జైనూర్ కేసును సుమోటోగా తీసుకున్న NHRC.. కీలక ఆదేశాలు
x

జైనూర్ కేసును సుమోటోగా తీసుకున్న NHRC.. కీలక ఆదేశాలు

జైనూర్ లో ఉద్రిక్తతలకు దారి తీసిన గిరిజన మహిళపై హత్యాచారయత్నం ఘటనని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా పరిగాలోకి తీసుకుంది.


జైనూర్ లో ఉద్రిక్తతలకు దారి తీసిన గిరిజన మహిళపై హత్యాచారయత్నం ఘటనని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా పరిగాలోకి తీసుకుంది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది. నివేదికలో ఎఫ్‌ఐఆర్ స్టేటస్, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, కౌన్సెలింగ్, ప్రభుత్వం నుంచి ఆమెకి అందిన సహకారానికి సంబంధించిన వివరాలివ్వాలని సూచించింది.

అసలేం జరిగిందంటే...

తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన ఆదివాసి మహిళపై ఆగస్టు 31న అత్యాచారయత్నం జరిగింది. ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన జైనూర్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితురాలు ఆగస్టు 31న సిర్పూర్ (యు) మండలంలోని తన పుట్టింటికి వెళ్లేందుకు నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో సోనుపటేల్ గూడకి చెందిన నిందితుడు ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. రాఘాపూర్ దాటిన తర్వాత ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. బాధితురాలు చనిపోయిందేమో అని భావించిన నిందితుడు... యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఆ మహిళను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.

అటుగా వెళుతున్న స్థానికులు ఆమెను గుర్తించి ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదారాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన మహిళ తనపై అత్యాచారయత్నం, దాడి జరిగిందన్న విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 1న కేసు నమోదు చేశారు.

ఉద్రిక్తంగా మారిన జైనూర్...

ఘటనపై ఆదివాసి సంఘాలు సెప్టెంబర్ 3న జైనూరులో ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ 4న ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. కాగా, వీరి ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిందితుడిని ఉరితీయాలంటూ వేలాది మంది ఆదివాసీలు జైనూర్ మండల కేంద్రానికి తరలివచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత అతనికి వెంటనే ఉరిశిక్ష వేయాలంటూ ఆందోళనలు చేశారు. మండల కేంద్రంలోని ఓ వర్గానికి చెందిన దుకాణ సముదాయంలోని పాన్ షాప్ లోని సామాగ్రిని బయటకు తీసుకొచ్చి నిప్పంటించారు. దీంతో ఆ వర్గం వారు కూడా వీరి వర్గానికి చెందిన వారి షాపులను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జైనూర్ లో కర్ఫ్యూ విధించారు, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు.

Read More
Next Story