తెలంగాణాలో కొత్తగా రేవంత్ ‘స్పీడ్’
x
Revanth

తెలంగాణాలో కొత్తగా రేవంత్ ‘స్పీడ్’

ఈ స్పీడు వల్ల ఏమిటి ఉపయోగం అంటే రాష్ట్రంలో నడుస్తున్న అనేక ప్రాజెక్టుల్లో అత్యంత ప్రాధాన్యతగా 19 ప్రాజెక్టులను ప్రభుత్వం ఎంపికచేసింది.


తెలంగాణాలో కొత్తగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పీడ్ అనే వ్యవస్ధ ఏర్పడింది. ఈ స్పీడ్ అంటే ఏమిటంటే స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలవరి(స్పీడ్). దీన్ని ప్రభుత్వం కొత్తగా శుక్రవారమే ఏర్పాటుచేసింది. ఈ స్పీడు వల్ల ఏమిటి ఉపయోగం అంటే రాష్ట్రంలో నడుస్తున్న అనేక ప్రాజెక్టుల్లో అత్యంత ప్రాధాన్యతగా 19 ప్రాజెక్టులను ప్రభుత్వం ఎంపికచేసింది. వీటి పనుల పురుగోతి లేదా అభివృద్ధిపై ఈ స్పీడ్ వ్యవస్ధ ప్రతినెలా సమీక్షచేస్తుంది. ఈ సమీక్షలకు స్వయంగా రేవంతే అధ్యక్షత వహిస్తారు.

మామూలుగా ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటి వ్యవహారాలను సాధారణంగా మంత్రులు లేదా సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శి, కమీషనర్లే సమీక్షలు చేస్తు పర్యవేక్షిస్తుంటారు. అయితే ఈ వ్యవహారాలన్నీ అనుకున్నంత వేగంగా పురోగతి సాదించవన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే నిధులు ఉండకపోవటం, సాంకేతిక సమస్యలు, నిపుణుల సూచనలు, సలహాలు రావటంలో జాప్యం, పర్యవేక్షణ లోపాల్లాంటివి అనేకముంటాయి

ఇలాంటి అనేక అంశాలను తాజాగా రేవంత్ సమీక్షలో బయటపడింది. అందుకనే ప్రాధాన్యత క్రమంలో కొన్ని ప్రాజెక్టులను స్వయంగా తానే సమీక్షచేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దీనివల్ల పనుల పురోగతిలో, సాంకేతిక పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించటంలో, పనుల పర్యవేక్షణలోను మంత్రులు లేదా ఉన్నతాధికారులపరంగా వేగం పెరుగుతుందని రేవంత్ భావించారు. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొన్ని ప్రాజెక్టులను వీలైనంతగా వేగంగా పూర్తయితే రేవంత్ ఇమేజి తెలంగాణా రాజకీయాల్లో అమాంతం పెరిగిపోవటం ఖాయం.

ఈ విషయాన్ని రేవంత్ గుర్తించటం వల్లే స్పీడ్ అనే కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేసినట్లు అర్ధమవుతోంది. ఈ స్పీడ్ ద్వారా కేవలం హైదరాబాద్, రాజధాని చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి పనులే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని కూడా పర్యవేక్షిస్తుంది. స్పీడ్ పరిధిలోకి చేర్చిన ప్రతి అభివృద్ధిపనిని పూర్తిచేయటానికి ప్రభుత్వం నిర్దిష్ట కాలపరమితిని నిర్ణయించబోతోంది. స్పీడ్ పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఆన్ లైన్ పోర్టల్ ను కూడా అందుబాటులోకి తేబోతున్నారు. పనుల పురోగతిని పోర్టల్లో ప్రతిరోజు అప్ డేట్ చేయాలని రేవంత్ ఆదేశించారు.

ఇప్పటికైతే స్పీడ్ పరిధిలోకి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రోరైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వవ్యస్ధీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నగరంలో ఎలివేటెడ్ క్యారిడార్ల ఏర్పాటు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ఢిల్లీలో తెలంగాణా భవన్ నిర్మాణం, సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు, ఐటిఐల్లో అడ్వాన్స్ డు టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త ప్యారామెడికల్ కాలేజీల ఏర్పాటు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్ టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులు, మత్తుమందుల నిరోధక విభాగం అమలును రేవంత్ స్వయంగా ప్రతినెలా సమీక్షించబోతున్నారు. మరి ఈ స్పీడ్ ఎంత స్పీడుగా పనిచేస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story