నో కేసీఆర్, నో బీఆర్ఎస్, నో కేటీఆర్..ఓన్లీ కవిత
x
Kalvakuntla Kavitha

నో కేసీఆర్, నో బీఆర్ఎస్, నో కేటీఆర్..ఓన్లీ కవిత

కవితను రిసీవ్ చేసుకోవటానికి జాగృతి కార్యకర్తలు తప్ప పార్టీ నేతలు, క్యాడర్ మచ్చుకి ఓక్కరు కూడా కనబడలేదు


ఇది..కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయినపుడు కనిపించిన ప్లకార్డులు. అమెరికాలో కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత శుక్రవారం రాత్రి అమెరికా నుండి శంషాబాద్ కు చేరుకున్నారు. కవిత అమెరికాలో బయలుదేరక ముందే బీఆర్ఎస్ లో, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్(KCR) ను ఉద్దేశించి ఆమె రాసిన లేఖ లీక్ రూపంలో బహిర్గతమై సంచలనంగా మారింది. దాంతో కవిత(Kavitha)ను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టుకు ఎంతమంది లీడర్లు వస్తారనే విషయంలో బాగా ఆసక్తి పెరిగిపోయింది. అయితే కవితను రిసీవ్ చేసుకోవటానికి జాగృతి కార్యకర్తలు తప్ప పార్టీ నేతలు, క్యాడర్ మచ్చుకి ఓక్కరు కూడా కనబడలేదు.

కవిత రిసీవింగులోనే తెలిసిపోయింది పార్టీలో ఆమె పరిస్ధితి ఏమిటనేది. కేసీఆర్ ను కాదంటే కవిత చెల్లనిరూపాయేనా అనే ప్రచారం కాంగ్రెస్ నుండి బాగా పెరిగిపోతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో ఇరుక్కుని కవిత తీహార్ జైలులో ఉన్నపుడు కూడా పార్టీ నేతలు ఆమెను చూసేందుకు పోటీపడిన విషయం తెలిసిందే. మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy), సత్యవతి రాథోడ్ లాంటి చాలామంది మహిళానేతలు పోటీలుపడి ఢిల్లీకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. మహిళానేతలే కాకుండా మాజీమంత్రులు, ఎంఎల్ఏలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళొచ్చారు. అలాంటిది ఇంతలో ఎంతమార్పు.

పార్టీ నేతల్లోని అంతరంగాన్ని కవిత లేఖ ద్వారా అధినేత, తండ్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తు రాసిన లేఖ బహిర్గతం అవటం పార్టీలో సంచలనంగా మారింది. కవిత వైఖరిపై నేతలు, క్యాడర్లో అయోమయం పెరిగిపోతోంది. నిజంగానే కేసీఆర్ తప్పులను కవిత ఎత్తిచూపారా ? లేకపోతే కేసీఆరే ఏదైనా వ్యూహంతో కవితతో లేఖను రాయించుకున్నారా ? ఇదీకాకపోతే కేసీఆర్ కు కవిత రాసిన లేఖను వ్యూహాత్మకంగా సోదరుడు కేటీఆర్(KTR) లీక్ చేయించారా అన్న అనేక అనుమానాలు పార్టీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఏదేమైనా శంషాబాద్ ఎయిర్ పోర్టు(Samshabad Air Port)లో కవిత రిసీవింగ్ లో పార్టీ శ్రేణులు ఒక్కరంటే ఒక్కరు కూడా కనబడలేదు. ఇదేసమయంలో రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన జాగృతి నేతలు ప్రదర్శించిన ప్లకార్డుల్లో కవిత పేరు తప్ప రెండో పేరును కనబడనీయలేదు. కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పేరుతో పాటు కేటీఆర్ పేరును కూడా ఎక్కడా కనిపించనీయలేదు. బ్యానర్లు, ప్లకార్డుల్లో ఎక్కడచూసినా కవిత పేరుమాత్రమే కనబడింది. అంతేకాకుండా ‘కాబయే సీఎం కవిత..సీఎం..సీఎం’ అంటు ఒకటే నినాదాలు. కల్వకుంట్ల కుటుంబంలో ఏమి జరగుతోంది, జరుగుతున్నదంతా స్క్రిప్టెడా లేకపోతే నిజంగానే విభేదాలు బయటపడ్డాయా అన్నది తొందరలోనే తేలిపోతుంది.

Read More
Next Story