కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్..  బీఆర్‌ఎస్‌ కకావికలు..
x
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ జెండాలు

కాంగ్రెస్‌ ఆపరేషన్ ఆకర్ష్.. బీఆర్‌ఎస్‌ కకావికలు..

ఒక్క ఓటమి..ఎన్నో చిక్కులు.. నిన్నటి దాకా అందరూ ఎస్‌ బాస్‌ అన్నవాళ్లు ఇవాళ సారీ బాస్‌ అంటున్నారు. అధికారాంతమున చూడవలే అయ్యావారి సౌభాగ్యముల్‌ అంటే ఇదేనేమో..


బీఆర్‌ఎస్‌కు అధికార పార్టీ నుంచి కొత్త చిక్కులు మెుదలయ్యాయి. ఇప్పటికే అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి.. స్థానిక సంస్థల్లో పట్టు లేకుండా చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల్లో పట్టు బిగించేందుకు... మున్సిపాలిటీలు, జడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ఇస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుచరులకు పదవులు కట్టబెట్టిన BRS ఎమ్మెల్యేలు... అవిశ్వాసంపై చేతులెత్తేస్తున్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత నేతలదే బాధ్యతనే సంకేతాలు ఇస్తుండటంతో వారు పదవులకు దూరమవుతున్నారు.

స్థానిక సంస్థలపై పట్టుకు కాంగ్రెస్‌ కసరత్తు


అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ..... స్థానిక సంస్థలపై గురి పెట్టింది. బీఆర్‌ఎస్‌ పాగా వేసిన స్థానిక సంస్థలపై పట్టు సాధించే వ్యూహాల్లో నిమగ్నమయ్యింది కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు... మున్సిపల్ మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా గులాబీ పార్టీ నేతలే ఎన్నికయ్యారు. అధికార పార్టీ ప్రభావంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కారెక్కి పదవులు చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల జోరు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా విపక్ష నేతలను.. హస్తం పార్టీలో చేర్చుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది.

ఆపరేషన్ ఆకర్ష్‌...


ప్రభుత్వం మారిన నెల రోజుల్లోపే ఆపరేషన్‌ ఆకర్ష్‌ను క్షేత్రస్థాయిలో వేగంగా అమలు చేస్తోంది. మరో ఏడాదిపాటు స్థానిక సంస్థల కాలపరిమితి ఉండటంతో.... మున్సిపాలిటీలు, జడ్పీలపై గులాబీ జెండా దించాలని హస్తం పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే పలు మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాలతో BRS నేతలు అధికారం కోల్పోయారు. నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్‌లోనూ పాగా వేసేందుకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనూ గులాబీ నేతలను హస్తం పార్టీలో చేర్చుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించింది కాంగ్రెస్‌. అధికారంలో ఉన్నప్పుడు తమ నేతలకు పదవులు కట్టబెట్టినా..... ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాలపై BRS ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 10 మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులను అవిశ్వాస తీర్మానాలతో హస్తం పార్టీ దక్కించుకుంది. అయితే... స్థానాలను కాపాడుకునేందుకు పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని గులాబీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

రానున్న రోజుల్లో మరిన్ని మున్సిపాలిటీలతో పాటు జడ్పీ స్థానాల్లో హస్తం పార్టీ పాగా వేయనుంది. ఇప్పటికైనా గులాబీ పార్టీ తమ గుప్పిట్లో ఉన్న స్థానాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి వస్తున్నాయి.

Read More
Next Story