
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితకు నోటీసులు
ఏఐ జనరేటెడ్ ఫొటోని రీపోస్ట్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్(Smita Sabarwal) కు నోటీసులు జారీ అయ్యాయి
అత్యంత వివాదంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి 400 ఎకరాల భూముల విషయంలో ఏఐ జనరేటెడ్ ఫొటోని రీపోస్ట్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్(Smita Sabarwal) కు నోటీసులు జారీ అయ్యాయి. హెచ్సీయూ(HCU) భూముల్లో చెట్లను తొలగించేటపుడు బుల్ డోజర్ల ముందు జింకలు, నెమళ్ళు ఉన్న ఏఐ జనరేటెడ్ ఫోటోను స్మిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా మార్చి 31వ తేదీన రీపోస్ట్ చేసినందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీచేశారు. నోటీసుల ప్రకారం పోలీస్టుస్టేషన్ కు వచ్చి స్మిత నోటీసులకు తగిన సమాధానం చెప్పాల్సుంటుంది.
పర్యాటక, సాంస్కృతిక శాఖలకు స్మితా సబర్వాల్ ప్రిన్సిపుల్ సెక్రటరీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మే 7వ తేదీ మొదలై 31వ తేదీతో ముగిసే మిస్ వరల్డ్ 2025(Miss world 2025) అందాల పోటీల ఏర్పాట్లలో స్మిత చాలా బిజీగా ఉన్నారు. చేయాల్సిన ఏర్పాట్లు, జరుగుతున్న తీరుపై స్మిత వరసుబెట్టి ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే హెచ్సీయూ 400 ఎకరాల వివాదంలో పోలీసులు నోటీసులు జారీచేయటం ప్రాధాన్యత సంతరించుకున్నది. రెగ్యులర్ గా ట్విట్టర్ ఖాతా(Twitter)లో బాగా యాక్టివ్ గా ఉండే స్మితకు ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు, తప్పుడు పోస్టులను రీపోస్టు చేయకూడదన్న విషయం బాగా తెలుసు. తెలిసినా మరి ఎందుకు రీ పోస్ట్ చేశారన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ఆ రీ పోస్ట్ విషయంలోనే తగిన సమాధానం చెప్పాలని గచ్చిబౌలి ఎస్ఐ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ చెప్పారు. భారతీయ నాగరీక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 179 ప్రకారం ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీచేసినట్లు ఎస్ఐ తెలిపారు. మరి నోటీసుల విషయంలో స్మిత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.