
ముగిసిన రెండో విడత నామినేషన్లు
డిసెంబర్ 3 నుంచి మొదలు కానున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలివిడత తరహాలోనే రెండో విడతలో కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం భారీగా ఆఫర్లు ఇచ్చారు. ఈ క్రమంలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమై మంగళవారం ముగిసింది. ఈ రెండో విడతలో 4322 సర్పంచ్ స్థానాలకు, 38342 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. వీటిలో సర్పంచ్ స్థానాలకు 12479, వార్డు మెంబర్ స్థానాలకు 30040 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. పలువురు ఏకగ్రీవాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలను, అభ్యర్థులను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.
తొలి విడతలోనూ భారీగా నామినేషన్లు
తొలి విడత పంచాయతీ ఎన్నికల స్థానాలకు సర్పంచ్ స్థానాలకు దాదాపు 25654 వేలు, వార్డు మెంబర్ స్థానాలకు 82500వేల వరకు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యామ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అవే మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఉన్నారని చెప్పారు. మొదటి దశలో 4,236 సర్పంచ్ పదవులకు, అలాగే 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.

