నిజామాబాద్‌లో పసుపు రైతులు ఈసారి ఎవర్ని గెలిపిస్తారు?
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో పసుపు,చెరకు రైతుల సమస్యలే ప్రధాన ఏజెండాగా మారాయి. పసుపు రైతులు ఈ సారి ఎవరిని గెలిపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో నాలుగు ప్రధాన అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. రైతులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే మరోసారి ఎన్నికల తెరమీదకు వచ్చాయి. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల మూసివేత, జాతీయ పసుపుబోర్డు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వ నీరందక ఎండిపోతున్న పొలాలు, రైతు రుణ మాఫీ, రైతుబంధు అంశాలను రైతులు, రైతుసంఘాల నాయకులు ప్రస్థావిస్తున్నారు. చైతన్యవంతులైన రైతులు ఓట్లు అడిగేందుకు వస్తున్న అభ్యర్థులకు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారు. గత కొంతకాలంగా రైతు సమస్యల పరిష్కారానికి ఎన్నెన్నో ఆందోళనలు చేసిన రైతన్నలు ఈ ఎన్నికలను వేదికగా చేసుకొని తమ సమస్యలను తీర్చుకునేందుకు సమాయత్తమయ్యారు.
- నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం శ్రీరాంసాగర్, అలీసాగర్,పోచారం, రామడుగు, కౌలాస్ నాలా ప్రాజెక్టులు, నిజాం సాగర్ జల విద్యుత్ కేంద్రం, సిర్నాపల్లి, దోమకొండ సంస్థానాలతో విస్తరించి ఉంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, భోదన్ ,ఆర్మూర్, బాల్గొండ, కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో ఈ పార్లమెంట్ నియోజవకర్గం విస్తరించింది.
- నిజామాబాద్ ఎంపీ స్థానంలో గ్రామీణ ఓటర్లు అధికంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 64.4 శాతం ఓటర్లు ఉండటంతో వారే ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. పట్టణాల్లో కేవలం 35.6 శాతం ఓటర్లు నివాసముంటున్నారు. 55.61 శాతం అక్షరాస్యులున్న నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గ్రామీణ ఓటర్ల మద్ధతు కోసం అభ్యర్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
- నిజామాబాద్ నుంచి ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఇద్దరు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. జగిత్యాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసి,ప్రస్థుతం ఎమ్మెల్సీగా ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగారు. పదవి ఉన్నా, లేకున్నా గత 40 ఏళ్లుగా ప్రజలతో మమేకమై పనిచేసిన జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీకి గట్టి పోటీ ఇస్తున్నారు.
- మరో వైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా పనిచేసిన బాజిరెడ్డి అనూహ్యంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. నిజామాబాద్ ను ఇందూరు అని ప్రజలు పిలుస్తుంటారు. కీలకమైన ఇందూరు బరిలో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోరు నెలకొంది.
మరోసారి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్థుతం బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. బడా వ్యాపారి అయిన అరవింద్ తన తండ్రి, సీనియర్ రాజకీయ నాయకుడైన ధర్మపురి శ్రీనివాస్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసినా, అరవింద్ మాత్రం ప్రధానమంత్రి మోదీ అభిమానిగా బీజేపీలో చేరారు. గత 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరవింద్ అనూహ్యంగా అప్పటి సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి పార్లమెంటులో అడుగుపెట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రితో ప్రకటన చేయించిన అరవింద్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు.
పసుపు బోర్డు ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ కే పరిమితం
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ఇంకా కాగితంపైనే ఉండటంతో రైతులు దీని గురించి ఈ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనతో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మిసిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ గెజిట్ నోటిఫికేషన్ గత ఏడాది అక్టోబరు 4వతేదీన విడుదల చేసింది. పసుపుపై పరిశోధనలు చేసి పసుపు ఉత్పత్తుల అభివృద్ధి కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం జారీ చేసిన నోటిపికేషన్ లో ఎక్కడ ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే విధి విధానాలను ఇవ్వలేదు. 1986వ సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన స్పైసెస్ బోర్డులోనే పసుపును కలిపారు. అయితే పార్లమెంటులో చట్టం చేయకుండా కేవలం నోటిఫై చేయడంతో పసుపు బోర్డు ఏర్పాటుకు చట్టబద్ధత ఉండదని పసుపు రైతుల సంఘం అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. ‘‘పసుపు బోర్డు ఏర్పాటు ఎక్కడనేది స్పష్టం చేయలేదని, ఈ బోర్డుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు, చట్టబద్ధంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టకుండా, బడ్జెట్ కేటాయించకుండా జాతీయ పసుపుబోర్డు ఎలా పెడతారు’’అని కోటపాటి ప్రశ్నించారు.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు తెరిపించేదెప్పుడు?
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో చెరకు రైతుల సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. నిజాం షుగర్స్ కింద బోధన్, ముత్యంపేట, లక్ష్మీపూర్ లలో షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ ఫ్యాక్టరీలను గతంలో ప్రభుత్వం ప్రైవేటు కు విక్రయించింది. వందలకోట్ల రూపాయల విలువగల నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా ఇస్తూ గత ప్రభుత్వం విక్రయించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం షుగర్స్ ఫ్యాక్టరీలను మూసివేసింది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను మూసివేయడంతో చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సమీపంలో ఫ్యాక్టరీలు లేకపోవడంతో కామారెడ్డిలోని గాయత్రి ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీకి చెరకును తీసుకువెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల చెరకు రైతులకు అదనపు రవాణ భారంతోపాటు చెరకు ఎండిపోయి బరువు తగ్గి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు.
గత ఎన్నికల్లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని అప్పటి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపరుపై సంతకం పెట్టి ఎంపీ అయ్యారు. ఎంపీ అయ్యాక ఫ్యాక్టరీని తెరిపించే అంశాన్ని మరిచారని చెరకు రైతుల సంఘం నాయకుడు చెన్నమనేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీంతో ఈ ఎన్నికల్లో ఫ్యాక్టరీల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ మంత్రులు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని సందర్శించి తెరిపిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. మొత్తం మీద రైతుల సమస్యలను పరిష్కరించే వారికే రైతులు ఈ సారి ఎన్నికల్లో పట్టం కడతారని చెన్నమనేని శ్రీనివాసరావు చెప్పారు.
ఒక్కోసారి ఒక్కో పార్టీ విజయభేరి
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వరుసగా గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీలు విజయం సాధించాయి. 2009వ సంవత్సరం సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మధు యాష్కీ గౌడ్ ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన బరిలోకి దిగిన గులాబీ బాస్ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేసిన విజయం సాధించారు. అనంతరం 2019వ సంవత్సరంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎంపీ అయ్యారు. మరి 2024 ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పడుతున్న నేపధ్యంలో ఎవరిని విజయం వరిస్తుందో వేచిచూడాల్సిందే.
మరెన్నో రైతు సమస్యలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న పొలాలకు సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనగా చెప్పారు. మరో వైపు రైతు బంధు పథకం కింద ఐదు ఎకరాలకు పైగా ఉన్నవారికి ఇంకా అందలేదు. దీంతోపాటు రైతురుణమాఫీ ఇంకా జరగలేదు. ఈ అంశాలపై చైతన్యవంతులైన రైతులు అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు.
గల్ఫ్ ఓటు బ్యాంకు కీలకమే
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గల్ఫ్ రిటర్నీలే కాకుండా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలున్నాయి. వీరి ఓట్ల శాతం 20 శాతానికి పైగా ఉండటంతో గల్ఫ్ కార్మికుల సంక్షేమం మరోసారి ఎన్నికల్లో ప్రధానచర్చనీయాంశంగా మారింది. ప్రస్థుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. గల్ప్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తామని ప్రవాసీ సంఘాల నాయకుడు మంద భీంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే అధిక ఓట్ల శాతం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి 33.4 శాతం ఓట్లు దక్కాయి. బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి 32.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలచి బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీ 29.3 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైనా నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎష్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్ల శాతం తేడా చాలా తక్కువగా ఉండటంతో గట్టి పోటీ నెలకొందని విదితమవుతుంది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ 45.3 శాతం ఓట్లతో విజయం సాధించారు. 38.6 శాతం ఓట్లతో కల్వకుంట్ల కవిత రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం 6.5 శాతం ఓట్లు వచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ముస్లిం, ఎస్సీ,ఎస్టీ ఓటర్లే కీలకం
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లే కీలకం కానున్నారు. బలహీన వర్గాల వారంతా కలిసి 36.4శాతం ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా 17.4శాతం ఓటర్లు ముస్లింలున్నారు. ఎస్సీ ఓటర్లు 13.4 శాతం, ఎస్టీ ఓటర్లు 5.6 శాతం మంది ఉన్నారు. వీరి ఓట్లే ఎన్నికల్లో విజయాన్ని ప్రభావితం చేయనుంది. దీంతో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్ధతు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తంమీద పసుపు, చెరకు రైతులు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో ఎన్నికల ఫలితం వెలువడే వరకు వేచిచూడాల్సిందే.
Next Story