కేటీఆర్ కి ట్విట్టర్ లో ధీటైన సమాధానం
x

కేటీఆర్ కి ట్విట్టర్ లో ధీటైన సమాధానం

"శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్". కేటీఆర్ ట్వీట్ కి నెటిజన్లు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.


రోజురోజుకీ బీఆర్ఎస్ పరిస్థితి దిగజారిపోతోంది. ఓవైపు పదేళ్లు అధికారంలో పదవులు అనుభవించి, అధికారం కోల్పోగానే జారుకుంటున్న నేతలు. మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న అవినీతి కేసులు. గట్టిగా ఊపిరి పీల్చుకుని బయటకొచ్చి ఇది అధికార పక్షం కావాలనే మాపై కుట్ర చేస్తోంది అంటూ ఒక వేలు చూపిస్తే.. మీరు గతంలో ఇలానే చేశారు కదా అంటూ నాలుగు వేళ్ళు వారివైపే చూపిస్తున్నాయి. ఇప్పుడు అదే పరిణామం కేటీఆర్ కి ఎదురైంది. కడియం శ్రీహరి, కేకే వంటి కీలక నేతలు పార్టీ వీడుతున్న నేపథ్యంలో శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టును పెట్టారు.

"శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్" అని కేటీఆర్ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కి అంతే ధీటుగా నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.

కేటీఆర్ ట్వీట్ - శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్

ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కెసిఆర్

అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు

ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు

నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం"


ఆయన చేసిన ఈ ట్వీట్ పై కొందరు అభిమానులు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరికొందరు మాత్రం విమర్శల బాట పట్టారు.


"ఉద్యమ కారులను వదిలి వలస దారులు తో పార్టీ కూర్పు చేస్తే ఇలానే కుప్ప కూలుతుంది. ఈసారైనా తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళను కలుపుకొని పార్టీ కూర్పు చేసుకోండి" అని ఒక యూజర్ హితవు పలికారు.

"కెసిఆర్ ని మనం అమృతం అనుకున్నాము కానీ

అవినీతి, స్వార్ధం, కుటుంబం, అహంకారం కలిసి ఆ అమృతం విషం అయ్యింది.

అమృతాన్ని విషం చేయవచ్చు కానీ

విషాన్ని అమృతం చేయగలమా?

విషాన్ని పారబోయటం తప్ప వేరే మార్గం లేదు.

మన తెలంగాణకి కావాల్సింది అసలు సిసలు బతుకమ్మలు కానీ

నిషా "కవితమ్మలు" కాదు

మన తెలంగాణాకి కావాల్సింది మన సాంప్రదాయ మొక్కలైన వేప రావి కానీ విషపూరితమైన కొనొకార్పస్ మొక్కలు కాదు

మన తెలంగాణ కి కావాల్సింది మంచి చేసే టెక్నాలజీ ఉండాలి కానీ, ఆ టెక్నాలజీ తో వేరే వాళ్ళ బెడ్రూమ్ లలోకి చూసే నిఘా నాయకులు వద్దు

పంచభూతాలలో ఒకటైన నీటిని తన స్వార్ధ ప్రయోజనాలకు వాడుకునే నాయకుడు వద్దు

కల్వకుంట్లకి పాలు పోసి పెంచాము,

కానీ అది మనల్ని కాటు వేయబోయింది

ఇప్పుడు మనం ఏమి చేయాలి?" అని క్రిటిక్ అనే ట్విట్టర్ యూజర్ నిలదీశారు.

"ఉద్యమంలో తనకి తోడు ఉన్న వారిని వెళ్లగొట్టి, తన కుటుంబానికి , ఉద్యమంలో లేని వారికీ పదవులు ఇచ్చి, ఇప్పుడు ఈ స్థితి కి వచ్చింది పార్టీ..

గత పదేళ్ల అధికారం లో అప్పుడు ఉద్యమం లో తనకి తోడుగా ఉన్న ఎవరు అతనిపక్కన లేరు, ఉద్యమ ద్రోహులు అన్న వారికీ పదవులు, పక్క పార్టీ నుండి వచ్చినవారికి అలంకరణలు, చేసి, ఎందుకు అని అడిగితే మాది రాజకీయపార్టీ అని చెప్పారు.. ఇప్పుడు మీరు చేసిన ఆ రాజకీయం మీకు ఇతర పార్టీ లు చూపిస్తున్నాయి..

ఇప్పుడు తెలంగాణ వచ్చింది, అప్పుడు తెలంగాణ కోసం పోరాడినవాళ్లు, మీ తీరు నచ్చకున్నా, మీ ఒంటెద్దు పోకడలు ఇబ్బందిగా ఉన్న తెలంగాణ కోసం అన్ని భరించారు.. ఇప్పుడు మీరు రాజకీయం మాత్రమే చేస్తూ, అధికారంను పక్క పార్టీ లు నాశనానికి, మన అహానికి ఉపయోగించారు, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని రాజేయడం అంత సులభం కాదు.. ఇప్పుడు పాలకులు, ప్రజలు, అందరూ తెలంగాణ వాళ్ళే, ఇంకా ఉండేది ఫక్తు రాజకీయమే.. ఇక్కడ ఇక ఆడాల్సిందే రాజకీయ క్రీడానే.. ఇక్కడ అది ఎవరు బాగా ఆడితే వాళ్లదే విజయం.." అని మరో యూజర్ రియాక్ట్ అయ్యారు.

సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి కరువైంది. జాలి చూపించే నోళ్ళకంటే తగిన శాస్తి జరిగింది అనేవాళ్లే ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల నుండి పార్టీ బతికిబట్టగట్టాలంటే రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ ఏదైనా అద్భుతం చేయాల్సిందే అని పార్టీనే నమ్ముకున్న గులాబీ శ్రేణులు ఆరాటంగా ఎదురు చూస్తున్నారు.

Read More
Next Story