కోరుకునే తెలుగు బాట పట్టిన ‘బెస్ట్ టీచర్’  డాక్టర్ మృదుల
x

కోరుకునే తెలుగు బాట పట్టిన ‘బెస్ట్ టీచర్’ డాక్టర్ మృదుల

హైదరాబాద్ బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల అసోసియెట్ ప్రొఫెసర్ డాక్టర్ నందవరం మృదులకు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డు లభించింది.ఈ అవార్డు సాధించిన మృదుల విజయ ప్రస్థానం.


హైదరాబాద్ నగరంలోని బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నందవరం మృదులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ అవార్డును సెప్టెంబరు 5వతేదీన గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఢిల్లీలో ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద మెరిట్ సర్టిఫికెట్, 50వేల రూపాయల నగదు రివార్డు, సిల్వర్ మెడల్ ను ప్రదానం చేస్తామని కేంద్ర ఉన్నత విద్య మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఈక్రం రిజ్వీ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కేంద్ర ఉన్నతవిద్య మంత్రిత్వశాఖ ఈ అవార్డును ప్రదానం చేయనుంది. దేశంలో 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి డాక్టర్ మృదుల ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. డాక్టర్ మృదుల విజయ ప్రస్థానం వివరాలు...ఆమె మాటల్లోనే...

ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి...

‘‘మాది సికింద్రాబాద్ నగరంలోని ప్యాట్నీ ప్రాంతం. మాది ఉమ్మడి కుటుంబం. చిన్ననాటి నుంచి నాకు తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే నేను తెలుగు భాషలో ఎంపీ, పీహెచ్ డీ చేసి అసోసియేటెడ్ ప్రొఫెసరుగా బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు తెలుగు భాషను బోధిస్తున్నాను.’’ అని ఆమె ఫెడరల్ కు చెప్పారు.

బాల్యంలో భువనేశ్వరి టీచర్ స్ఫూర్తితో...

‘‘నేను సికింద్రాబాద్ లోని పరోపకారిణి బాలికోన్నత పాఠశాలలో చదివాను. 125 ఏళ్ల మా పాఠశాలని సీతమ్మ బడిగా పిలిచేవారు.ఈ పాఠశాలలో ఏడాదికి ఐదు రూపాయల ఫీజు చెల్లించి చదివాను. నేను చదివిన పాఠశాలలో భువనేశ్వరి అనే తెలుగు టీచరు పాఠాలు బోధించింది. మా టీచర్ భువనేశ్వరి స్ఫూర్తితోనే నాకు తెలుగు భాషపై ఆసక్తి ఏర్పడింది. తెలుగు సాహిత్యం వైపు నన్ను నడిపించి ఆమె బోధనయే. తెలుగులోనే పాఠశాల టీచరు అవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని చదివాను. నేను పాఠశాల టీచరు కాలేక పోయినా, తెలుగులో ఎంఫిల్, పీహెచ్ డీ చదవడం వల్ల నేరు లెక్చరరుగా చేరి అసోసియేట్ ప్రొఫెసరు స్థాయికి పదోన్నతి పొందాను.’’

అంచెలంచెలుగా ఎదిగి...

‘‘తెలుగులో పీహెచ్ డీ చేసి 1998వ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరరుగా చేరాను. 2010వ సంవత్సరంలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పదోన్నతి పొందాను. అనంతరం అసోసియెట్ ప్రోఫెసరుగా పదోన్నతి పొంది బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను.నేను రాసిన తిక్కన హరినాథతత్వం, తిక్కన సీస పద్యాలు- పరిశీలన పుస్తకాలు ముద్రణ దశలో ఉన్నాయి.’’




ఉత్తమ ఉపాధ్యాయురాలు ఎలా అయ్యానంటే...

‘‘బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు తెలుగు పాఠాలను విడమర్చి భావయుక్తంగా అర్థం అయ్యేలా బోధించడంనాకు ఇష్టం. దానికి తోడు నేను సామాజిక సేవా కార్యక్రమాలలో కూడ పాల్గొంటాను. రెండు గ్రామాలను దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల నాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు లభించింది.విద్యాబోధనలో కొత్త విధానాలు అవలంభించడం,తెలుగులో చేసిన పరిశోధనలు, నేను విద్యార్థినులకు పాఠాలను నాటికలు, బుర్రకథలు, సోది ద్వారా ఆకట్టుకునేలా చెబుతుంటాను.’’ అని చెప్పారు.


సేవా కార్యక్రమాల కోసం రెండు గ్రామాల దత్తత
‘‘నేను జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రాం ఆఫీసరుగా 9 ఏళ్లపాటు పనిచేశారు. నాకు గ్రామాల్లో ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయడం అంటే నాకెంతో ఇష్టం. అందుకే మెదక్ జిల్లాలోని అవుసుపల్లి, నర్సాపూర్ ప్రాంతంలోని పెద్దచింతకుంట గ్రామాలను దత్తత తీసుకొని విద్యార్థినులతో కలిసి వెళ్లి అక్కడ పలు సేవా కార్యక్రమాలు చేపట్టాను. నేను దత్తత తీసుకున్న పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు గ్రామాల్లో ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాను. గ్రామీణ పేదలకు సేవలందించడంలోనే నాకు సంతృప్తి ఉంది.’’అని ముగించారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు డాక్టర్ మృదుల.
---
ఉన్నతవిద్యావంతురాలు డాక్టర్ మృదుల
హైదరాబాద్ నగరంలోని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అసోసియెట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్ మృదుల నందవరం ఉన్నత విద్యావంతురాలు.1991వ సంవత్సరంలో హైదరాబాద్ యూనివర్శిటీలో తెలుగులో ఎంఏ చేశారు.యూజీసీ అకడమిక్ స్టాఫ్ కాలేజీలో జేఆర్ఎఫ్ కోర్సు చేశారు.హైదరాబాద్ యూనివర్శిటీలో తెలగులో ఎంఫిల్ చేశారు.2018వ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో తిక్కన సీస పద్యాలు,పరిశీలన పేరిట పీహెచ్‌డీ చేశారు.


పలు సంస్థల్లో సభ్యురాలిగా...
డాక్టర్ మృదుల పలు ప్రొఫెషనల్ సంస్థల్లో సభ్యురాలిగా ఉన్నారు. గ్లోబల్ మెనేజ్ మెంట్ కౌన్సిల్ ఫెలో సభ్యురాలిగా, ఎడిటోరియల్ బోర్డు లైఫ్ మెంబరుగా డాక్టర్ మృదుల ఎంపికయ్యారు.హన్మకొండలోని పింగళి మహిళా డిగ్రీ కళాశాల బోర్డు సభ్యురాలిగా ఉన్నారు.తెలంగాణ కళాశాల విద్య కమిషనరేట్ లాంగ్వేజ్ జర్నల్ సభ్యురాలిగా ఉన్నారు.

ఎన్నెన్నో అవార్డులు
1989 వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్శిటీ తెలుగులో గోల్డ్ మెడల్ సాధించారు. ఉస్మానియా యూనివర్శిటీ సంస్కృతంలోనూ గోల్డ్ మెడల్ పొందారు. 1991లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంఏ తెలుగులో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ యూనివర్శిటీలో ఎంఫిల్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.2018వ సంవత్సరంలో సెప్టెంబరు 5వతేదీన టీచర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ నుంచి నేషన్ బిల్డర్ అవార్డు పొందారు. 2018లో అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నుంచి పీహెచ్ డీలో గోల్డ్ మెడల్ సాధించారు. 2020-21లో బెస్ట్ ఆన్ లైన్ ఎడ్యుకేటర్ అవార్డు 2020-21 పొందారు. 2023లో బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు దక్కింది.

పలు పుస్తకాల రచన
డాక్టర్ మృదుల నందవరం తెలుగు సాహిత్యంలో పలు పుస్తకాలు రాశారు. స్థానిక విద్యా విధానం, వివిధ భాషలు- వివిధ విషయాలపై పుస్తకాన్ని ప్రచురించారు.మేఘమాల-కవితాత్మకత, పద్యం, జీవిత చరిత, జానపద సాహిత్యం, తెలంగాణ కథల పొదరిల్లు, గుడూరి సీతారాం, ఆంధ్ర మహాభారతం, కవితా ధర్మం,తిక్కన దశకుమార చరిత్ర,భారత ఫలం,నన్నయ్య భారతం -బాల్యం,తిక్కన సీస పద్యం చందోపరియత్వం,రామదాసు కీర్తనలు-చందోఛాయలపై మృదుల వ్యాసాలు రాశారు.తెలంగాణ ఉన్నత విద్య స్టేట్ కౌన్సిల్ టెక్ట్స్ బుక్ కమిటీ సభ్యుడిగా 2021,2022లో డాక్టర్ మృదుల పనిచేశారు. బేగంపేట డిగ్రీ మహిళా కళాశాల లిటరరీ మాగజైన్ కమిటీ కన్వీనరుగా పనిచేశారు.

బేగంపేట మహిళా కళాశాలకే గర్వకారణం : కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి
తెలుగు అధ్యాకురాలు డాక్టర్ మృదులరు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు లభించడం మా బేగంపేట మహిళా కళాశాలకే గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ కాల్వపల్లి పద్మావతి చెప్పారు. విద్యాబోధనలో కొత్త విధానాలు అవలంభించడం, తెలుగు భాషలోని మాధుర్యాన్ని విద్యార్థినులకు వివరించి చెప్పడం, రెండు గ్రామాలను దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టిన మా కళాశాల అధ్యాపకురాలు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ స్థాయి అవార్డు లభించడం మాకెంతో సంతోషాన్నిచ్చిందని పద్మావతి వివరించారు.



Read More
Next Story