
శ్రీలంకన్‘క్యూ’ కాదు.. ఇండియన్ లైన్లే
ట్రక్కు డ్రైవర్ల సమ్మె, ఆందోళనలతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ కు ఎక్కడ కొరత ఏర్పడుతుందనే ఆందోళనలతో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు.
కొన్ని నెలల క్రితం మన పొరుగు దేశం శ్రీలంకలో జరిగిన సంఘటనలు గుర్తు ఉన్నాయా? ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో కిలోమీటర్ల కొద్దీ క్యూ లు.. గంటల కొద్దీ వేచి చూడడం ఇంకా మన మైండ్ నుంచి బహూశా చెదిరిపోయి ఉండకపోవచ్చు. అచ్చు అలాంటి సంఘటనలే దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో మంగళవారం కనిపించాయి.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయసంహితపై ట్రక్కు డ్రైవర్లు భగ్గుమన్నారు. కొత్త చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో ఇక ముందు కఠిన శిక్షలు అమలు చేయనున్నారని, దీనిని రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది.
ఈ నిరసనలతో ఇంధన ట్రక్కులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధనకొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంక్ ల ముందు బారులు తీరారు. మీరు చూస్తున్న ఫోటో వాటికి సంబంధించిదే.
దేశంలోని మధ్యప్రదేశ్, కర్నాటక, జమ్మూకశ్మీర్, మహరాష్ట్ర, లద్దాక్ ఇలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే తేడా లేకుండా ఎక్కడా చూసిన పెట్రోల్ బంక్ ల ముందు ప్రజలు బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సైతం ఆటంకాలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులు ఉన్నఫలంగా మూసివేయడమే, నో స్టాక్ బోర్డ్ పెట్టడమో జరుగుతోంది. దీనిపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా బంక్ లు ఎలా మూసివేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చట్టంలో ఏముందంటే
భారత న్యాయసంహిత చట్టంలోని నిబంధన ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు దుర్ఘటనకు పాల్పడిన తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే దీనిపై ట్రక్కు, లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారు ఇకముందు డ్రైవర్ల వృత్తిలోకి రారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వెంటనే కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు.

