రేషన్ కార్డులపై కాంగ్రెస్ క్లారిటీ.. పాత వాటికి ప్రమాదం లేదు..
x

రేషన్ కార్డులపై కాంగ్రెస్ క్లారిటీ.. పాత వాటికి ప్రమాదం లేదు..

అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయన్న మంత్రి పొన్నం. దగాకోరు తనం బీఆర్ఎస్ గుణమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు.


తెలంగాణ రాష్ట్రమంతా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ప్రకటించారు. అందుకోసమే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 2.81కోట్ల మందికి 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మిగిలిన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు అతి త్వరలోనే అందిస్తాం అని చెప్పారు. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్జులు జారీ చేసే క్రమంలో పాత రేషన్ కార్డులను తొలగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రచారంపై కూడా మంత్రి పొన్నంప్రభాకర్ స్పందించారు. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. పాత రేషన్ కార్డులు ఒక్కటి కూడా తొలగించేది లేదని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల అంశంపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయ లబ్ధి కోసం రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత ఉండి ఎవరికయినా రేషన్ కార్డు రాకుంటే వారు సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వొచ్చని చెప్పారు.

‘‘గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా, కొత్తగా పెళ్లి అయిన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తాం. వారందరికీ మా ప్రభుత్వం జనవరి 26 నుండి రేషన్ కార్డులు ఇస్తుంది. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయి. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి , ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దానిని నమ్మవద్దు. కుల సర్వే ఆధారంగా అప్లికేషన్‌ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇందుర్తీ లో 71 కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా 12 వేలు ఇస్తున్నాం.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం. భూమి లేని రైతు కూలీలకు 12 వేలు ఇస్తున్నాం. ఇంధుర్తి మండల ప్రతిపాదనలు పంపాం. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుంది’’ అని వెల్లడించారు.

దగా బీఆర్ఎస్ బ్లడ్‌లో ఉంది: జీవన్ రెడ్డి

అయితే రేషన్ కార్డుల వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలన చూసి జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. దగా చేయడం కాంగ్రెస్‌కు కలలో కూడా రాదని, బీఆర్ఎస్‌కు బ్లడ్‌లోనే ఉందని ఆయన అన్నారు. ‘‘కేటీఆర్ ఒక వైపు విచారణ ఎదుర్కొంటు ఇంకో వైపు జడ్జి దగ్గరకు విచరణకు సిద్ధం అంటుండు. ప్రజల దృష్టి ని మళ్లించడానికి రాజకీయ ఎత్తుగడలు కేటిఆర్ వేస్తుండు. బీఆర్ఎస్ ఈ రోజు రైతు దీక్ష చేస్తుంది. మేము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతల ప్రయత్నం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతుంది’’ అని అన్నారు.

‘‘రైతు భరోసా పేరుతో ఈనెల 26 నుండి రైతుకు ప్రోత్సాహం కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తుంది. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా కింద రూ.12 వేల ఆర్థిక సహాయం ఇస్తుంది. బీఆర్ఎస్ రైతు బంధు పేరుతో ఏడాదికి రూ.8వేల నుండి రూ.10 వేలు చేస్తే కాంగ్రెస్ దానిని రూ.12 వేలు ఇస్తుంది. భవిషత్తులో రూ.14వేలు కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరాకు రూ.500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ఈనెల 26నుండి ప్రభుత్వం చేస్తుంది. బీఆర్ఎస్ హోసింగ్ స్కీంను మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తుంది. బీఆర్ఎస్ 2023 ఎన్నికల టైంలో రైతు రుణమాపి ఎత్తివేసింది. బీజేపీ ఋణమాఫి మాట ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ రుణమాఫి చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీతి ఆయోగ్‌లో ప్రస్తావిస్తే బాగుండేది. రైతాంగానికి ఉచిత విద్యుత్ పేటెంట్ అంటే అది కాంగ్రెస్’’ అని వ్యాఖ్యానించారు.

Read More
Next Story