తెలంగాణా రాజకీయాల్లో కొత్త పోకడలు
x
Neelam Madhu Congress leader

తెలంగాణా రాజకీయాల్లో కొత్త పోకడలు

ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేటపుడు, లెటర్ హెడ్లమీద, విజిటింగ్ కార్డుల మీద కంటెస్టెడ్ క్యాండిడేట్ అని గొప్పగా వేయించుకుంటున్నారు.


తెలంగాణా రాజకీయాల్లో కొత్త పోకడలు కనబడుతున్నాయి. అదేమిటంటే ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఏదన్నా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేటపుడు, లెటర్ హెడ్లమీద, విజిటింగ్ కార్డుల మీద కంటెస్టెడ్ క్యాండిడేట్ అని గొప్పగా వేయించుకుంటున్నారు. నిజానికి ఎన్నికల్లో పోటీచేసినపుడు గెలుపు, ఓటమి రెండే చూస్తారు ఎవరైనా. గెలిచిన నేత తన పేరు పక్కనే ఎంపీ అనో లేకపోతే ఎంఎల్ఏ అనో వేసుకోవటం అందరికీ తెలిసిందే. పలానా ఎల్లయ్య ఎంఎల్ఏగా గెలిస్తే తన పేరుతో పాటు పలానా నియోజకవర్గం ఎంఎల్ఏ అని వేయించుకుంటారు. ఓడిపోయిన వారు సింపుల్ గా పేరుతో పాటు పలానా పార్టీ అని మాత్రమే వేయించుకుంటారు, చాలామంది అదికూడా వేయించుకోరు.

అయితే ఈమధ్యనే కొత్త పోకడ పెరిగిపోతోంది. అదేమిటంటే ఎన్నికల్లో ఓడిపోతే అడ్వర్టైజ్మెంట్లలో కంటెస్టెడ్ క్యాండిడేట్ అని ప్రముఖంగా వేయించుకుంటున్నారు. ఎక్కడైనా గెలుపు గొప్పే అని చెప్పక తప్పదు. ఇదే సమయంలో ఓడిపోవటం అవమానం ఏమీకాదు. కాకపోతే ఎంతైనా ఓటమి ఓటమే. అయితే ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయామని చెప్పుకోవటాన్నే కొత్తపద్దతిలో కంటెస్టెడ్ క్యాండిడేట్ అని చెప్పుకోవటం, ప్రకటనల్లో వేయించుకోవటం ఎక్కువైపోతోంది. ఇపుడిదంతా ఎందుకంటే ఒక దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ కనబడింది. తెలంగాణాలోని బీసీ సామాజికవర్గాల్లో ఒకటైన ముదిరాజ్ పండగ సాయన్న జయంతి సందర్భంగా మెదక్ పార్లమెంటుకు కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన నీలం మధు ముదిరాజ్ పేరుతో పెద్ద అడ్వర్టైజ్మెంట్ కనబడింది.

అందులో ముదిరాజ్ ల ముద్దుబిడ్డ, తెలంగాణా రాబిన్ హూడ్ పండగ సాయన్న జయంతి అనే పేరుతో నీలం మధు ఫొటోతో పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది. మధు ఫొటో, పేరు కింద మెదక్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అని ప్రముఖంగా అచ్చేశారు. మామూలుగా అయితే కంటెస్టెడ్ క్యాండిడేట్ అని వేయించుకోవటం గొప్పేమీకాదు. సదరు నేత స్ధాయిని పెంచేందుకు కంటెస్టెడ్ క్యాండిడేట్ అన్న హోదా ఏమీ ఉపయోగపడదు. అయినా సరే కంటెస్టెడ్ క్యాండిడేట్ అని ఎందుకు వేయించుకున్నారో అర్ధం కావటంలేదు.

ఇక ఓడిపోయిన వారితో మరో సమస్య పెరిగిపోతోంది. అదేమిటంటే అధికారపార్టీలో ఉంటు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధులతో (కంటెస్టెడ్ క్యాండిడేట్లు) ప్రోటోకాల్ సమస్యలు పెరిగిపోతున్నాయి. నిజానికి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గెలిచిన వాళ్ళు ఎంపీలు లేదా ఎంఎల్ఏలు ఎవరైనా కావచ్చు నియోజకవర్గాల్లో ప్రభుత్వపరంగా వాళ్ళకే ప్రధమ గౌరవం దక్కాలి. కాని కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎంఎల్ఏలున్నపుడు వాళ్ళపై పోటీచేసి ఓడిపోయిన వాళ్ళకే ప్రధమ గౌరవం దక్కుతోంది. అంటే శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాల్లో అధికారపార్టీ కాబట్టి సదరు నియోజకవర్గంలో గెలిచిన ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టేసి వాళ్ళపై పోటీచేసి ఓడిపోయిన వాళ్ళకే ప్రధమగౌరవం దక్కుతోంది.

ఇదే విషయంలో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు నానా గోలచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించటంలేదంటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో కొందరు ఎంఎల్ఏలు విజ్ఞప్తి చేశారు. సరే, వీళ్ళ రోధనను అధికారపార్టీ పట్టించుకునేంత సీన్ లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇపుడు ప్రోటోకాల్ గురించి ఇంత గోలచేస్తున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏలు తాము అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల విషయంలో ఏమి జరిగిందో మరచిపోయినట్లున్నారు. అందుకనే ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ మాజీ ఎల్ఏ తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) తదితరులు ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి ఈ కొత్త పోకడలు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే.

Read More
Next Story