ఇండియాను ఎవ్వరూ బెదిరించలేరు, రైతు ప్రయోజనాలపై రాజీ ఉండదన్న ప్రధాని
x

ఇండియాను ఎవ్వరూ బెదిరించలేరు, రైతు ప్రయోజనాలపై రాజీ ఉండదన్న ప్రధాని

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ


ఎవరెన్ని బెదిరింపులు చేసినా రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల ప్రయోజనాలు కాపాడడంలో ఎటువంటి రాజీ ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని, కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే..
‘ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.

రాజ్యాంగం మనకు అనునిత్యం మార్గదర్శనం చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతల సేవలను నిత్యం గుర్తుచేసుకుంటున్నాం. రాజ్యాంగం కోసం బలిదానం చేసిన తొలివ్యక్తి శ్యామప్రసాద్‌ ముఖర్జీ. శ్యామప్రసాద్‌ ముఖర్జీ త్యాగం మరువలేనిది. ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌. మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు’ అని మోదీ అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో సత్తా చాటాం
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘పహల్గామ్‌ దాడితో యావత్‌ దేశం ఆక్రోశంతో రగిలిపోయింది. ఆ ఆక్రోశానికి సమాధానంగానే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాం. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. యుద్ధతంత్రాలు, వ్యూహాలు పూర్తిగా మన జవాన్లే తయారుచేసుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు నిద్ర పట్టకుండా చేశాం. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పింది. ఇకపై బ్లాక్‌మెయిల్‌ చేసేవారిని ఉపేక్షించేది లేదు. అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడేది లేదు. మానవాళి మనుగడకు ఉగ్రవాదులు ప్రమాదకరం వికసిత్‌ భారత్‌కి ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదమే ఆధారం. సింధూ నదిలో నీరు భారత రైతుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు.
అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పాం. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నా. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదు. వాటిని భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. వాటిపై సంపూర్ణాధికారం భారత్‌ది, భారత రైతులది మాత్రమే. ఆ ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదు. దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదు’’ అని ఎర్రకోట వేదికగా పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ స్పష్టంచేశారు.
రైతులు, మత్స్యకారులు, పశుపోషకుల ప్రయోజనాల్లో ఎలాంటి రాజీ ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. "భారత రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు మన ప్రాధాన్యం. వారిని రక్షించడానికి నేను గోడలా నిలుస్తాను. వారి ప్రయోజనాల్లో ఎలాంటి రాజీ ఉండదు," అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో తొలి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం రూ.15,000 ఇస్తుందని ప్రధాని ప్రకటించారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
రూ.1 లక్ష కోట్లతో అమలు చేయబోయే ప్రధానమంత్రి వికసిత్ భారత్‌ రోజ్‌గార్‌ యోజనను స్వాతంత్య్ర దినోత్సవం నుంచే ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ పథకం ద్వారా దాదాపు 3 కోట్ల యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
"అవసరంలేని చట్టాలను రద్దు చేస్తాం. గత ఏళ్లలో పన్నులు తగ్గించాం, GST సంస్కరణలు చేశాం. ఈ దీపావళికి నెక్స్ట్‌-జెనరేషన్ GST సంస్కరణలను బహుమతిగా ఇస్తా. దీంతో సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, MSMEలకు కూడా లాభం చేకూరుతుంది," అని మోదీ పేర్కొన్నారు.
"మనం ఎవరినీ తక్కువ చేయడానికి రాలేదు, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వచ్చాం"
"ఆర్థిక స్వార్థం పెరుగుతున్న ఈ కాలంలో మన సామర్థ్యాలను పెంచుకోవాలి. ఈ మార్గంలో నడిస్తే మనల్ని ఎవ్వరూ ఆపలేరు," అని ప్రధాని చెప్పారు.
"2047 దూరం కాదు. ఒక్క క్షణం వృథా చేయరాదు. మన MSMEలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే పరికరాలను తయారు చేస్తున్నాయి. నాణ్యతలో కొత్త శిఖరాలను అధిరోహించాలి. తయారీ రంగం నినాదం 'ధర తక్కువ – శక్తి ఎక్కువ' (Dam kam, dum jyada) కావాలి," అని మోదీ అన్నారు.
"గత దశాబ్దంలో మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతాలు సృష్టించాయి. 'మన్ కీ బాత్'లో సరదాగా భారతదేశంలోనే బొమ్మలు తయారు చేయమని అన్నాను. కానీ ఆ సందేశాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకుని దేశం ఇప్పుడు బొమ్మలను ఎగుమతి చేయడం ప్రారంభించింది," అని ప్రధాని అభినందించారు.
Read More
Next Story