తెలంగాణలో ముగ్గురి తలరాతను మార్చేసిన ’నోటా‘...ఆదరణ పెరుగుతోంది ?
2019 ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లోను నోటాకు పెద్దస్ధాయిలోనే ఓట్లొచ్చాయి. అప్పుడు ముగ్గురు అభ్యర్ధుల గెలుపును నోటాయే నిర్దేశించింది.
ఎన్నిక ఎన్నికకు జనాల ఆధరణ పెరిగిపోతోంది. ఎవరికి ఆదరణ పెరుగుతోందంటే నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్) ఆప్షన్ కు. నోటాకు ఎందుకు ఆదరణ పెరుగుతోందంటే జనాలకు ఎన్నికల వ్యవస్ధమీద, రాజకీయ పార్టీల మీద, పోటీచేస్తున్న అభ్యర్ధుల మీద నమ్మకం తగ్గిపోతోంది కాబట్టే. 13వ తేదీన జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో కొందరు అభ్యర్ధుల తలరాతను నోటానే డిసైడ్ చేస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులకు వచ్చిన మెజారిటి కన్నా నోటాకు పడిన ఓట్లే ఎక్కువకాబట్టి. ఒకపుడు పోటీలో ఉన్న అభ్యర్ధుల్లో ఎవరికీ ఓట్లు వేయటం ఇష్టంలేకపోయినా జనాలు ఎవరో ఒకరికి ఓటు వేయకతప్పేదికాదు. ఓటువేయటం ఇష్టలేని వాళ్ళు కొన్నిసార్లు కావాలనే ఒకేసారి ఇద్దరు అభ్యర్ధులకు పడేట్లుగా ఓటును వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తమ ఓటును తామే చెల్లకుండా చేసుకోవటం అన్నమాట. ఎందుకంటే ఓటువేయటం తమకు ఇష్టంలేదనేవాళ్ళు.
అయితే పీపుల్స్ యూనియర్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్)పోరాటం ఫలితంగా 2013 లో నోటా అనే ఆప్షన్ వచ్చింది. పీయూసీఎల్ కేసు వేయటంతో విచారించిన సుప్రింకోర్టు బ్యాలెట్ పేపర్లో నోటా అనే ఆప్షన్ ఉంచాలని కేంద్ర ఎన్నికల కమీషన్ను ఆదేశించింది. దాని ఫలితంగానే బ్యాలెట్ పేపర్, ఈవీఎంల్లో నోటా అనే ఆప్షన్ వచ్చింది. పోటీచేసే అభ్యర్ధుల్లో ఎవరికీ ఓట్లేయటం ఇష్టంలేని జనాలు అప్పటినుండి నోటాకు ఓట్లేసేస్తున్నారు. అందుకనే నోటాకు ఆదరణ పెరిగిపోతోంది. నోటాకు పెరుగుతున్న ఆదరణే పార్టీలతో పాటు అభ్యర్ధులను వణికిస్తోంది. 2019 ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లోను నోటాకు పెద్దస్ధాయిలోనే ఓట్లొచ్చాయి. అప్పుడు ముగ్గురు అభ్యర్ధుల గెలుపును నోటాయే నిర్దేశించింది.
జహీరాబాద్, మల్కాజ్ గిరి, భువనగిరి నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్ధుల మెజారిటికన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. జహీరాబాద్ లో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన బీబీ పాటిల్ కు 4,34,244 ఓట్లొచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి మదన్ మోహన్ రావుకు 4,28,015 ఓట్లు వచ్చాయి. అంటే పాటిల్ 6229 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ నోటాకు 11,640 ఓట్లు పడ్డాయి. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన రేవంత్ రెడ్డికి 6,03,748 ఓట్లొస్తే, బీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖరరెడ్డికి 5,92,829 ఓట్లు పోలయ్యాయి. రేవంత్ 10,919 ఓట్ల మెజారిటితో గెలిచారు. ఇక్కడ నోటాకు పడిన ఓట్లు 17,895. అంటే రేవంత్ మెజారిటీకన్నా నోటాకు సుమారు ఏడువేల ఓట్లు నోటాకు ఎక్కువచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 5,32,795 ఓట్లొచ్చాయి. కారుపార్టీ అభ్యర్ధి బూరనర్సయ్య గౌడ్ కు 5,27,576 ఓట్లు పోలయ్యాయి. కోమటిరెడ్డికి 5119 ఓట్ల మెజారిటితో గెలిస్తే ఇక్కడ నోటాకు వచ్చింది 12,021 ఓట్లు.
పై మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను నోటాయే డిసైడ్ చేస్తే మిగిలిన 14 నియోజకవర్గాల్లో కూడా నోటాకు బాగానే ఓట్లుపడ్డాయి. మహారాష్ట్రలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్ధుల మెజారిటికన్నా నోటాకు పడిన ఓట్లే చాలా ఎక్కువ. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి పడిన మొత్తం ఓట్లకన్నా నోటాకు పడిన ఓట్లే చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే. బీజేపీకి 1 శాతం లోపు ఓట్లుపడితే నోటాకు 3 శాతం ఓట్లు పడిన విషయం గుర్తుండే ఉంటుంది. నోటాకు ఆదరణ ఎందుకు పెరుగుతోందంటే ప్రజలకు ఎన్నికల వ్యవస్ధ, అభ్యర్ధులపైన నమ్మకాలు సడలిపోతున్నాయి కాబట్టే. ఎవరొచ్చినా చేసేదేమీ లేదు అందరు ఒక తానులో గుడ్డేకదా అన్న నిర్లిప్తత జనాల్లో పెరిగిపోతోంది. తాము పోలింగ్ కు వెళ్ళకపోతే ఎవరో ఒకళ్ళకి తమ ఓటును వేసుకునే అవకాశం ఇచ్చేబదులు తామే పోలింగుకు వెళ్ళి చెల్లకుండా చేస్తే సరిపోతుందనే ఆలోచనే నోటాకు ఓట్లు పెరిగేలా చేస్తోంది.
ఇదే విషయమై ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతు ‘ఎన్నికల్లో నోటా ఆప్షన్ కు ఆదరణ పెరిగిపోతోందంటే ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనమ’న్నారు. ఎన్నికలు, పార్టీలపై జనాల్లో నమ్మకం తగ్గిపోతోందన్నారు. ‘నోటాకు ఆదరణ పెరుగుతోందంటే జనాల్లో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనమ2ని అభిప్రాయపడ్డారు. ‘పార్టీలు అవే, నేతలూ వాళ్ళే కాబట్టి అభ్యర్ధులకు ఓట్లేయటానికి జనాలు ఇష్టపడటంలేద’న్నారు. ‘పార్టీలు, నేతల్లో పెరిగిపోతున్న అవినీతి వల్లే జనాలు నోటాకు ఓటు వేయటానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్న’ట్లు చెప్పారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతు ‘ప్రస్తుత ఎన్నికల వ్యవస్ధలో జనాలకు పార్టీలంటే అసంతృప్తి పెరిగిపోతోంద’న్నారు. ‘ఏపార్టీకి వేసినా ఒకటే కదా అన్న నిర్లిప్తత జనాల్లో పెరిగిపోతోంది కాబట్టే నోటాకు ఓట్లు పెరుగుతున్నా’యన్నారు. ‘నోటాకు ఆదరణ పెరగటం రాజకీయాలకు చాలా ప్రమాదకర’మని అభిప్రాయపడ్డారు. ‘రాజకీయాలపై జనాల్లో నమ్మకం పోతే వచ్చేది అరాచకమే’ అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి మాట్లాడుతు ‘ఓటర్లలో చైతన్యం పెరుగుతోంది కాబట్టే నోటాకా ఆదరణ పెరుగుతోంద’న్నారు. ‘తమ ఓటును వృధాచేసుకోవటం ఇష్టంలేని ఓటర్లు నోటాకు వేసేస్తున్న’ట్లు అభిప్రాయపడ్డారు. ‘ఓటర్లు నోటాకు హాఫ్ నాలెడ్జితోనే ఓట్లేస్తున్నారని అనుకోవాల’ని నాగిరెడ్డి చెప్పారు.