
అడ్రస్ లేని కేసీఆర్
వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరిగిందంటే అధినేత కేసీఆర్ పాల్గొనలేదన్న విషయం అర్ధమవుతోంది
తెలంగాణకు ఎంతో కీలకమైన సెప్టెంబర్ 17వ తేదీన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎక్కడా కనబడలేదు. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ విమోచన దినం అని కాదు కాదు తెలంగాణ(Telangana September 17) విలీన దినోత్సవం అని ఇదికూడా కాదు తెలంగాణ విద్రోహదినోత్సవం అని రకరకాల పేర్లతో రాజకీయపార్టీలు పిలుస్తున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం అయితే ప్రజాపాలనా దినోత్సవం పేరుతో పెద్దఎత్తున కార్యక్రమం చేసింది. తెలంగాణ విమోచనం పేరుతో కేంద్రప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్(Central Minister Rajnadh Singh) పాల్గొన్నారు. మిగిలినపార్టీలు తమ కార్యాలయాల్లో సెప్టెంబర్ 17ను వాటిష్టం వచ్చిన పేర్లతో నిర్వహించుకున్నాయి. అంతాబాగానే ఉందికాని తొమ్మిదిన్నర ఏళ్ళు తెలంగాణను పాలించిన కేసీఆర్(KCR) ఎక్కడా కనబడలేదు.
రాచరికం నుండి ప్రజాస్వామ్య వ్యవస్ధలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజని కొత్తగా పేరుపెట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్లో జెండా ఎగరేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరిగిందంటే అధినేత కేసీఆర్ పాల్గొనలేదన్న విషయం అర్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడేమో కేసీఆర్ భారీఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేవారు. మరి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈకార్యక్రమంలో ఎందుకు పాల్గొనటంలేదు ? అన్నదే అర్ధంకావటంలేదు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ జనాల్లోకి రావటమే మానుకున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కూడా ఏదో మొక్కుబడిగా పాల్గొన్నారంతే. పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలోనూ పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి జనాల్లోకి రావటం పూర్తిగా మానుకున్నారు.
లేస్తే మనిషిని కాను అన్నపద్దతిలో హనుమకొండలోని ఎల్కతుర్తి గ్రామంలో జరిగిన బహిరంగసభలో ఒక ప్రకటనచేశారు. అదేమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతానని భీషణ ప్రతిజ్ఞచేసిన కేసీఆర్ తర్వాత అసలు అడ్రస్సే లేరు. ఏదైనా అవసరం వచ్చినపుడు సీనియర్ నేతలను ఎర్రవల్లిలోని ఫామ్ హౌసుకు పిలిపించుకుని మాట్లాడటం తప్ప తానుగా బయటకు రావటమే లేదు. సెప్టెంబర్ 17వ తేదీ లాంటి ఎంతో ప్రాధాన్యత ఉన్న రోజున కూడా కేసీఆర్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతోనే తెలంగాణ విమోచనం లేదా విలీనానికి ముందు అసవులుబాసిన త్యాగమూర్తులకు కేసీఆర్ ఎంతగా విలువ ఇస్తున్నారో అర్ధమైపోతోంది. అమరవీరులంటే లెక్కలేదు, వారి త్యాగాలకు విలువలేదు.
ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే అధికారంలో ఉంటే మాత్రమే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అప్పుడప్పుడు జనాలకు కనబడతారని. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా జనాలతో తనకు పనిలేదు, జనాలకు కేసీఆర్ తో అవసరంలేదు. అందుకనే జనాలు ఎన్నికష్టాల్లో ఉన్నా వారిని కలిసి ఊరడించటం, ఓదార్పు మాటలు చెప్పటం అన్నదే లేదు. చివరకు పార్టీ ఆఫీసులో జరిగిన సెప్టెంబర్ 17 కార్యక్రమానికి కూడా హాజరుకాలేదంటే కేసీఆర్ ను ఎలాగ అర్ధంచేసుకోవాలి ? ఈమధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్న కేసీఆర్ నాలుగుసార్లు ఆసుపత్రిలో చేరారు. ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ బయటకు రావటంలేదంటే ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారా ? జస్ట్ ఆస్కింగ్.