జనాల్లో పెరిగిపోతున్న ‘నోమో’ ఫోబియా
కారణం ఏదైనా జనాల్లో మొబైల్ కారణంగా ఆందోళన పెరిగిపోతోంది. దాన్నే ‘నో మొబైల్ ఫోబియా’ అంటున్నారు నిపుణులు.
హరిత పదినిముషాల నుండి చాలా ఆందోళనగా ఉంది. కారణం కుటుంబసభ్యులకు అనారోగ్యమో లేకపోతే తన ఉద్యోగంలో ఏదైనా సమస్యో కాదు. మొబైల్ ఫోన్ కనబడటంలేదు.
రామకృష్ణ ఈమధ్య చాలా అసహనంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే క్లాసులో మార్కులు తక్కువగా వస్తుండటమో లేకపోతే కుటుంబంలో సమస్యలో కావు. తన మొబైల్ చార్జింగులో సమస్యలు మొదలయ్యాయి. నూరుశాతం చార్జింగ్ అయినా తొందరగానే చార్జింగు తగ్గిపోతోంది. అందుకనే రామకష్ణ అసహనంగా ఉంటున్నారు.... ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కో సమస్య. హోలు మొత్తం మీద అందరిలోని ఆందోళనకు కామన్ సమస్య కనబడుతోంది. అదేమిటంటే మొబైల్ ఫోన్. ఫోన్ సరిగా పనిచేయకపోయినా సమస్యే, ఛార్జింగ్ తగ్గిపోతున్నా సమస్యే, కనబడకపోయినా సమస్యే. కారణం ఏదైనా జనాల్లో మొబైల్ కారణంగా ఆందోళన పెరిగిపోతోంది. దాన్నే ‘నో మొబైల్ ఫోబియా’ అంటున్నారు నిపుణులు.
మనుషుల అవసరాలను తీర్చటానికి దీన్ని తయారుచేస్తే చివరకు ఇదే మనుషుల జీవితాలను శాసించేస్ధాయికి చేరుకుంది. ఊపిరి పీల్చకపోయినా ఉండగలరేమో కాని మొబైల్ చేతిలో లేకపోతే మాత్రం ఉండలేనట్లుగా తయారైపోతున్నారు జనాలు. ఈ ఫోబియా తీవ్రతను పరీక్షించేందుకు నిపుణులు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని 1500 మందిపై అధ్యయనం చేశారు నిపుణులు. మొబైల్ ఫోన్ను కొంచెంసేపు దూరంగా ఉంచాలన్నా తమకేదో అయిపోతుందన్న ఆందోళన వ్యక్తంచేసినట్లు అధ్యయనంలో బయటపడింది. అంటే మొబైల్ ను కొద్దిసేపు దూరంగా పెడితే తమ ప్రాణాలే పోతాయన్నట్లుగా జనాలు బిహేవ్ చేశారట.
మొబైల్ ఫోన్ వినియోగం మితిమీరిపోవటంతో చాలామంది జనాల్లో మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. డ్రగ్స్, మద్యానికి జనాలు బానిసలు అయిపోయినట్లుగానే మొబైల్ కు కూడా జనాలు ముఖ్యంగా యువత బానిసలు అయిపోతున్నట్లు అధ్యయనంలో బయటపడింది. తీవ్రమైన మానసిక రుగ్మతగా మారబోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి నలుగురిలో ముగ్గురిపై మొబైల్ ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధ్యయనం బయటపెట్టింది. నగరాలు, గ్రామాలనే తేడా లేకుండా మొబైల్ వాడుతున్న వారిలో 75 శాతం జనాల ప్రవర్తనలో తేడాలు కనబడ్డాయి.
అధ్యయనంలో తేలిన అంశాల్లో ముఖ్యమైనవి ఏమిటంటే ఛార్జింగ్ అవ్వకపోవటం, ఛార్జి అయినా వెంటనే తగ్గిపోతుండటంతో 65 శాతం జనాల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అందుకనే వీరిలో అత్యధికులు తమ మొబైల్ ఫోన్ను తరచూ మార్చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళల్లోనే ఆందోళన ఎక్కువగా పెరిగిపోతున్నట్లు అధ్యయనంలో తేలింది. 21-41 సంవత్సరాల మధ్య వయస్సుల వారిలోనే ఇలాంటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మొబైల్ వినియోగానికి బానిసలైన వాళ్ళల్లో అనేక మానసిక సమస్యలు మొదలైనట్లు ప్రముఖ మొబైల్ తయారీ సంస్ధ ఒప్పో అద్యయనంలో కూడా బయటపడింది. మొబైల్ వాడకాన్ని తగ్గించుకోకపోతే భవిష్యత్తులో జనాలు అనేక రకాల అనారోగ్యాలబారిన పడటం ఖాయమని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వివరించారు.
24 గంటలూ మొబైల్ ఫోన్ చూడటం కోసం మెడను కిందకి వంచటం, ఫోన్ను దగ్గరగా ఉంచుకోవటం వల్ల కళ్ళపైన కూడా ప్రభావం పడుతోందన్నారు. గంటల తరబడి ఫోన్ను దగ్గర నుండి చూడటం వల్ల మొబైల్ వెలుగు కారణంగా కళ్ళ సమస్యలు, దృష్టి సమస్యలు కూడా పెరిగిపోతున్నట్లు తరుణ్ చెప్పారు. ఇలాంటి సమస్యలన్నీ కలిసి మెదడుపైన తీవ్రమైన ప్రభావం చూపుతాయని తరుణ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎంత వీలైతే అంతగా మొబైల్ కు రోజులో కొద్దిగంటలైనా దూరంగా ఉండటం అలవాటుచేసుకోకపోతే తీవ్రమైన దుష్పరిణామాలు తప్పవని తరుణ్ హెచ్చరించారు.