
‘కాంగ్రెస్ పాలనతో ఎవరూ సంతోషంగా లేరు’
కాంగ్రెస్ వల్ల ఏ ఒక్కరికీ మేలు జరిగింది లేదని, సంక్షేమం సైతం ప్రజలకు దూరమైందని అన్నారు కేటీఆర్.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పార్టీ పాలనతో రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ వల్ల ఏ ఒక్కరికీ మేలు జరిగింది లేదని, సంక్షేమం సైతం ప్రజలకు దూరమైందని అన్నారు. బీఆర్ఎస్ హాయంలో సంక్షేమం విషయంలో ఏ ఒక్కరికీ చీకూచింతలనేవి లేవని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్‌గల్‌లో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రజలంతా కూడా కేసీఆర్ ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పాలనను పోల్చుకుంటున్నారని, మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
‘‘కేసీఆర్ హయాంలో రైతులు రాజుల్లో బతికారు. రైతు బంధు టయానికి అందింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. రేవంత్ సీఎం అయిన తర్వాత సోనియాగాంధీ పుట్టినరోజు రెండుసార్లు వచ్చింది కానీ రైతులకు ఒక్కసారి కూడా రుణమాఫీ జరగలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25శాతం కూడా రుణమాఫీ జరగలేదు. 15 నెలల్లో 35సార్లకు పైగా హస్తినకు పయనమైన రేవంత్.. రాష్ట్రానికి రూ.35పైసలు కూడా తీసుకురాలేదు. అప్పులు కట్టలేదని రైతుల ఇళ్ల తలుపులు, పొలం మోటరు స్టార్టర్లు లాక్కెళ్తున్నారు. రేపోమాపో పుస్తెలతాడు కూడా లాక్కెళతారు’’ అని విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతోనే కాంగ్రెస్ నేతలకు ప్రజలు, వారి కష్టాలు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలి. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ప్రపంచంతో పోటీ అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర రియల్ ఎస్టేట్ తప్ప.. రాష్ట్రంలోని ఇతర రంగాలు, వాటి అభివృద్ధి గురించి పట్టదు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు సొంత ఊరు, అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఏమైనా చేశారా? అని అడగడానికే ఇక్కడకు వచ్చాం. కుల గణన పేరుతో సీఎం రేవంత్.. బీసీలను మోసం చేశారు’’ అని విమర్శలు చేశారు.