
మాయమై పోయాడమ్మా మనిషన్న వాడు !
అందెశ్రీతో ప్రముఖ రచయిత, జర్నలిస్టు ‘రాఘవ’ జ్ఞాపకాలు
‘‘అందెశ్రీ పోయారు’’ అని నిఖిలేశ్వర్ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పే సరికి ‘‘అయ్యో పోయారా’’ అని చాలా సేపు బాధ పడ్డాను.
పాటకు పట్టాభిషేకం చేసిన వాడు మాయమైపోయాడా అని మనసు ఉసూరుమనిపించింది.
అందెశ్రీ ఇప్పటి వాడా! మెదడు లోనే కూని రాగాలాపన తో బాణి సమ కూర్చి, ఆ బాణి కి తగినట్టు పాటలురాసి, పా డి, వాగ్గేయ కారుడిగా అతనీ లోకానికి అంతగా పరిచయం కాని ముప్ఫై ఏళ్ళ నాటి మాట ఇది! హైదరాబాదులో నెలకొల్పిన ‘వర్తమానం’ దినపత్రికలో పనిచేసే 1995 నాటి రోజులవి. ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహం ఎదురు రోడ్డులోనే, రైల్వే గేటుకు ఈ వల ‘వర్తమానం’ ఆఫీసు ఉండేది. సాయంత్రమైతే చాలు తాపీ పని నుంచి ఇంటికి వెళ్ళ కుండా, నేరుగా ‘వర్తమానం’ ఆఫీసుకు వచ్చేవాడు ఎల్లయ్య.
మాసిన పంచె, పాత చొక్కా, బుజాన టవలు, రేగిన జుట్టు, జేబులో కాగితాలు, ఒక చేతిలో పెన్సిల్, మరో చేతిలో తాపీ పట్టుకుని వర్తమానం ఆఫీసులోకి నేరుగా వచ్చేవాడతను. ‘‘ఏమే వచ్చినవూ..రా.. గిట్ల కూకో’’ అంటూ యలమంచిలి శేఖర్ కుర్చీ లాగి తన పక్కన కూర్చోబెట్టుకునే వారు. ఈ లోగా పాశం యాదగిరి కూడా నవ్వూతూ వచ్చి పలకిరించే వారు. ‘‘చాయ్ తాగుతవా!’’ అంటే ‘‘తెప్పియ్యే’’ అనేవాడు ఎల్లయ్య.
‘‘కొత్తగా ఏం రాసినవే పాట’’ అంటూ తెలంగాణా మాండలికంలోనే శేఖర్ ఆప్యాయంగా పలకరించేవారు. జేబులోంచి పాట రాసిన కాయితం తీసుకుని, ముందుగా ఒత్తులూ దీర్ఘాలు దిద్దించుకునే వాడు. ‘‘ఎట్ల పాడతవే దీన్ని’’ అనగానే గొంతెత్తి రాగ యుక్తంగా పాడేవాడు. ఎంత గంభీరమైన గొంతు! ఎల్లయ్య కు కాగితం పైన అక్షరాల కంటే, ముందు మెదడులో రాగం వస్తుంది. అది గొంతులోంచి పలుకుతుంది. దాని వెనకే భావం వస్తుంది. ఎల్లయ్య అంటే నైపుణ్యం గల తాపీ మేస్త్రీ కదా! ఎలా పక్కన ఇటుక ఇటుక పెట్టి, ఇటుకపైన ఇటుక పేర్చి ఇల్లు ఎలా కడతడో, పాటను కూడా అలాగే కడతాడు. ఈ పాటల తాపీ మేస్త్రీ కూడా ఆ రాగం లోనే భావం ఇమిడి పోయేలా అక్షరాలను పొందికగా పేరుస్తాడు. జీతితానుభవాన్నుంచి వచ్చిన మాటలు పాటలో ఇమిడి పోతాయి. కాసేపు మా రాత పనులన్నీ పక్కన పెట్టి ఎల్లయ్య పాటలో లీనమైపోయే వాళ్ళం.
తాను పాట రాసినప్పుడల్లా తాపీ పని నుంచి నేరుగా ఇంటికి వెళ్ళకుండా, ఇలా ‘వర్తమానం’ ఆఫీసుకే వచ్చేవాడు. ఏం చదువుకున్నారని నేనడిగితే, ‘‘నాల్గవతరగతి సదువుకున్న. చానా రోజులు పశుల మేపిన. గిప్పుడు ఇండ్లు కట్టే పనిలో మేస్త్రిగా ఉన్న’’ అంటూ ఏ మాత్రం భేషజాలకు పోకుండా చేతిలో తాపీని చూపించేవాడు.ఆ తాపీని ప్రశ్నలాగా నిలబెట్టేవాడు.
ఎల్లయ్య పండిత కవి కాదు, పామర కవి. తన పాటకు తానే బాణీ కట్టి, తానే పాడే ఒక వాగ్గేయకారుడు. అతనిలోని సహజ కవిని చూసి యలమంచిలి శేఖర్, పాశం యాదగిరి చాలా మురిసిపోయి, బాగా ప్రోత్సహించారు. ఎల్లయ్య రాసిన పాటలన్నీ కలిపి ‘పాటల పూదోట’గా పుస్తకం వచ్చింది. దాంతో అందె ఎల్లయ్య కాస్తా అందెశ్రీ అయిపోయాడు. వెంటనే ‘అందెల సందడి’ వచ్చింది.
ఈ రెండు పుస్తకాలను శ్రీకృష్ణ దేవరాయ భాషాంధ్ర నిలయంలో ఆవిష్కరణ సభ 1995 జూన్ లో ఏర్పాటు చేశారు. వేదికపైన సి.నారాయణ రెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్ జి. కృష్ణ ఉన్నారు. వారి మధ్య అందెశ్రీ కూడా కూర్చున్నాడు. అందెశ్రీ ఎలా ఉన్నాడు? ‘వర్తమానం’ ఆఫీసుకు వచ్చినట్టు లేడు. ఉతికిన పంచె కట్టుకుని, ఉతికిన చొక్కా తొడుక్కున్నాడు. పెద్ద మనిషిలా మెడలో ఒక టవలు వేసుకున్నాడు.
ఆ రోజు ఆదివారం. నాకు వారాంతపు సెలవు. ‘వర్త మానం’లో పనిచేసే మరికొంత మంది కూడా వచ్చి సభలో కూర్చున్నారు. సినారె వస్తున్నారంటే హాలు నిండకుండా ఎలా ఉంటుంది? వేదికపై ఎలా కూర్చోవాలో తెలియక అందెశ్రీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. కుర్చీలోనే కాసేపు అటు ఇటు జరుగుతూ, కాసేపు అటు తిరిగి, ముడుచుకుని, కాసేపు ఇటు తిరిగి ముడుచుకుని కూర్చుంటాడు.
ఇది గమనించిన సి.నారాయణ రెడ్డి అందెశ్రీని చూసి నవ్వుతూ ‘‘చూడండి వేదికపై కూర్చోవడానికి అందెశ్రీ ఎలా ఇబ్బంది పడుతున్నాడో!’’ అన్నారు. ‘‘ముప్ఫై ఏళ్ళ క్రితం నేను ’చదువురాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువు లెందుకూ.’ అన్న పాటను అందెశ్రీ కోసమే రాసినట్టున్నా’’ అని ఆ పాట కాస్త పాడి వినిపించారు. సభ అంతా చప్పట్లతో మారుమోగింది.
‘అందెల సందడి’ కి, ‘పాటల పూదోట’కు ప్రముఖ జర్నలిస్ట్ జి. కృష్ణ రాసిన పరిచ వాక్యాలు ఇలా ఉన్నాయి, ‘‘ఇది చదువు రాని వాడు వ్రాసే కవితలు. కవిత్వం రాని వాడు రాస్తున్న పరిచయం’’ అంటూ తాను రాసిన మాటలను సభలో గుర్తుచేశారు. ‘‘అసలు - చదువు రాని వాడు రాసే కవిత్వంలోనే నిజమూ, అమాయకత్వము సొంపుగా పెనవేసుకుని సాక్షాత్కరిస్తూ ఉంటాయి’’ అన్నారు. సహజంగా వచ్చే ఈ కవితా శక్తిని ఏం పేరుతో పిలవాలి అని తనకు తానే ప్రశ్న వేసుకున్నారు.‘‘కవిత అనేది ఈప్రపంచాన్ని ఒక భావుకుడు విలక్షణమైన వింతగొల్పే అవగాహనతో చూసిన తీరు. అందరికీ చేతకాదు. పద్యం ద్వారా చూశాడా, పాట ద్వారా చూశాడా, గేయం ద్వారా చూశాడా అనేది అప్రస్తుతం. అతడు చూసిన తీరు మనలను చకితులను చేయాలి.’’ అంటారు జి. కృష్ణ.
‘‘అందెశ్రీ ఈప్రపంచాన, ఎక్కడో ఇల్లు కడ్తూ, ఏదో అంతస్థు నుంచి తాపీని ప్రశ్నార్ధకంగానో,ఆశ్చర్యార్ధకంగానో పట్టుకుని పరికించుతూ గడపగలడు. అది అతడికి అలవడిన భావుకత. భావించగా భావించగా, అనుభూతి వల్లే పూచి, కాచి, పండిన భావుకత. ‘నురపహతి’ వగైరా అతడికి అందుబాటులో లేవనుకుంటాను. నిజానికి అవన్నీ ఉంటే సోమరి వలే సుఖిస్తాడు. అందెశ్రీకి ఇగ్లీషు రాదని చెప్పాడు. అందువలన ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు పడే పాట్లు పడనక్కర లేదు’’ అంటూ అందెశ్రీని జి. కృష్ణ ఆవిష్కరించారు.
‘‘అనురాగానికి దర్పనం మా ఏ. రాఘవ శర్మకి ఆత్మీయతతో అందెశ్రీ’’ అని రాసి 1995 జూన్ 5వ తేదీన ’అందెల సందడి’ ‘పాటల పూదోట’ రెండు పుస్తకాలూ నాకిచ్చాడు. బహుశా ఆ రోజే పుస్తకావిష్కరణ సభ జరిగినట్టుంది. ఇదంతా ముప్ఫై ఏళ్ళ నాటి మాట.
‘‘అందెశ్రీ అంటే నటరాజు కదా? లయకు అధికారి. సృష్టి సమస్తమూ లయబద్దం.’’ అని బోయి భీమన్న ఈ పుస్తకాలకు రాసిన ఆప్తవాక్యాల్లో అంటారు. ‘‘అచ్చమైన కవుల్లో పద్యాన్ని పట్టుకున్న వారైనా పతనమయ్యారేమో కాని, పాటను పట్టుకున్న వారెవరూ పతనం కాలేదు’’ అంటారు తన ఆప్త వాక్యాల్లో ఆచార్య తిరుమల. ‘‘అందెశ్రీ పాటను ఆశ్రయించాడనే కంటే, పాటే అందెశ్రీని ఆశ్రయించిందనడం సరైన మాట. అందెశ్రీకి పాట తప్ప ఏమీ లేదు. డబ్బు లేదు, అధికారం లేదు, పుస్తకాల చదువు లేదు, పెద్ద వాళ్ళ ప్రాపంకం లేదు, ప్రచార సాధనాల ఆదరణ లేదు, సాంస్కృతిక సంఘాల పిలుపు లేదు, సంపన్నుల దయలేదు- అందెశ్రీకి ఏమీ లేదు’’ అని ఆనాటి అందెశ్రీ గురించి ఆచార్య తిరుమల అంటారు.
ముప్పై ఏళ్ళ క్రితం నేను హైదరాబాదు వదిలేశాక, అందెశ్రీ పాటలు బాగా జనాదరణ పొందాయని, సినిమాలకు కూడా రాశాడని విని ఆనందించాను. కానీ అతన్ని చూసే అవకాశం దక్కలేదు. ఏడాది క్రితం నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు, హరగోపాల్ గారింటికి వెళ్ళాను. ఆయనతో ఇంటర్వ్యూ మొదలు పెడదామనుకునేలోగా అందెశ్రీ వచ్చాడు. రాగానే హరగోపాల్ కాళ్ళకు దండం పెట్టాడు. అనుకోని ఈ సంఘటనతో హరగోపాల్ కాస్త ఇబ్బంది పడ్డారు. అందెశ్రీ కింద కూర్చునేశాడు. ‘‘కిందెందుకు కూర్చుంటావు. పైనకూర్చో’’ అని హరగోపాల్ బలవంతం చేసే సరికి కుర్చీలో కూర్చున్నాడు.
తాను రాసిన తెలంగాణా జాతీయ గీతం గురించి, దాని మార్పులు చేర్పుల గురించి, ఆ పాటను ఆమోదించడం వెనుక జరిగిన సంగతుల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు అందెశ్రీ. తన కేమీ ఎమ్మెల్సీ ఆశ లేదని, డబ్బు ఆశలేదని చెప్పాడు. ఆశ లేనప్పుడు వాటి ప్రస్తావన ఎందుకు? అన్న సందేహం అప్పుడు నాలో మెదిలింది. హరగోపాల్ గారి జీవిత సహచరి వనమా ఇంట్లోంచి వచ్చి అందెశ్రీని పలకరించారు. అందెశ్రీ కూడా ‘అమ్మా’ అంటూ ఆప్యాయంగా వారితో మాట్లాడారు.
‘వర్త మానం’ నాటి విషయాలను, పుస్తకావిష్కరణ నాటి సంగతులను గుర్తు చేసే సరికి అందెశ్రీ చాలా సంతోషపడిపోయాడు. ‘‘అరె.. గిప్పుడు జరిగినట్టు ఎట్ల జెబుతున్నరు. భలే యాదికి పెట్టుకున్నరే’’ అంటూ సబంరపడిపోయాడు. అందెశ్రీ వెళ్ళిపోయాక హరగోపాల్ ఇంటర్వ్యూ మొదలు పెట్టాను. అందెశ్రీని అదే చివరి సారి చూడడం. ఇంత త్వరగా అందెశ్రీ పోతాడని ఊహించలేదు. ‘మాయమైపోయినాడమ్మ మనిషన్న వాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనాత్మక చరణాలు మాత్రం చెవుల్లో గింగురు మంటూనే ఉంటాయి.

