
‘కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు లేవు’
కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా చెలరేగుతున్న అంతర్గత విభేదాలపై పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్ నటరాజన్ స్పష్టతనిచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు విరాజిల్లుతున్నాయి. పార్టీలోకి వచ్చిన కొత్త నేతలు, పాత నేతలకు మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గు మనేలా పరిస్థితులు నెలకొన్నాయి. యూత్ కాంగ్రెస్‌లో కూడా పదవుల విషయంలో ఇప్పటికే విబేధాలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ బీటలవారుతుందన్న ప్రచారం జోరందుకుంది. కాగా పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మీనాక్షి నటరాజన్.. ఈ వార్తలపై స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఏమీ జరగడం లేదని స్పష్టం చేశారు. అభిప్రాయాల బేధాలంటే ప్రతి పార్టీలో ఉంటాయని, ప్రతి గ్రూప్‌లో ఉంటాయని అన్నారామే. తనపై పార్టీ అధిష్ఠానం, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, పార్టీ సిద్ధాంతాలను మరింత బలోపేతం చేస్తానని ఆమె చెప్పారు. శుక్రవారం మీనాక్షి నటరాజన్.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ వచ్చిన అతికొద్ది సమయంలో ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అందులో పలు కీలక అంశాలపై మాట్లాడారు.
రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా
— Subbu (@Subbu15465936) February 28, 2025
మా పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు
కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ
పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి - మీనాక్షి నటరాజన్#Congress #RahulGandhi pic.twitter.com/X9EtR3PQLO
‘‘తెలంగాణ కాంగ్రెస్ లో పని చేయడానికి ఖర్గే ,రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తా. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా. మా పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం ఎక్కువ. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుంది. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో దానిని ముందుకు తీసుకువెళతాం’’ అని చెప్పారు.
అయితే మీనాక్షి నటరాజన్ శుక్రవారం సాదాసీదాగా ఢిల్లీ నుంచి రైల్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమెకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెను కలిశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండాసురేఖ కూడా మీనాక్షి నటరాజన్‌కు శాలువా కప్పి ఆహ్వానించారు. మరికాసేపట్లో ఆమె గాంధీభవన్‌లో పార్టీని ఉద్దేశించి మాట్లాడనున్నారు.