
ఇదే చివరి దీపావళి అవుతుందని తల్లీ, కొడుకులు అనుకోలేదు
దీపావళి(Deepavali festival) పండుగకు తన దగ్గరకు తల్లి, సోదరుడు రాకపోయినా బాగుండేదని ఇపుడు గుండెలవిసేలా రోధిస్తున్నారు
మొన్నజరుపుకున్నదే తమకు చివరి దీపావళి అవుతుందని ఆ తల్లీ, కొడుకులు ఊహించలేదు. కర్నూలు దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లీ, కొడుకులు మరణించారు. ప్రమాదంలో తల్లి, సోదరుడు చనిపోయారని తెలుసుకున్న హైదరాబాద్(Hyderabad) పటాన్ చెరుకు చెందిన పద్మ భోరుభోరున విలపిస్తున్నారు. దీపావళి(Deepavali festival) పండుగకు తన దగ్గరకు తల్లి, సోదరుడు రాకపోయినా బాగుండేదని ఇపుడు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
విషయం ఏమిటంటే ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు అగ్నిప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 22 మంది చనిపోయారు. వీరిలో బెంగుళూరులో ఉంటున్న ఫిలోమినన్ బేబి, కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. పిలోమినన్ దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ పటాన్ చెరులో ఉంటున్న కూతురు పద్మ దగ్గరకు వచ్చారు. అందరు కలిసి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. పండుగ అయిపోయిన తర్వాత తల్లి బేబీని తీసుకుని వెళ్ళటానికి కిషోర్ హైదరాబాద్ వచ్చాడు. తల్లి, కొడుకు ఇద్దరు గురువారం రాత్రి పటన్ చెరులోని కావేరి ట్రావెల్స్ బస్సులో రాత్రి 8.30 గంటలకు ఎక్కారు.
తెల్లవారుజామున అందరు మంచినిద్రలో ఉన్న సమయంలో బస్సుకు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకు బస్సును ఢీ కొన్నదా లేకపోతే బస్సే బైకును ఢీకొన్నదా అన్న విషయాన్ని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. మొత్తానికి బైకును ఢీకొన్న ఘటనలో ప్రమాదంజరిగింది. ప్రమాదం ఎలాజరిగిందంటే బైకు బస్సుకింద ఇరుక్కుపోయింది. కింద ఇరుక్కుపోయిన బైకును బస్సు ఈడ్చుకుంటే సుమారు 300 మీటర్లు దూరం వెళ్ళింది. దాంతో బైకు ట్యాంకు రోడ్డుకు బాగా రాసుకున్నది. ఆ ఒరిపిడిలో బైక్ పెట్రోల్ ట్యాంకులోనుండి మంటలు రేగి బస్సు ఇంజన్ కు అంటుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సును నడిపిన డ్రైవర్ దొరికితే కాని అసలు ఏమి జరిగిందన్న విషయం తెలీదు.
జరిగిన ప్రమాదంలో బస్సులోని 22మంది మంటల్లో సజీవదహనం అయిపోయారు. మంటలు, పొగలకు మేల్కొన్నవారిలో సుమారు 19 మంది గాయాలతో బతికి బయటపడ్డారు. చనిపోయిన వారిలో బేబీ, కిషోర్ కూడా ఉన్నారు. ఒకేసారి తల్లి, సోదరుడిని కోల్పోయిన పద్మ గుండెలవిసేలా రోధిస్తున్నారు. దీపావళి పండుగకు తన దగ్గరకు రాకపోయినా తల్లీ, సోదరుడు బతికుండేవారని పద్మ ఇపుడు రోధిస్తున్నారు.

