
సందర్శకులతో కిక్కిరిసిన జూపార్కు
నెహ్రూ జూపార్కు రికార్డ్ @ ఒకేరోజు 24 వేల మంది సందర్శకులు
వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం నాడు నెహ్రూ జూపార్కు సరికొత్త రికార్డును సృష్టించింది.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆదివారం నాడు ఒక్క రోజే 24వేల మంది సందర్శకులు తరలివచ్చారు. వేసవి సెలవులు ముగియనుండటంతోపాటు ఆదివారం సెలవు కావడం, వాతావరణం చల్లబడటంతో జంతుప్రేమికులు జూపార్కులోని వన్యప్రాణులను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ నగరవాసులు అందులోనూ ఎక్కువ మంది జంతుప్రేమికులు నెహ్రూ జూపార్కును తమ విహార యాత్రకు గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
సందర్శకులతో కిక్కిరిసిన జూపార్కు
నలుమూలల ఎత్తైన పచ్చని చెట్లు, మీరాలం చెరువు, జాతీయ రహదారిపై ఉన్న నెహ్రూ జంతుప్రదర్శన శాఖ ఆదివారం వేలాదిమంది సందర్శకులతో కిక్కిరిసి పోయింది. సందర్శకులు జూపార్కుకు పోటెత్తడంతో జూలో నిర్వహణ కోసం ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు.
జూపార్కు గేటు వద్ద సందర్శకుల కోసం అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు బ్యాటరీలతో పనిచేసే వాహనాలు, మంచినీటి యూనిట్లను ఏర్పాటు చేశారు.
జంతుప్రేమికులకు అవగాహన
నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 194 కంటే ఎక్కువ అరుదైన జాతుల వన్యప్రాణులతో కలిసి 2,300 జంతువులున్నాయి. భారతదేశంలోనే బహిరంగంగా ఉన్న జూలలో హైదరాబాద్ మొదటి జూ పార్కు.చుట్టూ పచ్చని చెట్లు, మీరాలం ట్యాంక్ మధ్య సహజ వాతావరణంలో ఏర్పాటు చేసిన జూపార్కులో జంతువులు ఇంట్లో ఉన్న అనుభూతి చెందుతాయి.జంతువులను బహిరంగ కందకాలు లేదా బోన్లలో ఉంచి సందర్శకులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. జంతువులను, వాటి ఆవాసాలను రక్షించడం, సందర్శకులలో వన్యప్రాణుల సంరక్షణ అవగాహనను ప్రోత్సహించడానికి, సరీసృపాల అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు.
సందర్శకులకు జూ అధికారుల కృతజ్ఞతలు
హైదరాబాద్ నగర వాసులు విహార యాత్రకు నెహ్రూ జూపార్కును ఎంచుకొని జంతువుల పట్ల ఆసక్తితో తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు జూపార్కుల తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ జూపార్కులో ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు సందర్శకుల్లో అవగాహన కల్పించామని జూ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
Next Story