NEW YEAR | కొత్త సంవత్సరవేళ ట్రాఫిక్ ఆంక్షలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
x
ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన బాడీ వోర్న్ కెమెరాను పరిశీలిస్తున్న సీపీ సుధీర్ బాబు

NEW YEAR | కొత్త సంవత్సరవేళ ట్రాఫిక్ ఆంక్షలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

కొత్త సంవత్సర వేళ డిసెంబరు 31 రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.బాడీ వోర్న్ కెమెరాలతో ట్రాఫిక్ సిబ్బందిని రంగంలోకి దించారు.


నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై డిసెంబరు 31 రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తేలికపాటి మోటారు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రాత్రివేళ భారీ, మీడియం గూడ్స్ వాహనాలను మాత్రం ఓఆర్ఆర్ పై అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. ఓఆర్ఆర్ ద్వారా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్లు చూపిస్తే వారిని లైట్ మోటార్ వాహనాల్లో అనుమతిస్తామని సీపీ పేర్కొన్నారు.


ఫ్లై ఓవర్లపై వాహనాలకు అనుమతి లేదు
నాగోలు, కామినేని, మల్టీ లెవెల్, ఎల్బీనగర్ ఎక్స్ రోడ్డు, బైరామల్ గూడ ఎక్స్ రోడ్డు, ఎల్బీనగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్ పాస్ లపై డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటలవరకు ద్విచక్రవాహనాలు, లైట్ మోటారు వెహికిల్స్ ను అనుమతించమని సీపీ తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసమే ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించామని సీపీ వివరించారు.

క్యాబ్ లు, టాక్సీలు, ఆటో డ్రైవర్లకు ఆదేశాలు
డిసెంబరు 31 వతేదీన క్యాబ్స్, టాక్సీలు, ఆటో రిక్షాల డ్రైవర్లు యూనిఫాం ధరించడంతోపాటు అన్ని రకాల డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ సూచించారు. క్యాబ్స్, టాక్సీలు, ఆటో రిక్షాల డ్రైవర్లు రైడ్లను నిరాకరిస్తే వారికి మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 178 ప్రకారం రూ.500 పెనాల్టీ విధిస్తామని సీపీ చెప్పారు. ఆటోలు, క్యాబ్ ల డ్రైవర్లు రామని నిరాకరిస్తే వాట్సాప్ నంబరు 8712662111కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.

మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఏదైనా బార్ ,పబ్,క్లబ్ కు వచ్చి మద్యం తాగి వాహనాలు నడిపేందుకు అనుమతించవద్దని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మద్యం తాగిన వారిని ఇళ్లకు పంపించేందుకు బార్, పబ్ యజమానులే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై రోడ్లపై విస్తృత తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నిబంధనలు ఉల్లంఘించొద్దు
వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ విధిగా చూపించాలి. అధిక-డెసిబెల్ సౌండ్ సైలెన్సర్‌లు వినియోగించినా,నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినా, హారన్లు వాడినా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన హారన్, సవరించిన సైలెన్సర్‌లు,ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్/మల్టిపుల్ రైడింగ్ చేసినా కేసులు పెడతామని సీపీ వివరించారు.

డ్రంకెన్ డ్రైవింగ్ కు భారీ జరిమానాలు
మద్యం తాగి వాహనాలు నడిపితే వారికి పదివేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని సీపీ చెప్పారు. రెండవ సారి డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో దొరికితే వారికి రూ.15వేల జరిమానా, లేదా జైలు శిక్ష తప్పవన్నారు. డ్రంకెన్ డ్రైవింగ్ చేసిన వారి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేపిస్తామని ఆయన హెచ్చరించారు.

బాడీ వోర్న్ కెమెరాలతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు
కొత్త సంవత్సరవేళ పీకలదాకా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు బాడీ వోర్న్ కెమెరాలతో రంగంలోకి దిగారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులు ఈ కెమెరాలను జేబులకు ధరించారు. పారదర్శకంగా ఉండేలా ట్రాఫిక్ పోలీసులు, ప్రజల మధ్య సంభాషణను రికార్డ్ చేయడం ద్వారా పారదర్శకత పాటిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో కెమెరా ఫుటేజీని సాక్ష్యాధారాలుగా వినియోగించుకోనున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం 50 మంది ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలకు బాడీ వోర్న్ కెమెరాలు అందజేశారు.ట్రాఫిక్ పోలీసులు మరింత మెరుగ్గా పనిచేయడానికి ఈ కెమెరాలు ఉపయోగపడతాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.

Read More
Next Story