
CRIME | తాతను చంపిన మనవడి కేసులో వెలుగుచూసిన కొత్త విషయాలు
పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు విషయాలు వెలుగుచూశాయి.తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ తాతనే మనవడు కత్తితో పొడిచాడు.
‘‘మీరు ఆస్తులను సరైన పద్ధతిలో పంపిణీ చేయలేదు, కంపెనీలో ఎవరూ నాకు గౌరవం ఇవ్వడం లేదు, నా డబ్బు నాకు ఇవ్వండి’’ అంటూ తాత వీసీ జనార్దన్ రావును మనవడు కిలారు కీర్తితేజ కత్తి తీసి కసాకసా పొడిచి చంపాడని పంజాగుట్ట పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోలీసు కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
తాత జనార్దన్ రావును అత్యంత దారుణంగా హతమార్చడంతో పాటు తల్లి సరోజినిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడైన కీర్తి తేజను ప్రశ్నించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేసి తమ కస్టడీలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రస్థుతం ఆసుపత్రిలో తల్లి సరోజిని కోలుకుంటున్నారు. ప్రస్థుతం కీర్తి తేజ రిమాండులో ఉన్నాడు. సంచలనం రేపిన ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు, కీర్తితేజ డ్రగ్ టెస్టు నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెప్పారు. ఈ కేసులో నిందితుడు కీర్తి తేజను లోతైన దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.
బ్యాగులో కత్తి తీసుకువచ్చి...
నిందితుడు కీర్తి తేజ తాత ఇంటికి వచ్చినపుడు వెంట బ్యాగులో కత్తిని తీసుకువచ్చాడని సెక్యూరిటీగార్డు వీరబాబు పోలీసులకు చెప్పారు. 2018వ సంవత్సరంలో అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చిన కీర్తితేజ ఆస్తి కోసమే హత్య చేశాడని ప్రాథమిక విచారణలో తేలిందని పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాతతో మాట్లాడేందుకు తల్లి సరోజినితో కలిసి కీర్తితేజ ఇంటికి వచ్చి ఆస్తి పంపిణీ విషయంలో తాత జనార్దన్ రావుతో వాగ్వాదానికి దిగాడని పోలీసులు చెప్పారు.
ఆస్తులు ఇవ్వాలంటూ తాతతో వాగ్వాదం
ఆస్తులను సరైన పద్ధతిలో పంపిణీ చేయనందు వల్ల తనకు కంపెనీలో గౌరవం ఇవ్వడం లేదని, తన డబ్బును తనకు ఇవ్వాలని తాతను కీర్తీ తేజ కోరాడని పోలీసులు చెప్పారు. బ్యాగులో నుంచి కత్తి తీసి తాతను 70 కంటే ఎక్కువ పోట్లు పొడిచాడని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం ననివేదిక వస్తే ఖచ్చితంగా ఎన్ని కత్తిపోట్లు అనేది నిర్ధారిస్తామని ఇన్ స్పెక్టర్ బండారి శోభన్ తెలిపారు.
Next Story