తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి కొత్త పాలసీ, టూరిస్టులూ ‘జరూర్ ఆనా’
x
తెలంగాణలో ఆకట్టుకుంటున్న పర్యాటక కేంద్రాలు (ఫొటోలు :పర్యాటక శాఖ సౌజన్యంతో)

తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి కొత్త పాలసీ, టూరిస్టులూ ‘జరూర్ ఆనా’

తెలంగాణలోని అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, జలపాతాలు, ప్రాజెక్టులు, సరస్సుల సందర్శనకు ‘జరూర్ ఆనా’ అంటూ పర్యాటక శాఖ ఆహ్వానిస్తోంది.


తెలంగాణలోని అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, జలపాతాలు, నదులు, ప్రాజెక్టులు, సరస్సులు ఇలా ఒకటేమిటి పర్యాటక కేంద్రాలు రా రమ్మని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి సోయగాలు, మర్చిపోలేని మధుర అనుభవాలను మిగిలిస్తున్న పర్యాటక కేంద్రాలపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం...

పురాతన చార్మినార్,లక్నవరం లేక్, హుసేన్ సాగర్ సరస్సు, వేయిస్తంభాల దేవాలయం, గోల్కొండ కోట దక్కన్ డైమండ్స్ గా నిలిచాయి. హైదరాబాద్ నగర పర్యటన పర్యాటకులను మర్చిపోలేని మధుర అనుభూతులను మిగులుస్తోంది. గోదావరి తీరంలోని భద్రాచలం దేవాలయం,గోదావరిలో లాంచీల్లో పాపికొండల పర్యటన మధుర అనుభూతులను ఇస్తుంది.



తెలంగాణ నూతన పర్యాటక పాలసీకి కేబినెట్ ఆమోదం

తెలంగాణ పర్యాటక విధానానికి (New Policy) రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.2025 నుంచి 2030వ సంవత్సరం వరకు అయిదేళ్ల పాటు అమలులో ఉండేలా పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీని కోసం పర్యాటక రంగం అభివృద్ధి (Tourism Development) కోసం పెట్టే మూలధన పెట్టుబడులపై రాయితీలు ఇవ్వాలని తెలంగాణ పర్యాటక శాఖ నిర్ణయించింది.హైదరాబాద్ నగరంతోపాటు ఆధ్యాత్మిక, చారిత్రక, ఎకో టూరిజం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. నూతన పర్యాటక పాలసీని ప్రకటించే ముందు తెలంగాణ అధికారులు సింగపూర్, మారిషస్, దుబాయ్, మలేషియా, మాల్దీవులు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పర్యాటక అభివృద్ధిపై అధ్యయనం చేశారు.



రోప్ వేలు, సఫారీలు

హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్, గండిపేట జలాశయాల వద్ద వాటర్ స్పోర్ట్సును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రోప్ వేలు, లిఫ్టులను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ సఫారీలను అభివృద్ధి చేస్తామన్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. ట్యాక్ బండ్, నెక్లెస్ రోడ్డు వద్ద స్కైవాక్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.



అభయారణ్యాలు

అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి (Tourism Boosted) చేయాలని నిర్ణయించారు.కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. నల్లమల అడవుల్లో కృష్ణానది బ్యాక్ వాటర్ ప్రవహిస్తున్న ప్రాంతంలో బోట్ షికారు అందుబాటులోకి తీసుకురానున్నారు. లక్నవరం సరస్సు సందర్శకులకు కేంద్రంగా మారింది. తెలంగాణలోని అడవుల్లో ట్రెక్కింగ్, సఫారీలను ఏర్పాటు చేయడం ద్వారా యువతను ఆకట్టుకోవాలని నిర్ణయించారు. బర్డ్ వాచింగ్ ఈవెంట్ల నిర్వహణ ద్వారా పర్యాటకులను అభయారణ్యాల వైపు ఆకర్షించాలని నిర్ణయించారు. నిజామాబాద్ లో అలీసాగర్ ప్రకృతి సోయగాలు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి. కడెం రిజర్వాయర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మంజీరా జలాశయం పర్యాటక కేంద్రాలుగా మారాయి.



జాలువారుతున్న జలపాతాలు

తెలంగాణ రాష్ట్రం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ఎతైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాల సందర్శనకు పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో బొగత, వెన్నెల, భీమునిపాదం జలపాతాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ లో సబితం, రాయికల్, నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి, మెదక్ జిల్లాలో పోచారం జలపాతాలు సందర్శకులకు సందడి చేస్తున్నాయి. నల్గొండ ఎత్తిపోతల, రంగారెడ్డిలో నానాజీపూర్, మహబూబ్ నగర్ లో మల్లెల తీర్థం జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్ నగరంలో...

లాడ్‌బజార్‌, చార్మినార్‌, మక్కా మసీద్‌, చౌమహల్లా ప్యాలెస్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, నిజాం మ్యూజియంల అభివృద్ధి చేసి పర్యాటకులను ఆటక్టుకోవాలని నిర్ణయించారు. గోల్కొండ కోటను సందర్శించే వారు నాడు కుతుబ్ షాహీలు ధరించిన దుస్తుల్లో ఫొటోలు దిగే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తుకు వచ్చేలా పర్యాటకులను బిర్యానీ వండటంలో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు.గిరిజన పర్యాటక కేంద్రాల్లో గుస్సాడీ, కొమ్ము నృత్యాలు ఏర్పాటు చేయనున్నారు. తారామతి బారాదరి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.శామీర్ పేట చెరువు, హైదరాబాద్ నలుమూలల విస్తరించి ఉన్న జింకలపార్కులు, బొటానికల్ గార్డెన్ సందర్శకులను మైమరపింప జేస్తున్నాయి.హుసేన్ సాగర్ లో బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ పార్కు, లుంబీనీ వనం, తెలంగాణ అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు, అంబేద్కర్ సచివాలయ భవనం, బిర్లామందిర్ నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటోంది. హుసేన్ సాగర్ లాంచీలో విహరిస్తూ లంచ్ చేయడం కొత్త అనుభూతిని ఇస్తుంది.



దేవాలయాలకు నిలయం...తెలంగాణ

యునెస్కో గుర్తింపు లభించిన రామప్ప దేవాలయంతోపాటు భద్రాచలం, పర్ణశాల క్షేత్రాలు, మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.రామప్ప దేవాలయంలో పేరిణి నృత్యం ఏర్పాటు చేయనున్నారు. అలంపూర్ శక్తి పీఠం, సోమశిల, కొల్లాపూర్ , బీచుపల్లి దేవాలయాలను అభివృద్ధి చేయనున్నారు.జోడేఘాట్‌, ఉట్నూర్‌, ఉషేగావ్‌, కేస్లాగూడలను పర్యాటకుల కోసం తీర్చిదిద్ద నున్నారు. భద్రాచంలోని రామాలయం, వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి పుణ్య క్షేత్రం, కాళేశ్వరం, కొండగట్టు ఆలయాలు, డిచ్ పల్లి రామాలయం, ఆలంపూర్ జోగులాంబ నవబ్రహ్మల ఆలయాలు, కొలనుపాక జైన దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. జాన్ పహాడ్ దర్గా,ధూళికట్ట భౌద్ధ స్థూపం, బాసర సరస్వతి దేవాలయం, మెదక్ చర్చ్, ముజ్జుగూడెం బౌద్ధ స్థూపాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. యాదగిరిగుట్ట దేవాలయం, వేములవాడ రాజన్న దేవాలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి.



ప్రకృతి పర్యాటక రంగం అభివృద్ధి

రాష్ట్రంలోని అనంతగిరి కొండలు, కోట్ పల్లి, పరిగి, దామగూడెం ప్రాంతాల్లో ఎకోటూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఎకో టూరిజం ప్రాంతాల్లో సాహస క్రీడలను యువత కోసం ప్రవేశపెట్టనున్నారు. గోదావరి తీరాన వెలసిన కాళేశ్వరం క్షేత్రాన్ని ప్రకృతి పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్ లో బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దనున్నారు. సాగర్ జలాశయం చెంత ఎకోటూరిజం, సాహస క్రీడలను అభివృద్ధి చేయనున్నారు.



అసెంబ్లీ, మండలి సమావేశాల్లో పర్యాటక బిల్లు

తెలంగాణలో మార్చి 12వతేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి సమావేశాల్లో కొత్త పర్యాటక విధానంపై ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. రాబోయే అయిదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులతో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించాలని పర్యాటక శాఖ భావిస్తోంది. పెట్టుబడులపై 10 నుంచి 25 శాతం రాయితీలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి సీఎం ప్రణాళిక
దేశంలోనే తెలంగాణ ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. నాగార్జునసాగర్ లో బ్యాక్ వాటర్ బోట్ హౌస్ నిర్మించాలని, తెలంగాణను వెడ్డింగ్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాలు, ఆలయాలు, జలపాతాలు, చారిత్రక ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అడ్వెంచర్ టూరిజం, వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు.

జర్మనీలో తెలంగాణ పర్యాటకంపై ప్రదర్శన
జర్మనీ దేశంలోని బెర్లిన్‌లో తెలంగాణ పర్యాటక విధానాన్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆవిష్కరించారు. 2025-2030 సంవత్సరానికి తెలంగాణ పర్యాటక విధానాన్ని మార్చి 4 నుంచి 6 వరకు బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ పర్యాటక వ్యాపార సమావేశంలో ఆయన వెల్లడించారు.బతుకమ్మ, బోనాలు సంప్రదాయాలను హైలైట్ చేసే సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యునెస్కో జాబితాలో ఉన్న రామప్ప ఆలయం, నాగార్జున సాగర్‌లోని బుద్ధ పార్క్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహి సమాధులు వంటి దిగ్గజ ప్రదేశాలతో తెలంగాణ గొప్ప సాంస్కృతిక,చారిత్రక వారసత్వం ఉందని చెప్పారు.


Read More
Next Story