే..

"సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు.. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఒత్తిడిపెట్టారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళటం ఇష్టంలేదని సమంత తెగేసి చెప్పారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో ఉండొద్దని చెప్పటంతోనే సమంత నాగచైతన్యకి విడాకులిచ్చి ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అక్కినేని ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ, మీ స్వార్ధ రాజకీయాల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను బయటకి లాగొద్దంటూ చురకలంటించారు.

ఘాటుగా స్పందించిన అక్కినేని ఫ్యామిలీ, సమంత..

సురేఖ ఆరోపణలపై అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు, సమంత సీరియస్ గా స్పందించారు. రాజకీయంగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు తమను పావులుగా ఉపయోగించుకోవద్దని మంత్రిని ఎక్స్ వేదికగా కోరారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండని అభ్యర్ధించారు. బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉండి తమ కుటుంబం విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నాగార్జున కోరారు. ఇక సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... విడాకులు తన వ్యక్తిగతమని, ఊహాగానాలను మానుకోవాలని కోరారు. రాజకీయాల్లోకి తమ వ్యక్తిగత జీవితాలను తీసుకురావద్దని హెచ్చరించారు.

Read More
Next Story