మొదలైన నామినేషన్ల ప్రక్రియ
x
TS election Commission

మొదలైన నామినేషన్ల ప్రక్రియ

మొదటి విడతలో 31 జిల్లాల్లో, 58 రెవిన్యు డివిజన్ల పరిధిలోని 292 జడ్పీటీసీ, 2964 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి


ఉత్కంఠనడుమ తెలంగాణలో స్ధానికసంస్ధల ఎన్నికల కోసం నామినేషన్ల ప్రెక్రియ గురువారం మొదలైంది. స్టేట్ ఎలక్షన్ కమీషన్ ముందుగానే ప్రకటించినట్లు అక్టోబర్ 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 9న మొదలైన నామినేషన్ల ప్రక్రియ రెండురోజుల తర్వాత అంటే అక్టోబర్ 11వ తేదీన ముగుస్తుంది. మరుసటి రోజు అక్టోబర్ 12వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ తేదీ అక్టోబర్ 15. పోలింగ్ అక్టోబర్ 23వ తేదీ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 11వ తేదీన జరుగుతుంది.

మొదటి విడతలో 31 జిల్లాల్లో, 58 రెవిన్యు డివిజన్ల పరిధిలోని 292 జడ్పీటీసీ, 2964 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్ధానాల్లో పోటీచేయబోయే వాళ్ళనుండి మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఐదు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమీషనర్ రాణికుముదిని ఏర్పాట్లుచేశారు. తొలి రెండుదశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనుండగా మిగిలిన మూడు దశల్లో పంచాయితి ఎన్నికలు జరుగుతాయి.

నామినేషన్లు దాఖలుచేయబోయే అభ్యర్ధులు జడ్పీటీసీ జనరల్ సీటులో పోటీచేయాలని అనుకుంటున్నవారు రు. 5 వేలు, రిజర్వుడు సీట్లలో పోటీచేయబోతున్నవారు రు. 2500 డిపాజిట్ చెల్లించాలి. అలాగే ఎంపీటీసీ స్ధానాలకు జనరల్ సీటులో రు. 2500, రిజర్వుడు సీటుకు రు. 1250 డిపాజిట్ చెల్లించాలి. మొదటిదశలో మొదక్ జిల్లా, సంగారెడ్డి, సిద్ధిపేట, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లిలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

బీసీ 42శాతం రిజర్వేషన్లు బాగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో9కి వ్యతిరేకంగా, అనుకూలంగా 28 పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపైన హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. బుధవారమే రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఏదో ఒక తీర్పు చెబుతుందని అనుకున్న వారికి తీవ్రనిరాశఎదురైంది. ఎందుకంటే విచారణను ఈరోజు మధ్యాహ్నానికి వాయిదావేసింది. ప్రభుత్వం జారీచేసిన జీవో9 ని కోర్టు కొట్టేస్తుందా ? ఆమోదిస్తుందా అనే విషయం రాజకీయపార్టీల్లో బాగా టెన్షన్ పెంచేస్తోంది. అసలు స్ధానికసంస్ధల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా జరగవా ? అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

ఒకవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసినా కోర్టు మాత్రం స్టే ఇవ్వలేదు. రిజర్వేషన్ల పెంపు ఫైలుపై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని నిలదీసింది. దీంతో ఎన్నికలు జరగవనే ప్రచారం పెరిగిపోయింది. ఇదేసమయంలో ఎన్నికల ప్రక్రియను నిలుపుదలచేస్తు స్టే ఇవ్వటానికి నిరాకరించింది. అందుకనే ఎన్నికల కమీషన్ తన షెడ్యూల్ ప్రకారం గురువారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించేసింది. మధ్యాహ్నం విచారణ తర్వాత కోర్టు ఏమి తీర్పిస్తుందో చూడాలి.

Read More
Next Story