తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
బుధవారం అనగా నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
పార్టీ మారడంతో రాజీనామా...
బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకే జులై 3న గులాబీ పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో సొంతగూటికి చేరారు. కేకే తన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో కలిసి మార్చ్ నెలలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో లాంఛనంగా చేరారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే జాతీయ నాయకుల సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరే ప్రక్రియలో భాగంగా గత నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత రోజు అంటే జులై 4న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. కేకే బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. పార్టీ మారితే ఆయనపై అనర్హత వేటు పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.
కాగా, కేకే స్వతహాగా కాంగ్రెస్ నేత. ఆయన పలుమార్లు పీసీసీ చీఫ్ గా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్క సారే గెలిచారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆయనకు పదవులు మాత్రం వరిస్తూనే వచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు బీఆర్ఎస్ లో కూడా సముచిత స్థానం దక్కింది అనడంలో అతిశయోక్తి లేదు.
కాంగ్రెస్ టికెట్ ఎవరికి?
2020లో బీఆర్ఎస్ నుంచి కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకు పైగా ఆయన పదవీ కాలం ఉంది. అయితే రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉపఎన్నిక ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కండిషన్ మీదనే కేకే కాంగ్రెస్ లో చేరారని కూడా టాక్ నడిచింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమించింది. దీంతో మరొకరిని రాజ్యసభకు ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా కేకే కి క్యాబినెట్ హోదా పదవి ముట్టజెప్పి రేస్ నుంచి సైడ్ చేసిందనే టాక్ కూడా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ టికెట్ ఉత్తరాదికి చెందిన పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఇవ్వనున్నట్టు ప్రచారం నడుస్తోంది.