చెరకు రైతుల చుట్టూ తిరుగుతున్న నిజామాబాద్ రాజకీయం
x
ఇందూరు అభ్యర్థులు : చెరకు రైతులకు తీపి కబురు ఎవరు చెబుతారు?

చెరకు రైతుల చుట్టూ తిరుగుతున్న నిజామాబాద్ రాజకీయం

నిజామాబాద్ ఎన్నికల తెరపైకి కొత్తగా వచ్చిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ సారి ఎన్నికల్లో చెరకు రైతుల సమస్య ఎన్నికల ప్రధానాంశంగా మారింది.


నిజామాబాద్ (ఇందూర్) లోక్‌సభ నియోజకవర్గంలో 64.4 శాతం గ్రామీణ ఓటర్లు...అందులోనూ రైతులు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఇందూరు పార్లమెంట్ పోరులో రైతుల సమస్యలే ప్రధాన ఎన్నికల ఏజెండాలుగా మారాయి. ఈ నియోజకవర్గంలో రైతులు పసుపుతో పాటు చెరకు పంటను అధికంగా పండిస్తుంటారు. బోధన్‌, కోటగిరి, వర్ని, ఎడపల్లి, రెంజల్‌,కామారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో చెరకు పంట పండిస్తున్నారు.

- ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారమైన బోధన్ నిజాం షుగర్స్‌
తో పాటు జగిత్యాల జిల్లా ముత్యంపేట, లక్ష్మీపూర్ లో నిజాం షుగర్స్ ఆధ్వర్యంలో మూడు షుగర్ ఫ్యాక్టరీలుండేవి. గతంలో సర్కారు ఈ షుగర్ ఫ్యాక్టరీల్లో ప్రైవేటు సంస్థలకు 51 శాతం వాటాను విక్రయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీలను మూసివేసింది.
- దీంతో చెరకు రైతులు తాము పండించిన చెరకును విక్రయించేందుకు దూరప్రాంతాల్లోని ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల చెరకు కట్ చేశాక దూరప్రాంతానికి తీసుకువెళ్లేందుకు సమయం పడుతుండటంతో ఎండిపోయి తూకం తగ్గుతోంది. దీంతో పాటు రవాణాభారం చెరకు రైతులపై పడుతోంది.

ఉద్యమిస్తున్న చెరకు రైతులు
మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ చెరకు రైతులు కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. రైతులు, కార్మికులు ఉద్యమిస్తున్నా, ఇప్పటి వరకు పరిశ్రమ మళ్లీ తెరుచుకోలేదు. కంపెనీపై లేఆఫ్‌ ఎత్తివేయాలని పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికులు రిలేదీక్షలు, ఆమరణ దీక్షలు చేశామని చెరకు రైతుల సంఘం అధ్యక్షుడు చెన్నమనేని శ్రీనివాసరావు ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాజకీయ పార్టీలు సైతం తమకు మద్దతు ప్రకటించాయని, కానీ ఇప్పటివరకు షుగర్ ఫ్యాక్టరీలను మాత్రం తెరవలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోధన్‌ నిజాం షుగర్స్‌ పరిశ్రమ అంశం కాలక్రమేణ ఎన్నికల ప్రచార హామీగా మారిపోయింది.

హామీ మర్చిన ధర్మపురి అరవింద్
గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని నాటి బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపరుపై సంతకం పెట్టి చెరకు రైతులకు అందించారు. ఒకవేళ ప్రభుత్వం ఫ్యాక్టరీలను తెరవకుంటే తన సొంత డబ్బుతో షుగర్ ఫ్యాక్టరీలను తెరుస్తానని నాడు హామీ ఇచ్చినా దాన్ని అమలు చేయలేదని నిమామాబాద్ జిల్లా బోధన్ ప్రాంత పెంటకుర్ధు గ్రామానికి చెందిన చెరకు రైతు ఎం శ్రీనివాసరావు ఆవేదనగా చెప్పారు.

హామీ మర్చిన కేసీఆర్
ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... నిజాం షుగర్స్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ సీఎం అయినా దాన్ని మర్చిపోయారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో పరిశ్రమ తెరుస్తామని మాట ఇచ్చినా ఆ హామి నెరవేరలేదు.

చెరకు రైతులకు రాహుల్ గాంధీ హామి
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ మూతపడ్డ చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపించే ఆలోచన చేస్తామని భారత్ జోడో యాత్రలో చెరకు రైతులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తూ నిజాం చక్కెర కర్మాగారాలు తిరిగి తెరిపిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని సిఫార్సుల కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు.

నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ : తెరచుకునే దెన్నడు?

నిజాం షుగర్స్ తెరిపిస్తాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ ఇటీవల పరిశీలించింది. కర్మాగారంలోని యంత్రాలను, డిస్టిల్లరీ యూనిట్ పరిశీలించారు. 2015 లో లే ఆఫ్ గా ప్రకటించబడి మూతబడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో మంత్రి చర్చించారు.

చెరకు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
నిజాం షుగర్స్ కర్మాగారం మూతపడి ఏళ్లు గడవడంతో చెరకు సాగు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కర్మాగారాన్ని తెరిపిస్తామన్న అంశం ఇన్నాళ్లూ రాజకీయ హామీగా మిగిలిపోగా పునరుద్ధరిస్తామన్న కొత్త ప్రభుత్వ ప్రకటనతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు అవసరమైన సిఫార్సుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులతో రేవంత్ ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది. తిరిగి పరిశ్రమ తెరుచుకుంటే బోధన్ ప్రాంతం పూర్వ వైభవం సంతరించుకోనుంది.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు టి జీవన్ రెడ్డి (కాంగ్రెస్), ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ కూడా నిజాం షుగర్స్ ను తెరిపిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే చెరకు రైతుల దీర్ఘకాల సమస్యను పరిష్కరించి చెరకు రైతులకు తీపి కబురు చెబుతామని ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవరు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తారో? వేచిచూడాల్సిందే.


Read More
Next Story