తెలంగాణ బడ్జెట్ లో ప్రత్యేక పథకాలు అవసరం
x

తెలంగాణ బడ్జెట్ లో ప్రత్యేక పథకాలు అవసరం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో పాటు విధాన పరంగా కొన్ని అంశాలు చర్చించి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి.


లోక్ సభ ఎన్నికల ముందు 2024-2025 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, పూర్తి స్థాయి బడ్జెట్ జులై 23 న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలలో జులై 25 న ప్రవేశపెడుతుందని వార్తలు వస్తున్నాయి.

గత సంవత్సరంతో పోల్చినప్పుడు, ఎక్కువో, తక్కువో రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ఎలాగూ ప్రవేశపెడతారు. కానీ ఈ బడ్జెట్ ను కూడా గత పదేళ్లుగా అనుసరించిన మార్గదర్శకాల ప్రకారమే నిధులు కేటాయించినా, ఖర్చు పెట్టినా రాష్ట్రానికి, ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు. పైగా ఇప్పటి వరకూ ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కుంటున్న మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కావు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు విషయం లో గత పదేళ్ళ పాత ప్రభుత్వ ఆలోచనా ధోరణిని మార్చుకుని, కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి. వాటిపై అసెంబ్లీలో చర్చించి ఆమోదించాలి. ఈ ఆర్ధిక సంవత్సరం లోనే అమలు లోకి తీసుకురావాలి.

సామాజిక న్యాయం కోణంలో తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు :

బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా ఎస్‌సి , ఎస్‌టి సబ్ ప్లాన్ కు చట్ట ప్రకారం పూర్తి స్థాయి నిధుల కేటాయింపు చేయాలి. గత సంవత్సరంలో ఈ పద్దు కోసం కేటాయించి ఇప్పటి వరకూ ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను కూడా ఈ బడ్జెట్ లో విడిగా చూపించి అదనంగా కేటాయించాలి.

ఎస్‌సి, ఎస్‌టి వర్గాలలో కేవలం కొన్ని ఉప కులాలకు, తరగతులకు మాత్రమే కాకుండా అన్ని ఉప కులాలకు, తరగతులకు కూడా ఆర్ధిక ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో మూల వాసులకు వివిధ శాఖల పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులలో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలి. సంచార జాతుల కుటుంబాలకు జీవనోపాధి, సంరక్షణకు ప్రత్యేక పథకాలు బడ్జెట్ లో ప్రకటించాలి.

ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలలో చదువు నుండి డ్రాప్ ఔట్ అయిన యువతీ యువకులకు వివిధ విషయాలలో ప్రత్యేక నైపుణ్య శిక్షణలు ఇచ్చి, వారి జీవనోపాధికి అవసరమైన పెట్టుబడి సహాయం అందించడానికి ప్రత్యేక స్కీములు రూపొందించి, అమలు చేయాలి .

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు (బి‌సి) వారి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. బి‌సి లలో అత్యంత వెనుక బడిన వర్గాలకు ప్రయోజనం దక్కేలా కొత్త పథకాలు ప్రకటించి, నిధులు కేటాయించాలి. మైనారిటీ వర్గాలకు, వారి జనాభాను బట్టి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. 2016 సుధీర్ కమీషన్ రిపోర్ట్ సిఫారసులను అమలు చేయడానికి ఈసారి బడ్జెట్ లో ప్రత్యేక పథకాలు ప్రకటించాలి.

వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలు :

ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటించినట్లుగా, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ కమీషన్ ను ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ప్రకటించాలి. ఈ కమిషన్ నిర్వహణ కోసం బడ్జెట్ లో కనీసం రూ.10 కోట్లు నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి కనీసం 20 శాతం నిధులతో, ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలి.

2016 లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టం ప్రకారం ఏర్పడిన తెలంగాణా వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి కమీషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని ఛైర్మన్ గా నియమించాలి. చట్టం ప్రకారం పూర్తి స్థాయి కమీషన్ ను నియమించాలి. ఈ కమీషన్ లో కనీసం ఇద్దరు మహిళలు ఉండేలా నియమాలను మార్చాలి. ఈ కమిషన్ కు కార్యాలయం నిర్వహణ, సిబ్బంది వేతనాలు, ఇతర అవసరాలకు రూ.10 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

వ్యవసాయ రంగం కోసం కేటాయించే నిధులలో నిర్వహణ పద్దు క్రింద, వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైన నిధులను కేటాయించాలి . రెండున్నర వేల ఎకరాలు లేదా 1000 మంది రైతులకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండేలా మార్గదర్శకాలు మార్చి ఈ కేటాయింపులు చేయాలి. ఈ పరిధిలో పని చేస్తున్న రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల సహకార సంఘాలను కూడా ఈ వేదికకు అనుసంధానించి, సమన్వయంతో పని చేసేలా ,వ్యవసాయ శాఖ కు ప్రత్యేక బాధ్యత ఇవ్వాలి. ఈ పరిధిలో ఒక రైతు వేదికను నిర్మించాలి. మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు ప్రత్యేక కార్యాలయం, వాహన సౌకర్యం కల్పించాలి.

రాష్ట్ర స్థాయి విత్తన కార్పొరేషన్ చురుకుగా పని చేయడానికి, రైతు సహకార సంఘాలతో ఒప్పందాలు చేసుకుని, రాష్ట్రానికి అవసరమైన విత్తనాలను రాష్ట్రం లోనే ఉత్పత్తి చేయడానికి వీలుగా, బడ్జెట్ లో కనీసం రూ. 500 కోట్లు కేటాయించాలి.

రాష్ట్ర వ్యవసాయంలో ప్రమాదకరంగా పెరుగుతున్న రసాయనాల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వీలుగా రాష్ట్ర సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టి ఆమోదించాలి. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో ఆహార పంటల ఉత్పత్తిని పూర్తిగా సేంద్రీయ విధానం లోకి మార్చడానికి వీలుగా, ఈ సారి బడ్జెట్ లో తగిన నిధులను కేటాయించి, వచ్చే రబీ సీజన్ నుండీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలి.వ్యవసాయ విద్యా, పరిశోధనలలో కూడా ఈ అంశాన్ని చేర్చాలి. వ్యవసాయ విద్యా, పరిశోధనలకు నిధులు పెంచాలి. వ్యవసాయ, అనుబంధ రంగాల విద్యా సంస్థలలో సీట్ల కేటాయింపు రిజర్వేషన్లలో కౌలు రైతుల, వ్యవసాయ కూలీల పిల్లలకు కూడా సీట్లు కేటాయించేలా, మార్గదర్శకాలు మార్చాలి.

వాస్తవ సాగు దారులకు మాత్రమే రైతు భరోసా పెట్టుబడి సహాయంగా ఎకరానికి రూ.15,000 ఇవ్వడం అవసరమే అయినా, రాబోయే కాలంలో ఈ సహాయాన్ని అందించడానికి వీలుగా కొన్ని ప్రమాణాలను ప్రాతిపదికగా పెట్టే విషయం కూడా ఇప్పటి నుండీ ఆలోచించాలి.

పొలంలో భూ సారాన్ని పెంచే పద్ధతులు అనుసరించడం, విష రసాయనాల వినియోగం తగ్గించడం, సాగు నీటిని పొదుపుగా వాడే పంటల వైపు, ఉత్పత్తి పద్ధతుల వైపు మళ్లడం, తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, స్థానిక రైతు సహకార సంఘాలలో సభ్యులుగా ఉండడం, కనీస ప్రమాణాలుగా ప్రారంభించవచ్చు.

లేకపోతే, బడ్జెట్ లో వేల కోట్లు నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నట్లు కనిపిస్తుంది కానీ, అవి రాష్ట్ర వ్యవసాయ సుస్థిర అభివృద్ధికి పెద్దగా ఉపయోగ పడవు. రాష్ట్ర పర్యావరణ సుస్థిరతకు , రైతు కుటుంబాల ఆదాయ, ఆరోగ్య సంరక్షణకు కూడా ఉపయోగపడవు. ఈ రంగంలో సత్ఫలితాలు పొందేలా నిధుల ఖర్చు జరగాలి.

గత ప్రభుత్వ ఆదేశాలతో, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ రూపొందించిన కరువు మాన్యువల్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలి. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోవడం జరుగుతున్నందున రాష్ట్ర స్థాయిలో పంటల బీమా పథకాల అమలు కోసం శాశ్వతంగా రాష్ట్ర ప్రభుత్వ పంటల బీమా కంపెనీని ఏర్పాటు చేయాలి. 2024 వానా కాలం సీజన్ నుండీ పంటల బీమా పథకాలను అమలు చేయాలి . ఇందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్ లో కనీసం రూ.3,000 కోట్లు కేటాయించాలి.

రైతు బీమా పథకాన్ని భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా విస్తరిస్తామని కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో లో పెట్టారు. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కౌలు రైతులను ప్రస్తావించి, వ్యవసాయ కూలీలను వదిలేశారు. ఈ పథకాన్ని వీరికే, పరిమితం చేయకుండా, మొత్తం గ్రామీణ ప్రజల బీమా పథకం గా దానిని మార్చాలి. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ బీమా పరిధి లోకి తీసుకు రావాలి. బీమా పథకానికి వయో పరిమితిని 60 సంవత్సరాల నుండీ రాష్ట్ర సగటు ఆయుః ప్రమాణానికి అనుగుణంగా పెంచాలి. ఈ ఆగస్ట్ 15 నుండీ రైతు బీమా పథకాన్ని మొత్తం గ్రామీణ ప్రజల బీమా పథకంగా విస్తరించడానికి వీలుగా ఈ బడ్జెట్ లో కనీసం రూ.5,000 కోట్లు కేటాయించాలి. బీమా కంపెనీకి ప్రీమియం కట్టకుండా కూడా ఈ పథకాన్ని ప్రభుత్వమే నేరుగా అమలు చేయవచ్చు.

ఈ సంవత్సరం ఖరీఫ్ నుండీ 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమలును మళ్ళీ ప్రారంభిస్తామని ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ప్రకటించాలి. ఈ చట్టం అమలు బాధ్యతను రెవెన్యూ శాఖ నుండీ వ్యవసాయ శాఖకు మారుస్తూ, మార్గదర్శకాలలో మార్పులు చేయాలి. ఈ చట్టం పై రైతులలో ఉన్న అనవసర భయాలను పోగొట్టడానికి ఈ మార్పు ఉపయోగ పడుతుంది. ఈ చట్టం ప్రకారం ఆగస్ట్ మొదటి వారంలో కౌలు రైతులను గుర్తించడం ప్రారంభించి, వారికి మిగిలిన రైతులతో పాటు, రైతు భరోసా సహాయం అందించాలి. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా చెల్లించడానికి అవసరమయ్యే బడ్జెట్ అంచనాలను కూడా ప్రభుత్వం వేసుకుని నిధులు కేటాయించాలి.

రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పడి పని చేస్తున్న రైతు సహకార సంఘాలను , రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్న సహకార సంఘాలను ఒక వేదిక మీదకు తేవడానికి వ్యవసాయ/ మార్కెటింగ్ శాఖ నోడల్ ఏజెన్సీ గా ఉంటుందని ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించాలి. ఇందు కోసం, అన్ని శాఖలతో ఒక సమన్వయ కమిటీని ఏర్పరచాలి. ఈ కమిటీ అధ్వర్యంలో పంటల ప్రణాళిక, పంటల మార్కెటింగ్, గ్రామీణ , ఆదివాసీ ప్రాంతాలలో మౌలిక వసతుల ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు తదితర అంశాలు ఉంచాలి. వ్యవసాయ శాఖ , వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలు ఈ కమిటీ లో సభ్యులుగా ఉండాలి. రైతుల, ఇతర ఉత్పత్తి దారుల ప్రతినిధులను కూడా ఈ కమిటీలో నియమించాలి. ఈ కమిటీ పని తీరును రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సమీక్షిస్తుంది. తగిన సూచనలు చేస్తుంది.

రాష్ట్ర గ్రామీణ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలను రైతులుగా గుర్తించే ప్రక్రియ వెంటనే చేపట్టాలి. వారికి రైతులుగా గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. అన్ని స్థాయిలలో జండర్ సెల్స్ ఏర్పాటు చేయాలి . వ్యవసాయ బడ్జెట్ లో కూడా మహిళా రైతుల కోసం కనీసం 33 శాతం నిధులు కేటాయిస్తూ ప్రత్యేక ప్రస్తావన చేయాలి. అమలు చేయాలి .

రైతు వేదిక భవనాలను, గ్రామీణ యువతకు సేంద్రీయ వ్యవసాయం, ఇతర జీవనోపాధులపై అవసరమైన శిక్షణ ల కోసం ఉపయోగించాలి. ఈ శిక్షణలను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి. వివిధ శాఖల అధికారులను , ఇతర నిపుణులను ఈ శిక్షణ కోసం ఎంపిక చేసుకోవాలి. వీటి నిర్వహణకు అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించాలి.

రాష్ట్రంలో ఉన్న కోటి పశువుల సంరక్షణ (మేత, ఆరోగ్యం) కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో పాడి రైతుల సహకార సంఘాలను అన్ని జిల్లాలలో ఏర్పర్చాలి. వాటిని రాష్ట్ర సమాఖ్యలో భాగస్వాములను చేయాలి. గుజరాత్ నుండీ వచ్చే కార్పొరేట్ సహకార సంఘం అమూల్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్ధు చేసుకుని, , మన రాష్ట్ర పాడి రైతులకు, గ్రామీణ కుటుంబాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం బడ్జెట్ లో అవసరమైన నిధులు కేటాయించాలి.

మన రాష్ట్రంలో ఏర్పడి పని చేస్తున్న సహకార సంఘాలు , రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, మండల, మహిళా సమాఖ్యలకు ఉచితంగా స్థలాలు ఇవ్వాలి. ఈ సహకార సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు బ్యాంకులు ఇచ్చేలా ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలి . ఈ సహకార సంఘాలకు రుణాలపై వడ్డీ రాయితీ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునే ప్రాసెసింగ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ లేదా తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాలి. అలాగే ఈ పరిశ్రమల ఏర్పాటు లో సహకార సంఘాలు చెల్లించే జి‌ఎస్‌టి మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుండి రీ యంబర్స్ చేయాలి. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని వాడుకోవడానికి వీలుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మాచింగ్ గ్రాంట్ సహకార సంఘాలకు అందించి, ఆయా సంఘాలపై భారాన్ని తగ్గించాలి.

Read More
Next Story