ఈ ఎన్నికల్లో పోటీపై పసుపు రైతుల నిర్ణయమేంటి?
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పసుపు బోర్డు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రైతులు ఎవరివైపు నిలబడతారు, మళ్ళీ పోటీలో నిల్చునే అవకాశాలున్నాయా? అనే చర్చ మొదలైంది.
సరిగ్గా ఐదేళ్ల క్రితం తెలంగాణలో పసుపు రైతులు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. అప్పటి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవితకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. 177 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా నిజామాబాద్ 2019 పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ వేశారు. దీంతో కవితకి గట్టి దెబ్బే పడింది. ఆమెకి 4,09,709 ఓట్లు పడగా 70,875 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
అదే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయించే బాధ్యత నాది అని బాండ్ పేపర్ రాసి, 480,584 ఓట్లు సాధించి గెలిచారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మధు యాష్కీ 69,240 వేల ఓట్లు దక్కించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రైతుల్లో ఇప్ప లచ్చన్న 6,096 వేల ఓట్లు దక్కించుకోగా, మరో రైతు అస్లీ గణేష్ 2,648 ఓట్లు గెలుచుకుని సత్తా చాటారు.
కాగా, 2024 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పసుపు బోర్డు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మోదీ అసెంబ్లీ ఎన్నికల ముందు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇన్నేళ్ళుగా స్పైసెస్ బోర్డు కింద ఉన్న పసుపుని విడదీసి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సెంట్రల్ క్యాబినెట్ కూడా పసుపు బోర్డు బిల్లుకి ఆమోదం తెలిపింది. గెజిట్ కూడా విడుదల అయింది. అయినప్పటికీ పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది.
పోటీకి దూరంగా రైతులు...
పసుపు బోర్డు ప్రకటన చేసినప్పటికీ ఇంకా కార్యాలయ నిర్మాణం అయితే కాలేదు. దీంతో రైతులు ఎవరివైపు నిలబడతారు, మళ్ళీ పోటీలో నిల్చునే అవకాశాలున్నాయా? పసుపు బోర్డు ప్రకటించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతగా ధర్మపురి అర్వింద్ ని గెలిపిస్తారా? లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఓటేస్తారా అనే చర్చ నడుస్తోంది.
అయితే, నిజామాబాద్ రైతులు ఈసారి పోరాటాలు చేయడానికి కానీ, ఎన్నికల్లో నిలబడటానికి కానీ ఆసక్తి కనబరచడం లేదు. దీనికి కారణం 2019 ఎన్నికల సమయంలో క్వింటా పసుపు ధర రూ.3000 నుండి రూ.5000 వరకు మాత్రమే ఉండేది. దీంతో సాగు ఖర్చులకి కూడా వచ్చిన పంట రాబడి సరిపోయేది కాదు. పంట దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నష్టపోవడం జరిగేది. ఈ భయంతోనే పసుపు సాగుచేసే విస్తీర్ణం కూడా తగ్గించేశారు రైతులు.
కానీ, కొంతకాలంగా పసుపుకి డిమాండ్ పెరిగింది. మార్చ్ నెలలో క్వింటాల్‌కు రూ. 11 వేల నుంచి రూ. 16 వేల వరకు ధర పలికింది. దీంతో పసుపు రైతులు లాభాలబాట పట్టారు. ఇక నామినేషన్ల విషయానికి వస్తే.. నామినేషన్ ఖర్చులు జనరల్ కేటగిరీకి రూ. 10,000, అట్టడుగు వర్గాలకు రూ. 5,000 అవుతున్నాయి. ఇది రైతులకి అదనపు భారమే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పసుపు బోర్డు ఏర్పాటుకి ఆమోదం తెలపడంతో భవిష్యత్తులో తమకి మరింత లబ్ది చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన ఆవశ్యకత లేదనే నిర్ణయానికి వచ్చారు.
ఈసారి మూడు ప్రధాన పార్టీల నుండి కీలక నేతలు నిజామాబాద్ బరిలో నిలుచున్నారు. బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీలో ఉన్నారు. నిజామాబాద్ లో టగ్ ఆఫ్ వార్ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.