రుణమాఫీ విషయంలో నాలుక మడతేసిన రేవంత్
x

రుణమాఫీ విషయంలో నాలుక మడతేసిన రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి మార్గదర్శకాలు కాదు... మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేశాం అన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు తప్ప.. రైతాంగం బాగుండాలి .. వ్యవసాయం బాగుండాలి అన్న సంకల్సం ఈ ప్రభుత్వానికి లేదు అని మండిపడ్డారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్న రేవంత్... ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) ప్రామాణికంగా తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మార్గదర్శకాల్లో మెన్షన్ చేయడాన్ని తప్పుబట్టారు.

రుణమాఫీ లక్ష్యానికి గండికొడుతున్నారు...

తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే అలా డిసెంబరు 9న రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఉన్న 69 లక్షల పైచిలుకు ఉన్న తెలంగాణ రైతాంగంలో ఆశలు రేపింది. అందరి రుణాలను మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పారు.. ఈరోజు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకువచ్చారని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో 5 ఎకరాల వ్యవసాయదారుడు, 30 వేల జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నాడు.. రేషన్ కార్డు, పీఎం కిసాన్ డాటా వంటివి పెట్టి కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో రూ. 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంత మంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. పీఎం కిసాన్ డాటాను మార్గదర్శకంగా తీసుకుంటాం అని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు.. అసలు దానికి సంబంధించిన షరతులే లోపభూయిష్టం అయినవి. రుణమాఫీకి పీఎం కిసాన్ డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమే.. హామీలు ఇచ్చినప్పుడు లేని ఆంక్షలు.. అమలు చేసేటప్పుడు ఎందుకు? మరి ఈ ఆంక్షలు విధించడానికి ఈ ఏడు నెలల సమయం ఎందుకు తీసుకున్నట్లు? నాడు పరుగెత్తి రుణాలు తీసుకోండి వెంటనే రుణమాఫీ చేస్తాం అని రైతులను పరుగులు పెట్టించి నేడు కాంగ్రెస్ నేతలు చావు కబురు చల్లగా చెబుతున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.

రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి ఏంటి?

తెల్లరేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించాడు.. సరిగ్గా నాలుగు రోజులు తిరగక ముందే నాలుక మడతేశాడని నిరంజన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వాలు కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డులను పరిశీలించేవారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పది ఎకరాలుండి పింక్ కార్డులు ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పినప్పుడు... రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. రుణమాఫీపై రైతుల నుండి ఫిర్యాదులను కోరడం అంటే రైతుల మధ్య వివాదాలను సృష్టించడమే అన్నారు. ఎన్నికల్లో ఆశ చూపి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. అధికారం వచ్చాక హామీల నుండి తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుందన్నారు. పీఎం కిసాన్ డాటా ఉంటే మళ్లీ రుణమాఫి అమలుకు వ్యవసాయ అధికారులను బాధ్యులను చేయడం ఎందుకు? రైతుల నుండి ఫిర్యాదులు ఆహ్వానించడం ఎందుకు? తెల్ల రేషన్ కార్డు ప్రామాణికత ఎందుకు? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి రుణమాఫీ విషయంలో చిత్తశుద్ధి లేకనే గందరగోళంగా రుణమాఫీ మార్గదర్శకాలు నిర్ణయించిందన్నారు. అధికారులు, రైతుల మధ్య ఈ మార్గదర్శకాలు చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు. ఈ విధానం మూలంగా అధికారుల మీద రాజకీయ వత్తిళ్లు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్ మోసాలకు భవిష్యత్‌లో కర్షకులు గుణపాఠం చెబుతారని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

Read More
Next Story